అవ్వ.. మై బెస్ట్‌ టీచర్‌ | government school has been telling kids the lessons for life | Sakshi
Sakshi News home page

అవ్వ.. మై బెస్ట్‌ టీచర్‌

Published Mon, Mar 25 2019 1:22 AM | Last Updated on Mon, Mar 25 2019 6:12 AM

government school has been telling kids the lessons for life - Sakshi

నగరాల్లో, పట్టణాల్లో ఉండే పిల్లలకు ఊరు తెలీదు.కొంతమందికి ఊళ్లోనే ఉన్నా..ఊళ్లోని అవ్వాతాతా కూడా తెలీదు!అవ్వాతాతా తెలిస్తే ఊరు తెలుస్తుంది.ఊళ్లోని కష్టం, త్యాగం, పోరాటం..ఇవన్నీ తెలుస్తాయి. జీవితం అంటే ఏంటో తెలుస్తుంది.అలా తెలియజప్పడం కోసం..ఓ గవర్నమెంట్‌ స్కూల్‌ హెచ్‌.ఎం.ఊళ్లోని పెద్దవాళ్లను బడికి రప్పిస్తున్నారు.పిల్లలకు బతుకు పాఠాలు చెప్పిస్తున్నారు.

‘‘మా షిన్నప్పుడు.. బగ్గ కరువొచ్చిండే.. రేగడి బురద తిని బతికినం..’’  అంటూ ఎనభై ఏళ్ల తాత గతాన్ని పంచుకున్నడు.‘‘చిన్న వయసుల్నే భర్త చనిపోయిండు. అప్పటికే పిల్లలు.. అప్పులు..  ఒక్కదాని రెక్కల మీద్నే పిల్లల్ని పెంచిపెద్ద జేసిన. అప్పులు దీర్చిన...’’ ఓ దళిత మహిళ కష్టం కొనసాగింది.‘‘పదోతరగతి ఫెయిలైనా ఫికర్‌లేదు.. పాస్‌పోర్ట్‌ దీసుడే లేటు.. గల్ఫ్‌లో ఉద్యోగం గ్యారెంటీ అనుకుంటున్నరెమో.. గట్లుండది ఆడ కథ. ఒక కొలువని జెప్పి ఇంకో కొలువుల వెడ్తరు. ఖలివెల్లి వీసాతో దీస్కపోతరు. ఎండాంటే ఎండ.. పొద్దున కట్కొచ్చుకున్న సద్ది  పదకొండు గంటలకే  పాశి పోతది.

డ్రైవర్‌ పని అని జెప్పి ఎర్రటెండల గొర్రెల్ని కాయవెడ్తరు.. ’’ గల్ఫ్‌ వలస కార్మికుడి అనుభవం మాటల్లో కళ్లకు కడ్తోంది. ‘‘అప్పుల యెవుసమ్‌ని నా మీదవెట్టి.. జాడపత్త లేకుండా వోయిండు మా ఆయన. ఒక్కదాన్నే.. గదే యెవుసమ్‌తోని అప్పులు గట్టిన.. ఇంకో రెండెకురాలు కొన్న...’’ ఓ మహిళా రైతు ధైర్యం ఖంగుమంది.వీళ్లంతా మన ప్రతినిధులుగా యూఎన్‌ఓ వేదిక మీదనో.. కామన్వెల్త్‌ మీటింగ్‌లో కామన్‌ మ్యాన్‌ స్వరంగానో ఉపన్యాసాలు ఇవ్వడం లేదు.  ఓ స్కూల్లో విద్యార్థులతో ముచ్చట పెడ్తున్నారు. తెలంగాణ, సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం, రామాజీ గ్రామం ప్రభుత్వ పాఠశాలలోనిదా దృశ్యం. 

తరంతో తరం డిస్‌కనెక్ట్‌!
రవాణా సౌకర్యం కూడా సరిగ్గాలేని పల్లెటూరు రామాజీ గ్రామం. అలాగని ఆధునిక విలాసాలకేం దూరంగా లేదు. టీవీ నుంచి మొబైల్‌ సెల్‌ఫోన్స్‌ దాకా.. జంక్‌ ఫుడ్‌ నుంచి వైఫై దాకా అన్నీ అందుబాటులో ఉన్నాయి. పోనీ  చైతన్యం లేని ఊరా అంటే కానే కాదు.  రజాకార్ల నుంచి ప్రత్యేక తెలంగాణా వరకు అన్ని ఉద్యమాల్లో పిడికిలి బిగించి.. పదం కలిపిన పల్లె. రజాకార్లకు ఎదురొడ్డి నిలబడ్డ వాళ్లు ఇంకా ఆ ఊళ్లో ఉన్నారు.. తొంబై, ఎనభై ఏళ్ల వయస్సుతో. ఆ తరంతో ఈ తరం డిస్కనెక్ట్‌ అయిపోయింది. ప్రైవేట్‌ చానళ్లు, యూట్యూబ్, వాట్సప్‌ గ్రూప్స్‌తో డీప్‌ కనెక్షన్‌ పెంచుకొని. ఉమ్మడి కుటుంబాల భౌతిక ఉనికే తప్ప అనుబంధాల అలికిడి లేని వాకిళ్లే అన్నీ.

