ముద్దు ముద్దు  ఆశ | special chit chat with actress madhubala | Sakshi
Sakshi News home page

ముద్దు ముద్దు  ఆశ

Published Sun, Mar 17 2019 12:10 AM | Last Updated on Sun, Mar 17 2019 12:10 AM

special chit chat with actress madhubala - Sakshi

చిన్ని చిన్ని ఆశ..నిజానికి ఆశ చిన్నదిగా ఉండదు.చిన్నదిగా ఉండేది ఆసలు ఆశే కాదేమో! చెట్టుకొమ్మ చివరన ఉన్న పండు చేతికి అందుతుందిగా.చిన్ని ఆశ కూడా అలాంటిదే!పై కొమ్మకు ఉన్న పండు ముత్యమంత ఆశ.మధుబాల ఎప్పుడూ పై కొమ్మనున్న పండుపైనే గురి పెట్టుకుంది.అందుకే ఎన్నో చిన్ని చిన్ని ఆశలు ఈజీగా అందాయి.అందనివి కూడా అందుకుంటానంటోంది.

సినిమాలకు దూరమైతే కొందరు ఫిజిక్, గ్లామర్‌ గురించి పట్టించుకోరు. చాలా గ్యాప్‌ తర్వాత దాదాపు నాలుగేళ్ల క్రితం క్యారెక్టర్‌ నటిగా ఎంట్రీ ఇచ్చారు. కానీ కథానాయికగా చేసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు? 
నేను పని చేసినా, చేయకపోయినా నా మనసులో నేనెప్పుడూ ఆర్టిస్ట్‌నే. నటిగా 15 ఏళ్లు గ్యాప్‌ వచ్చినా ప్రస్తుతానికి సినిమాలు చేయడం లేదంతే అనుకున్నాను. అందుకే నా లుక్స్‌ హీరోయిన్‌లానే ఉండాలనుకున్నాను. అవకాశం ఎప్పుడు తలుపు తట్టినా నేను రెడీగా ఉండాలి. డోర్‌ తట్టగానే రెడీ అయిపోయి షూటింగ్‌కి వెళ్లాలి. అంతేకానీ పాత గ్లామర్‌ తెచ్చుకోవడానికి అప్పటికప్పుడు కసరత్తులు మొదలు పెట్టకూడదు. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా ఫిజిక్‌ అలానే మెయిన్‌టైన్‌ చేసుకుంటూ వచ్చాను. 

‘చిన్ని చిన్ని ఆశ...’ అంటూ ‘రోజా’లో సందడి చేశారు. ప్రొఫెషనల్‌గా ఏవైనా చిన్ని చిన్ని ఆశలు మిగిలిపోయాయా? 
విభిన్నమైన పాత్రల్లో నటించాలనుకున్నాను, చాలా వరకూ ప్రయత్నించాను. అందరి ప్రసంశలు అందుకోవాలనుకున్నాను. అందుకున్నాను. ఆవార్డులు అందుకోవాలనుకున్నాను. ఆ చిన్న ఆశ మిగిలిపోయింది. ‘నువ్వు మంచి ఆర్టిస్ట్‌’ అని అందరూ చెబుతుంటారు. కానీ అవార్డుల రూపంలో ఆ ధ్రువీకరణ కావాలి. నటిగా కెరీర్‌ స్టార్టింగ్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడు అవార్డులు గురించి పెద్దగా ఆలోచించలేదు. ప్రేక్షకుల ప్రశంసలు చాలనుకున్నాను. అయితే అవార్డ్‌ అనేది ఓ అద్భుతమైన ఫీలింగ్‌. మన కోలీగ్స్, మనల్ని అభిమానించేవాళ్ల ముందు అవార్డు అందుకుంటూ ‘అమ్మానాన్న, దేవుడు, నన్ను సపోర్ట్‌ చేసిన అందరికీ థ్యాంక్యూ’ అంటూ హ్యాపీగా స్పీచ్‌ ఇస్తుంటే ఓ మంచి ఫీలింగ్‌ కలుగుతుంది.

