
దూసుకొచ్చిన మృత్యువు
రైల్వే రెండు గేట్లను ఢీకొట్టి ఆటోపైకి వెళ్లిన లారీ
ఆరుగురికి గాయాలు ఆటోడ్రైవర్ మృతి
కైకలూరు /మండవల్లి : రైల్వే గేటు పడటంతో ఆగిన ఆటో పైకి ఎదురుగా ఉన్న రెండు గేట్లను ఢీకొని మరీ లారీ దూసుకొచ్చిన ఘటన సోమవారం రాత్రి మండవల్లి మండలం భైరవపట్నం గేటు వద్ద జరిగింది. గుడివాడ నుంచి కైకలూరుకు ఆరుగురు ప్రయాణికులతో వస్తున్న ఆటో భైరవపట్నం రైల్వేగేటు పడటంతో ఆగింది. ఇంతలో కైకలూరు వైపు నుంచి బియ్యం లోడుతో వస్తున్న లారీ డ్రైవర్ రెండు గేట్లను గుద్ది మరీ ఎదురుగా ఉన్న ఆటోని ఢీకొట్టింది. అదే వేగంతో రైల్వే గేటు వద్ద ద్విచక్ర వాహనంతో కైకలూరు రావడానికి నిలిచి ఉన్న చలమలశెట్టి గంగాధర్‌ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని సరస్వతి, లీలారాణి, మందా మోజేష్, చింతయ్య, మోహనరావులతో పాటు ఆటో డ్రైవర్ రవికి గాయాల య్యాయి.
వీరిలో ఆటోడ్రైవర్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించినా ఫలితం లేకపోయింది. అతను ప్రాణాలు కోల్పోయాడు. క్షతగాత్రులకు కైకలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ఘటన జరిగిందని సమాచారం. ఇదే రైల్వేగేటు వద్ద ఇటువంటి ఘటన ఏడాది క్రితం జరిగింది. అప్పుడు కూడా లారీ రెండు గేట్లను ఢీకొని ఓ మహిళ ప్రాణాలను బలితీసుకుంది.