ఆ ఊరి ఘనత భవిష్యత్‌గా కొనసాగకపోయినా కనీసం చరిత్రగానైనా నిలవాలి కదా.  అవ్వాతాతలతో మనుమలు, మనుమరాండ్లు మాట కలిపితేనే ఆ అనుభవసారం ఈ తరానికి చేరుతుంది. ఇళ్లల్లో ఆ సీన్‌ లేదు. పాఠశాలను వేదికగా చేస్తే? ఉదయం బడిలో జరిగే ప్రార్థనా సమయంలో భాగం చేస్తే? తనకు వచ్చిన ఆలోచనను, దానికి కారణమైన తన పరిశీలనను తోటి ఉపాధ్యాయులతో చర్చించారు రామాజీ గ్రామ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పెద్దింటి అశోక్‌ కుమార్‌. అందరికీ నచ్చింది. సరే అన్నారు. 

బడిలో బతుకు పాఠాలు
ఆ ఊళ్లోని పెద్దమనుషులను కలిశారు అశోక్‌ కుమార్‌. విషయం చెప్పారు. ‘‘మేమేం జెప్తం? పుస్తకాల పాఠాలను ఇడిశిపెట్టి మా మాటలు వింటరా పిల్లలు?’’ ఆ పెద్దల సందేహం. ‘‘పుస్తకంలో పాఠాలు మేం చూసుకుంటాంలే గాని ఇప్పుడు పిల్లలకు కావాల్సింది బతుకు పాఠాలే’’ స్పష్టం చేశారు స్కూల్‌ సిబ్బంది. ఆ తెల్లవారి నుంచే ఆ ఊరి పెద్దలు ఒక్కొక్కరే ఆ బడికి రోజొక ఆత్మీయ అతిథిగా ఆహ్వానం అందుకోవడం మొదలైంది. పది నిమిషాల ప్రార్థన తర్వాత వీరి బతుకు పాఠం ఉంటుంది. ఇంట్లో మనుమలు, మనమరాండ్లతో ముచ్చటించినట్టే ముచ్చటిస్తారు. వాళ్ల జీవితంలోని కష్టసుఖాలను చెప్తారు. ధైర్యంగా నిలబడ్డ తీరుని కథలా వినిపిస్తారు. 

మార్పు కనిపిస్తోంది
పెద్దల అనుభవాలు.. వింటున్న ఆ పిల్లల మీద మంచి ప్రభావాన్నే చూపుతున్నాయి. తాతా, అవ్వలు వాళ్లకు కొత్తగా.. హీరోలుగా  కనపడ్తున్నారు. ఇన్నాళ్లూ వాళ్ల విలువ తెలియలేదు. తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. ‘‘ఒరేయ్‌ నాన్నా.. ఓ గ్లాసుడు మంచినీళ్లు తేరా బాబూ’’ అని ప్రేమగా అడిగిన తాతను ‘‘పో.. ముసలోడా... నేను గేమ్‌ ఆడుకుంటున్నా కనబడట్లేదా?’’ అంటూ సెల్‌ఫోన్లోంచి మొహం ఎత్తకుండానే చీదరించుకున్న రోజులు సిగ్గుపడేలా చేస్తున్నాయి. ‘‘అమ్మీ.. కొంచెం.. గీ జాండుబామ్‌ రాయవా?’’ అంటూ ప్రాధేయపడిన నానమ్మను ‘‘నేనేం చేస్తున్ననో కనవడ్తలేదా’’ అంటూ టీవీ ముందు నుంచి కదలకుండా ఈసడించుకున్న క్షణాలు తల దించుకునేలా చేస్తున్నాయి. తప్పు తెలుసుకునేలా చేస్తున్నాయి. ఇది శిక్ష కాదు శిక్షణ అని గ్రహించారు పిల్లలు.  కుటుంబాలు.. కుటుంబాల్లో పెద్దల అవసరమేంటో అర్థమైంది.