మంచి ఆర్టిస్ట్‌ అని ప్రేక్షకులతో అనిపించుకున్నాక అవార్డు అనే ధ్రువీకరణ అవసరమంటారా?
స్పిరిచ్యువల్‌గా ఆలోచిస్తే అక్కర్లేదు. కానీ హ్యూమన్‌గా ఆలోచిస్తే నా ప్రైజ్‌ నాకు కావాలి. ధ్రువీకరణ అన్నది ముఖ్యమే. ప్రైజ్‌ ఎవరికి నచ్చదు? నటనని గుర్తించి ఓ అవార్డు ఇస్తే  ఎంత ఆనందంగా ఉంటుంది. అందుకే కథ చెప్పడానికి ఎవరు వచ్చినా అవార్డు వస్తుందా? అని అడుగుతుంటాను. వాళ్ల సినిమాల్లో నటింపజేయడం కోసం కచ్చితంగా వస్తుంది అంటుంటారు (నవ్వుతూ). ‘రోజా’లో చేసిన పాత్రకు నేషనల్‌ అవార్డు వస్తుందనుకున్నాను.. రాలేదు. కొంచెం నిరుత్సాహపడ్డాను.

ఆ సినిమాకు తమిళనాడు స్టేట్‌ అవార్డ్‌ వచ్చింది. జయలలితగారి చేతుల మీదగా అవార్డు అందుకున్నాను. నేనెప్పుడూ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకోలేదు. ఇప్పుడంటే లెక్కలేనన్ని అవార్డులు ఉన్నాయి కానీ మేం చేస్తున్నరోజుల్లో ఫిల్మ్‌ఫేర్‌ అంటే  ఐకానిక్‌ అవార్డులాగా భావించేవాళ్లం. ఆ అవార్డు నాకు రాలేదు. అది నా మైండ్‌లో అలా స్ట్రక్‌ అయిపోయింది. ‘పెహచాన్‌’ అనే సినిమా చేయడానికి అప్పట్లో ఎవరూ సాహసించలేదు. లీడ్‌ హీరోయిన్‌ వ్యాంప్‌ పాత్ర పోషించడం ఆ టైమ్‌లో రిస్క్‌. కానీ నేను చేశాను. అందరూ అభినందించారు కూడా. కానీ అవార్డు రాలేదు.

పర్సనల్‌ లైఫ్‌లో ఏదైనా చిన్ని చిన్ని ఆశ ?
దేవుడి దయ వల్ల నా లైఫ్‌ హ్యాపీ. మా అమ్మాయిల కలలు నెరవేరడం, నెరవేర్చడమే నాకు ఉన్న ఆశ. పెద్దమ్మాయి అమయా హీరోయిన్  అవ్వాలనుకుంటోంది. ‘నాకు తెలిసినవారిని నీకు పరిచయం చేస్తాను. నీ వర్క్‌ నువ్వు సరిగ్గా చేయగలిగితే, నీ విధి బావుంటే హీరోయిన్‌ అవుతావు’ అని తనతో చెప్పాను. చిన్నమ్మాయి కియా పదో తరగతి చదువుతోంది. 

మీ పిల్లలు మీ సినిమాలు చూసే ఉంటారు. మీలో నటి గురించి వాళ్ల కామెంట్‌?
నేను కథానాయికగా చేసిన సినిమాలను వాళ్లు సరిగ్గా చూడలేదు. యూ ట్యూబ్‌లో కొంచెం కొంచెం చూశారు. నా కమ్‌బ్యాక్‌ చిత్రం ‘లవ్‌ యూ మిస్టర్‌ కళాకార్‌’ మా పిల్లలకు నచ్చలేదు. ప్రస్తుతం వాళ్లు అనుష్కా శర్మ, ప్రియాంకా చోప్రా, ఆలియా భట్‌ లాంటి యూత్‌ఫుల్‌ హీరోయిన్లను ఇష్టపడుతున్నారు. ‘నువ్వు మరీ ఓల్డ్‌ స్టైల్‌ బాలీవుడ్‌ హీరోయిన్‌లా ఉన్నావు మమ్మీ’ అని అమయా చెప్పింది. ఓల్డ్‌ స్టైల్‌ అంటే ఏంటి? అని అడిగాను. ‘నీ సినిమాల్లో నీ ఎక్స్‌ప్రెషన్స్‌ అన్నీ సినిమాటిక్‌గా, డ్రమాటిక్‌గా ఉన్నాయి’ అని వివరించింది. ఇప్పటివరకూ నేను చాలా నాచురల్‌ యాక్టర్‌ని అనుకుంటూ వచ్చాను. ఆడియన్స్‌ కూడా అలానే చెప్పారు.

ఇప్పుడు నా పిల్లలకు నా నటన నాచురల్‌ అనిపించలేదు. ఆ కామెంట్‌ నా మైండ్‌లో స్టక్‌ అయిపోయింది. వెంటనే కొత్త హీరోయిన్లు ఏం చేస్తున్నారు? ఇండస్ట్రీలో ఏం మార్పులు వచ్చాయి? అని గమనించాను. కాపీ చేయడానికి కాదు... తెలుసుకోవడానికి. కొన్ని రోజుల తర్వాత ‘సబ్‌ టీక్‌ హై’ అనే షార్ట్‌ఫిల్మ్‌ చేశా.  దాని ప్రీమియర్‌కు పిల్లలిద్దర్నీ తీసుకెళ్లాను. చూసి ‘సబ్‌ టీక్‌ హై’ (అంతా బాగుంది) అన్నారు. వాళ్లకు చాలా నచ్చింది. ఎందుకంటే అందులో నేను యాక్ట్‌ చేయలేదు. జస్ట్‌ రియాక్ట్‌ అయ్యాను. నేను బాలచందర్‌గారి స్కూల్‌ నుంచి వచ్చాను. ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్‌ కనబడాలి అని నమ్మే దర్శకుడు ఆయన. ఇప్పుడు అంతగా ఎక్స్‌ప్రెషన్స్‌ అవసరంలేదనిపిస్తోంది.


మీరేమో మీ అమ్మాయిని హీరోయిన్‌ని చేస్తానంటున్నారు. ఇండస్ట్రీల్లో ఉన్న చాలా మంది ‘మనం కష్టపడ్డాం. మన పిల్లల్ని కూడా ఎందుకు ఇందులోకి?’ అని అనుకుంటారు. దానికి మీరేమంటారు? 
నాక్కూడా అలాంటి ఆలోచన ఉండేది. వర్క్‌ చేయడానికి ఈ ఇండస్ట్రీ మంచి ప్లేస్‌ కాదని కాదు.  మంచిది కాకపోతే నేను ఇండస్ట్రీకి మళ్లీ ఎందుకు తిరిగొస్తాను? ఐ లవ్‌ మై ఇండస్ట్రీ. కానీ నా పిల్లలను ఇండస్ట్రీ వద్దనుకోవడానికి ఓ కారణం ఉంది. శ్రీదేవి, నేను ఎప్పుడూ మా పిల్లల గురించే మాట్లాడుకునేవాళ్లం. మొదటిది.. మా పిల్లల్ని మాతో కచ్చితంగా పోలుస్తారు. రెండోది.. అభినందనలు, పేరు మాత్రమే కాదు చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఒక్కోసారి కొన్నేళ్లు పనిలేకుండా ఇంట్లో కూర్చోవాల్సి ఉంటుంది. కష్టపడినా సినిమా హిట్‌ అవదు. సినిమాలో బాగాలేవు అంటారు. ఇవన్నీ తట్టుకుని, ‘అయితే ఏంటి?’ అని పట్టించుకోని స్వభావం ఉండాలి. అప్పట్లో నేనలానే ఉండేదాన్ని. ఇప్పుడు నా కూతురు నా అంత స్ట్రాంగ్‌గా ఉండగలుగుతుందా? అని చిన్న భయం. అప్పట్లో నా సినిమా నచ్చిందా? వెల్‌ అండ్‌ గుడ్‌. నచ్చలేదా? ఐ డోంట్‌ కేర్‌. నాకు అలాంటి స్వభావం ఉండేది. దాంతో నన్ను యారోగెంట్‌ అనుకునేవారు. అయితే ఆ స్వభావం వల్ల నన్ను నేను రక్షించుకుంటున్నట్టుగా భావించాను. 

రక్షణ అంటే ఏ విధంగా?
ఫ్రెండ్లీగా కనిపిస్తే అన్నీ మొహం మీద చెప్పొచ్చు అనుకుని చనువు తీసుకునే అవకాశం ఉంది. అందుకే గంభీరంగానే ఉండేదాన్ని. దాంతో వెకిలిగా మాట్లాడే సాహసం చేసేవారు కాదు. ఇక వెకిలిగా ఎక్కడ ప్రవర్తిస్తారు? ఇది కరెక్టో కాదో నాకు తెలియదు కానీ ఈ జనరేషన్‌ అంతా చాలా సెన్సిటివ్, సాఫ్ట్‌. మేం చాలా టఫ్‌గా ఉండేవాళ్లం అని నా అభిప్రాయం. అప్పట్లో మీడియా చాలా తక్కువ. సినిమా బాగాలేదని రాసినా ఆ రోజు న్యూస్‌ చూడకపోతే ఆ విషయం మాకు తెలియదు. కానీ డిజిటల్‌ మీడియా వల్ల మనం ఎప్పుడో వేసుకున్న డ్రెస్‌ మీద కూడా టాపిక్‌లు నడుస్తాయి. బెస్ట్‌ లుక్స్, బ్యాడ్‌ లుక్స్‌ అని ప్రోగ్రామ్‌లు కూడా చేస్తుంటారు.

ఒక హీరోయిన్‌ను మరో హీరోయిన్‌తో పోలుస్తూ ఈవిడకంటే ఆవిడ బాగుందని అని రాస్తారు. ట్వీటర్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లో స్టార్స్‌ గురించి తరచూ వాళ్ల అభిప్రాయాలు పంచుకుంటుంటారు. గతంలో ఓ మేగజీన్‌ చూడకపోతే మా గురించి ఏమనుకుంటున్నారో మాకు తెలియదు. కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. అయినా మా అమ్మాయి హీరోయిన్‌ అవ్వాలను కుంటోంది కాబట్టి క్లిక్‌ అయితే గుడ్‌. అవ్వాలని కోరుకుంటున్నాను. నాకంటే పెద్ద సూపర్‌స్టార్‌ అవాలని ఆశ. సపోజ్‌ ఎవరైనా ‘నువ్వు ఆర్టిస్ట్‌గా బాలేవు’ అని అంటే తట్టుకుంటుందా? హ్యాండిల్‌ చేస్తుందా? అని భయం. అందుకని ఇండస్ట్రీ వద్దనుకున్నాను. కానీ పిల్లలకు నచ్చినది చేయనివ్వాలి. అందుకని ఓకే అన్నాను.

మీరు చాలా టఫ్‌గా ఉన్నాను అన్నారు. మరి ఆ స్వభావాన్ని మీ పిల్లలకు నేర్పిం లేదా? 
పిల్లలకు మాటల ద్వారా జీవిత పాఠాలు చెప్పలేం. పరిస్థితులు నేర్పుతుంటాయి. పడాలి, లేవాలి. ఒకటీ రెండుసార్లు దెబ్బ తింటే టఫ్‌గా మారతాం. వాళ్ల డెస్టినీ అదే అయితే వాళ్ల పాఠం వాళ్లే నేర్చుకుంటారని అనుకుంటున్నాను. విమర్శను ఎదుర్కొంటూ ముందుకెళ్తే ఓకే. అమ్మో నేను తట్టుకోలేను అంటే ఇంటికొచ్చేయ్‌ అంటాను. కానీ వాళ్ల ప్రయాణానికి మాత్రం అడ్డు చెప్పను. ఒక్కోసారి వాళ్లు ఈ పరిస్థితులను ఈజీగా హ్యాండిల్‌ చేసేస్తారేమో? నేనే ఓవర్‌గా థింక్‌ చేస్తున్నానేమో? అనిపిస్తుంటుంది. మా పేరెంట్స్‌ కూడా పిల్ల కష్టపడకూడదనుకుంటే నేనిక్కడిదాకా వచ్చేదాన్ని కాదుగా. 

అప్పట్లోనూ ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ ఉందని కొందరు సీనియర్‌ ఆర్టిస్టులు చెప్పారు. ప్రస్తుతం ‘మీటూ’ గురించి ఎక్కువగా వింటున్నాం. మరి ఇండస్ట్రీ సేఫ్‌ అంటారా?
ఇప్పుడు ప్రతిదీ ఓ టాపిక్‌ అవుతోంది. క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఎప్పుడూ ఉంది. అలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొని, ధైర్యంగా బయటకు వచ్చి చెప్పినవాళ్లందరికీ నా సెల్యూట్‌. అయితే ఇప్పుడు దేని గురించైనా టూ మచ్‌గా మాట్లాడుకుంటున్నాం అని నా నమ్మకం. అప్పట్లో స్త్రీలు ఏదీ బయటకు చెప్పలేదు. ఒకవేళ చెబితే వాళ్లనే తప్పుబడతారనే భయం ఉండేది. ప్రస్తుతం స్త్రీలకు బయటకు వచ్చి చెప్పుకోగలిగే ధైర్యం వచ్చింది.

ఏదైనా చెప్పుకుంటే నువ్వే తప్పు అనకుండా వింటున్నారు. ఇప్పుడు ఓ నటి నాకు ఇలా జరిగింది అని చెబితే ఆరోపణలు ఎదుర్కొన్నవారికి అవకాశాలు పోతున్నాయి. స్త్రీ ఫిర్యాదు చేస్తే తమ జాబ్‌ పోతుందేమో అని తప్పు చేయడానికి భయపడుతున్నారు. ఈ మార్పు ఒక్క ఫిల్మ్‌ ఇండస్ట్రీలోనే కాదు.. ఇతర రంగాల్లోనూ వచ్చింది. అందుకని మహిళలు సేఫ్‌గా ఉండొచ్చనే అనుకుంటున్నాను. అయితే స్త్రీ దీన్ని దుర్వినియోగం చేయకూడదు. ఒకవేళ తప్పుగా ఉపయోగిస్తే ‘మీటూ’ ఉద్యమానికి అర్థం ఉండదు.

మీ వైవాహిక జీవితం గురించి?
మొన్నే 20వ యానివర్శరీ పూర్తి చేసుకున్నాం. 1999 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నాం. మ్యారీడ్‌ లైఫ్‌ని వివరించమంటే ‘రోలర్‌ కోస్టర్‌ రైడ్‌’ అని చెబుతాను. రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ని ఫెంటాస్టిక్‌గా మొదలుపెడతాం. అలా పైకి వెళ్తాం. రయ్‌మని కిందకు వస్తాం. లైఫ్‌ కూడా అంతే. రోలర్‌ కోస్టర్‌ ఎక్కమని మనల్ని ఎవరూ ఫోర్స్‌ చేయరు. మనమే టికెట్టు కొనుక్కుని మరీ ఎక్కి భయపడతాం, ఆనందపడతాం, థ్రిల్‌ అవుతాం. ఎత్తుకు ఎగిరేప్పుడు చాలా బావుంటుంది, కిందకు వస్తున్నప్పుడు అసలెందుకు ఇది? అనే ఆలోచనలు కూడా వస్తాయి. కొద్దిసేపు స్మూత్‌గా ట్రావెల్‌ అవుతాం. మళ్లీ పైకి, కిందకు. లైఫ్‌ కూడా అంతే.

రైడ్‌లో రయ్‌మని కిందకు వస్తున్నప్పుడు అసలెందుకు ఎక్కాం అనుకుంటా అన్నారు. మ్యారీడ్‌ లైఫ్‌లోకి ఎందుకు ఎంటరయ్యామని ఎప్పుడైనా అనిపించిందా?
నా లైఫ్‌లో నేను బెటర్‌ పర్సన్‌ అవ్వడానికి నా పెళ్లి, మా పిల్లలు కారణం. వీళ్లు పర్ఫెక్ట్‌గా ఉన్నారని,  అన్ని పనులు సక్రమంగా చేస్తారని మనం మన కుటుంబ సభ్యులను ప్రేమించం. వాళ్లు ఎలా ఉన్నా, ఏం చేసినా ప్రేమించాలి. దానికి చాలా సహనం, భరించగలగడం, నేర్పు కావాలి. వాళ్లను యాక్సెప్ట్‌ చేయగలగాలి, మన్నించగలగాలి. అంతేకానీ ‘నీకంటే మంచివాళ్లు నా లైఫ్‌లోకి వచ్చి ఉండేవాళ్లేమో?’ అనుకుంటే దాంపత్య జీవితం బాగుండదు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్‌ కాదని నా అభిప్రాయం.

అందుకే మన జీవిత భాగస్వామి గురించి ఈ ప్రపంచం మొత్తంలో నువ్వే నాకు బెస్ట్‌ అని ఫీల్‌ అవగలిగాలి. మన పిల్లలకు మనం జన్మనిచ్చాం కాబట్టి సర్వ హక్కులూ మనకే అని వాళ్లను ఇబ్బందిపెట్టకూడదు. పక్కింటి పిల్లలతో పోల్చకూడదు. మీరు నా పిల్లలు అవ్వడం నేనెంతో లక్కీ, నువ్వు నా భర్తగా రావడం లక్కీ అనుకునే స్టేజ్‌కు రాగలిగితే అది ఓ గొప్ప స్పిరిచ్యువల్‌ లెసన్‌ అవుతుంది. మన అమ్మానాన్నల మీద కోపం వస్తే మధ్యలో వదిలేయం కదా. జీవిత భాగస్వామికి కూడా అదే ఆపాదించగలగాలి. జీవిత భాగస్వామి, పిల్లలు మన లైఫ్‌లో ఉండటం మన సంతోషం అని భావిస్తే అదే మంచి ఆధ్యాత్మిక పాఠం. 

మీ స్పిరిచ్యువల్‌ గురువు ఎవరు? 
ప్రత్యేకంగా ఎవరూ లేరు. కానీ చాలా మంది గురువులను కలిశాను. కొన్నాళ్లుగా శివానంద్‌ బాబాను యూట్యూబ్‌లో ఫాలో అవుతున్నాను. అయితే ఆయనే నా గురువు అని పూర్తిగా చెప్పలేను. 

కొందరు ఫ్రాడ్‌ బాబాల గురించి వింటున్నాం...
ఓ చిన్న లాజిక్‌ చెప్పనా? బాబాలు, మనం అందరం మనుషులమే. మనకు ఉన్నట్లుగానే కాళ్ల నొప్పులనో, తల నొప్పులనో వాళ్లకూ ఉంటాయి. ఎవరూ దేవుడు కాదు. అందరికీ దేవుడు లోపలుంటాడు. సాధన, జ్ఞానంలో బాబాజీలు మనకంటే కొంచెం గొప్ప వ్యక్తులు అవొచ్చు. అందుకే వాళ్లను టీచర్‌లా భావించాలి. అంతవరకే. కానీ బాబాలకు మనమే దేవుడి స్థాయినిస్తాం. అక్కడి నుంచి వాళ్లు పడిపోతే వాళ్లను నమ్మొద్దు.. ఫ్రాడ్‌ అంటాం. ఓషో రాసినట్టు ఎవ్వరూ రాయలేరని నమ్ముతాను. ఆ ఫిలాసఫీ ఎంతో గొప్పగా ఉంటుంది.

కానీ ఆయన పర్సనల్‌ లైఫ్‌లోకి వెళ్తే కొన్ని తప్పులుండొచ్చు. అసలు స్వామిజీలను కిందపడేంత పైకి లేపకూడదు. స్వామి నిత్యానంద మీద చాలా కేసులున్నాయి. కానీ ఆయన టీచింగ్స్‌ అద్భుతంగా ఉంటాయి. వాళ్లను కేవలం టీచర్స్‌లా భావించి, అనుసరిస్తే సంతోషంగా ఉంటాం. అలా కాకుండా వాళ్లకు బాబాగిరి (పాదాభివందనాలు, దేవుడికి ఇచ్చేలా హారతులు ఇవ్వడం)  చేస్తానంటే నాకు ఇష్టముండదు. గుడ్డి నమ్మకం ఏర్పరచుకోకూడదు. నేను దేవుడికి సరెండర్‌ అవ్వడానికి ఇష్టపడతాను, దేవుడని చెప్పుకునే మనిషికి కాదు. 

ఫైనల్లీ.. ఈ 26 న మీ బర్త్‌డే కదా... ప్లాన్స్‌ ఏంటి? 
ప్రతి సంవత్సరం బర్త్‌డేను గ్రాండ్‌గా చేసుకుంటాను. బాంబేలో వందమంది ఫ్రెండ్స్‌ వరకూ కలుస్తాం. పార్టీ చేసుకుంటాం. ఈసారి ఐదుగురు స్నేహితులం యూరప్‌ వెళ్తున్నాం. బర్త్‌డేకు రెండు రోజుల ముందు లండన్‌ వెళతాను. నా పిల్లలు అక్కడ ఉన్నారు. మా ఫ్యామిలీ అంతా కలిసి ఓ వారం రోజులు సెలబ్రేట్‌ చేసుకుంటాం. నా బర్త్‌డే సెలబ్రేషన్స్‌ మొత్తం పది రోజులు సాగుతాయి. 5 డేస్‌ నా ఫ్రెండ్స్‌తో, 5 డేస్‌ నా ఫ్యామిలీతో. యూరప్, లండన్‌ నుంచి ముంబైకొచ్చి మళ్లీ సెలబ్రేట్‌ చేసుకుంటా.
డి.జి. భవాని

తెలుగులో చేస్తున్న ‘కిట్టీ పార్టీ’ ఎలా ఉండబోతోంది? 
ఉమెన్‌ కూడా ఆడియన్స్‌ను «థియేటర్లకు తీసుకు రాగలరని నమ్మి దర్శకుడు పవన్‌ దీప్తీ భట్నాగర్, నన్ను, సుమన్‌ రంగనాథ్‌ని, భాగ్యశ్రీని, సదాని.. ఇలా ఆరుగురిని పెట్టి ఈ సినిమా తీస్తున్నాడు. నటీమణులకు ఫార్టీ ప్లస్‌ ఏజ్‌ ఉమెన్‌ ఉన్నా సినిమాలు చూస్తారు అని నమ్మకం ఏర్పడింది. సినిమాలు సమాజానికి రిఫ్లెక్షన్‌. 40 ఏళ్ల వయసులో ఉన్న నటీమణులను చూస్తున్నారంటే ఆడియన్స్‌లో మార్పు వచ్చింది. ఒకప్పుడు 30 ప్లస్‌ అంటే కెరీర్‌ ఫినీష్‌. 18కి లాంచ్‌ అయి 25 వరకూ కెరీర్‌ ఉండి పెళ్లి చేసుకోగానే తల్లి పాత్రలు ఇస్తారు. ఇప్పుడు అలా లేదు. మార్పు వచ్చింది.

మీ డైట్‌ ఏంటి?
నేను వెజిటేరియన్‌ని. ఆకలేసినప్పుడు మాత్రమే తింటాను. టెస్టీ ఫుడ్‌ ముందుంది కదా, లేకపోతే తినే టైమ్‌ అయింది కదా అని తినను. అది బాగా హెల్ప్‌ అయిందనుకుంటాను. పిజ్జా, పానీపూరీ అన్నీ తింటాను. తినడానికి టైమింగ్‌ కూడా పెట్టుకోను. కొన్నిసార్లు నా లంచ్‌ 12కే అయిపోతుంది. కొన్నిసార్లు 3 వరకూ ఆకలి అవ్వదు. 

టైమ్‌ టూ టైమ్‌ తినమంటారు. మీరు పాటిస్తున్నది కరెక్టేనంటారా? 
ఎవరు చెప్పారు? ఎవరో చెప్పింది కాదు, మీ కడుపు చెప్పింది వినండి. రోజుకి ఒక్కసారి తినేవాళ్లు యోగి. రెండుసార్లు తినేవాళ్లు భోగి, మూడుసార్లు తినేవాళ్లు రోగి. (నవ్వుతూ). తక్కువ తినడం వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడరు. ఇబ్బందల్లా ఎక్కువ తినప్పుడే కదా. ప్రస్తుతం ఉన్న లైఫ్‌ స్టైల్‌లో తక్కువ తిని జబ్బులు తెచ్చుకున్నవాళ్ళు లేరు. ఓవర్‌ ఈటింగ్‌ వల్లే అనారోగ్యం. జనరల్‌గా సౌత్‌ ఇండియన్‌ ఫుడ్‌ బెస్ట్‌ అంటారు. మా తాతలు, అమ్మమ్మలు నెయ్యి తిన్నారు.

కానీ సైన్స్‌ నెయ్యి తినొద్దు అని చెప్పింది. అయితే ఇప్పుడు నెయ్యిని సూపర్‌ ఫుడ్‌ అంటున్నారు. పరగడుపుతోనే ఓ స్పూన్‌ నెయ్యి తినండి అంటున్నారు. ఒకప్పుడు ఇడ్లీ, చపాతి, అన్నంలో ఓ రెండు స్పూన్లు నెయ్యి వేసేవారు. కారణం ఏంటి? కార్బోహైడ్రేట్స్, ఫాట్స్‌  రెండూ  కలిపి తింటే అరగడానికి సమయం పడుతుంది. ఆకలి వేయదు. మళ్లీ నాలుగైదు గంటల వరకూ ఏమీ తినం. ఉత్తి కార్బోహైడ్రేట్స్‌ మాత్రమే తింటే గంటలోనే ఆకలి అవుతుంది. మళ్లీ తింటాం. అందుకే నెయ్యి తినాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement