న్యూఢిల్లీ: కాపలా లేని రైల్వే గేట్ల వద్ద జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు రైల్వే శాఖ.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సహకారం తీసుకుంది. ఇస్రో తయారుచేసిన ఉపగ్రహ సంబంధిత ఇంటిగ్రేటెడ్ చిప్‌లను రైలు ఇంజన్‌లలో అధికారులు అమర్చారు.
వీటి ద్వారా గేటు సమీపంలోకి రైలు రాగానే ఒక సైరన్ మోగేలా ఏర్పాట్లు చేశారు. ఈ పద్ధతిని తొలుత ముంబై, గువాహటి రాజధాని రైళ్లలో ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. కాపలా లేని రైల్వే గేటుకు 500 మీటర్ల దూరంలోకి రైలు రాగానే ఈ చిప్ ద్వారా సిగ్నల్స్ యాక్టివేట్ అయి సైరన్ మోగుతుంది. దీంతో ప్రజలు అప్రమత్తమవుతారు.