ఉద్వేగంతో మనసు ఉప్పొగింది. అమ్మమ్మ, నానమ్మ, తాతల మాటలతో వాళ్లే కాదు  వాళ్ల  ఊరి గొప్పదనమూ తెలిసింది. అన్నిటికీ మించి ఎన్ని సమస్యలెదురైనా తట్టుకొని నిలబడాలి కాని జీవితంలోంచి పారిపోకూడదు.. గెలుపు, ఓటములను సమంగా స్వీకరించాలనే  సత్యం బోధపడింది. ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. అందుకే పెద్ద వాళ్ల గురించి చిన్న చిన్న కథలు, మా ఊరు అంటూ కవితలూ రాయడం ప్రారంభించారు ఆ పిల్లలు. ఇలాంటి మార్పునే కోరుకున్నారు ఉపాధ్యాయులు. ఇది కంటిన్యూ కావాలని తాపత్రయపడ్తున్నారు. అందుకే ఆ పిల్లలకు హోమ్‌వర్క్‌ ఇచ్చారు. బడి నుంచి ఇంటికి వెళ్లగానే ఒక్క అరగంట పెద్దవాళ్లతో గడపమని.

కనీసం వాళ్ల పక్కన కూర్చోమని. టీవీ చూస్తూ కాలక్షేపం చేసే పిల్లలు ఈ హోమ్‌వర్క్‌ను మాత్రం కచ్చితంగా చేస్తున్నారు. అంతేకాదు.. ఆ స్ఫూర్తిని పాఠాలకు సంబంధించిన హోమ్‌వర్క్‌కూ అప్లయ్‌ చేసుకుంటున్నారు. బడిలో చురుగ్గా ఉంటున్నారు. పాఠాలను శ్రద్ధగా వింటున్నారు. ఇంట్లో పెద్దవాళ్లకు పనుల్లో సహాయం చేస్తున్నారు. టీవీ చూడ్డం తగ్గించారు. బాధ్యత నేర్చుకుంటున్నారు. తాత, నానమ్మ, అమ్మమ్మలంటేనే  కాదు అమ్మానాన్న పట్లా గౌరవంగా ఉంటున్నారు. తోబుట్టువులతో ప్రేమగా మసలుకుంటున్నారు. ఇదంతా .. పెద్దల జీవన పాఠాలతో అబ్బిన చదువు. దీనికీ అక్షరాభ్యాసం చేయించింది  రామాజీగ్రామ పాఠశాల టీచర్లే! ఈ ప్రాక్టీస్‌తో ఆ ఊళ్లోని పెద్దల్లో కూడా ఉత్సాహం కనబడుతోంది. 

ఇక్కడితో ఆగిపోలేదు
ఏ విద్యార్థి పుట్టినరోజు వచ్చినా .. ఆ విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయులే వెళ్లి మొక్కను నాటుతున్నారు. దానికి నీళ్లుపోసి జాగ్రత్తగా పెంచుకునే బాధ్యతను ఆ ఇంటి పెద్దలకు, పిల్లలకు అప్పజెప్తున్నారు. సెలవుల్లో ఖాళీగా కూర్చోకుండా పిల్లలకు లైఫ్‌లోని ప్రాక్టికాలిటీ బోధిస్తున్నారు. బంధువులకు, స్నేహితులకు ఈ పిల్లల చేత ఉత్తరాలు రాయిస్తున్నారు. మద్యం వల్ల కలిగే చేటు గురించి పిల్లలతో పెద్దలకు చెప్పిస్తున్నారు. ‘‘ఇవన్నీ ఇప్పటికిప్పుడు ఫలితాలనివ్వకపోవచ్చు.. ఓ ప్రయాణానికి దారులైతే వేస్తాయి కదా’’ అంటారు ఆ ఊరి ఉపాధ్యాయులు. 
– సరస్వతి రమ

కష్టం విలువ తెలియజెప్పాలి
పిల్లలకు ఏ కష్టం కలగకుండా పెంచడం మంచిదే.. కాని కష్టం విలువ చెప్పడం ఇంకా మంచిది. అవసరం కూడా. మీ పిల్లల భవిష్యత్‌ కోసం మీరెంత కష్టపడ్తున్నారు.. ఎక్కడెక్కడ అప్పులు చేస్తున్నారు.. ఎన్నెన్ని అవమానాలు పడ్తున్నారో చెప్పండి. అదీ ఒక పాఠమే. మీ పిల్లలను బాధ్యతగల పౌరులుగా తయారు చేసే చదువే. పిల్లలకూ  చెప్పేదేంటేంటే.. చదువు బడిలోనే ఉండదు. బడి ఒక వేదిక మాత్రమే. పెద్ద వాళ్ల దగ్గరా ఉంటుంది. వాళ్లతో ఇంటరాక్ట్‌ అవండి. జీవితంలో నిలదొక్కుకోవడానికి అదే ఉపయోగపడుతుంది. ఆత్యస్థయిర్యాన్నిస్తుంది. వాళ్ల బాధ్యతల్లో పాలుపంచుకోండి. బ్యాలెన్సింగ్‌ అలవడుతుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement