భార్య తనను కాదని, ముగ్గురు పిల్లలను విడిచి వెళ్లింది. వారి బాగోగులు చూసుకోలేక.. భార్య మరొకరితో వెళ్లిందన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఆ భర్త తీవ్రంగా కలతచెందాడు.
గద్వాలటౌన్: భార్య తనను కాదని, ముగ్గురు పిల్లలను విడిచి వెళ్లింది. వారి బాగోగులు చూసుకోలేక.. భార్య మరొకరితో వెళ్లిందన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఆ భర్త తీవ్రంగా కలతచెందాడు. తోడులేని జీవితం ఎందుకని పెంచి పెద్దచేసిన ఆ చేతులతోనే తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చాడు. పరిస్థితి విషమించడంతో తండ్రితో పాటు ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు.
స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన ఆదివారం గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని రెండో రైల్వేగేట్‌కు సమీపంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న గుడిసెలో నివాసం ఉంటున్న కుర్మన్న(35), రాజ్యమ్మ సంచార జీవనం సాగిస్తూ.. బిందెల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
వీరికి కుర్మక్క(9), నాని, ఇందు(5) ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. తన భార్య రాజ్యమ్మ వివాహేతర సంబంధం కొనసాగిస్తుందంటూ భర్త కుర్మన్న తరుచూ గొడవపడేవాడు. పలుమార్లు కులపెద్దల వద్ద పంచాయితీ కూడా నడిచింది. అయినప్పటికీ రాజ్యమ్మలో మార్పు కనిపించలేదు. దీంతో కుర్మన్న మనస్తాపానికి గురై మద్యం తాగుడుకు బానిసయ్యాడు. మూడురోజుల క్రితం
భార్య చెప్పకుండా ఇంటినుంచి వెళ్లిపోవడంతో కుర్మన్న మరింత కుంగిపోయాడు.
- శనివారం రాత్రి మద్యం సేవించి ఇంటికెళ్లాడు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న పురుగు మందును కూల్‌డ్రింక్‌లో కలిపి ఉంచాడు. పిల్లలను నిద్రలేపి వారిచేత బలవంతంగా తాగించి తానూ సేవించాడు. ఇంతలో కుర్మన్నతో పాటు కూతుళ్లు కుర్మక్క, ఇందు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మరో కూతురు నాని వాంతులు చేసుకుంది.
వెంటనే సమీపంలో గుడారాల్లో నివాసముంటున్న బంధువులకు వెళ్లి చెప్పింది. చికిత్సకోసం వారిని హుటాహుటిన గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే ముగ్గురూ ప్రాణాలు విడిచారు. చిన్నారి నాని ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటుంది. విషయం తెలుసుకున్న వెంటనే అర్ధరాత్రి సీఐ సురేష్, టౌన్ ఎస్‌ఐ సైదాబాబు ఆస్పత్రికి వచ్చి వివరాలు ఆరాతీశారు. మృతుడు కుర్మన్న బావమరిది పరశురాముడు ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నామని టౌన్ ఎస్‌ఐ సైదాబాబు తెలిపారు.
ఆర్డీఓ పరామర్శ
బతికి బయటపడిన నానిని ఆదివారం ఉదయం ఆర్డీఓ అబ్దుల్‌హమీద్, ఇన్‌చార్జి తహశీల్దార్ చింతామణి పటేల్ గద్వాల ఏరియా ఆస్పత్రిలో పరామర్శించారు. ఆస్పత్రిలో నానికి అందుతున్న వైద్యసేవలు, ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
చిట్టితల్లికి దిక్కెవరు?
గద్వాలటౌన్ : పిల్లలకు విషమిచ్చి తండ్రితో పాటు ఇద్దరు కూతుర్లు మృతిచెందిన సంఘటన బుడగ జంగాల కుటుంబాల్లో విషాదం నింపింది. శనివారం అర్ధరాత్రి భార్యపై కోపంతో భర్త కుర్మన్న వారి కూతుర్లు కుర్మక్క, నాని, ఇందులకు పురుగుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ను తాపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనలో తండ్రితో పాటు ఇద్దరు కూతుర్లు మృతి చెందగా నాని అనే ఏడేళ్ల చిన్నారి మృత్యువు నుంచి బయటపడింది. అయితే ఈ చిన్నారి ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో కోలుకుంటుంది. సంచార జీవితం సాగిస్తున్న కుర్మన్న కుటుంబం చిన్నాభిన్నమైంది. కూతుర్ల మంచి చెడులు చూడాల్సిన తల్లి రాజ్యమ్మ పిల్లలను వదలివెళ్లడంతో నానికి దిక్కులేకుండాపోయింది. సమీప బంధువులు ఉన్నప్పటికీ వారు సైతం సంచార జీవితం సాగిస్తూ బతుకుతున్నారు. గుడారాల్లో నివాసముంటున్న వారి బంధువులు చందాలు వేసుకొని అంత్యక్రియలు నిర్వహించారు. ఒంటరిగా మిగిలిన నానికి తల్లి ప్రేమ కరువైంది. తండ్రి, అక్కా, చెల్లెల్లు మృతి చెందిన విషయాన్ని సైతం అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు.