జీవితాన్ని బట్టే ‘పాలసీ’ మారుతుంటుంది!
జీవితంలో చాలా మజిలీలుంటాయి. ఒక్కడిగా ఉన్నప్పుడు ఎలాంటి బాదరబందీ ఉండదు. కానీ పెళ్లయితే!! ఆ తరవాత పిల్లలు పుడితే? ఇలా కుటుంబం పెరుగుతున్న కొద్దీ ఆర్థికపరమైన అవసరాలు, సమస్యలు, బాధ్యతలు పెరుగుతూ వస్తాయి. వీటిని అధిగమించడానికి జీవితంలోని పెళ్లి, పిల్లలు వంటి ప్రతి సందర్భంలోనూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే వారిని బాగా చూసుకోగలం. అలాగే ప్రతి దశలోనూ ఇన్సూరెన్స్ ప్రాధాన్యాలు మారుతూ ఉంటాయి. అలాంటి సమయాల్లో మనకు ఏ ఏ పాలసీలు అవసరమౌతాయో ఒకసారి చూద్దాం...
కొత్తగా పెళ్లైతే: ఇప్పుడు సాధారణంగా యుక్త వయసులో ఉంటాం. జీవితంలోని ప్రధాన ఘట్టం పెళ్లి. పెళ్లితో జీవనం, జీవితం రెండూ మారతాయి. పెళ్లైన తర్వాత జీవితం ఆరోగ్యకరంగా ముందుకు సాగాలంటే.. అప్పుడు ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తప్పనిసరిగా తీసుకోవాలి. దీంతో కుటుంబ ఆరోగ్య సమస్యల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. మీకు పిల్లలు పుట్టే సందర్భంలో కూడా ఈ పాలసీ మీకు మద్దతుగా నిలుస్తుంది.
కొత్త ఇల్లు కొంటే: సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. మీరు కొత్తగా ఒక ఇంటిని నిర్మించుకున్నారనుకుందాం!! కాకపోతే భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, జల విపత్తుల నుంచి దానికి ఏమైనా అవుతుందనే భయం ఉండటం సహజం. అప్పుడెలా? ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి ఇంటిని రక్షించుకోవాలంటే.. ఇంటికి బీమాను తీసుకోవాలి. దీంతో ఇంటికి ఏమైనా జరిగినా కూడా ఆర్థికంగా ధీమాగా ఉండొచ్చు. ఇంటి బీమాతో పాటే ఇంట్లోని వస్తువులకు కూడా ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చు.
ఆరోగ్య బీమాకు ప్రాధాన్యమివ్వండి: వయసు పెరిగే కొద్ది ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతూ వస్తాయి. అందుకే ఇంట్లోని ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవాలి. మీరు ఇది వరకే ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను తీసుకుంటే.. దాన్ని వ్యక్తిగత ఆరోగ్య బీమా కిందకు మార్చుకోండి. ఇలా చేస్తే పాత పాలసీలోని పలు ప్రయోజనాలు కొత్త పాలసీకి కూడా వర్తిస్తాయి. అదే మీకు మీరు పనిచేస్తోన్న సంస్థ ఆరోగ్య బీమాను అందిస్తే.. అందులో మీ భాగస్వామి పేరు కూడా ఉండేలా చూసుకోండి.
కారుందా?: మీకు కారు ఉందనుకోండి. దానితో మీరు లాంగ్ డ్రైవ్‌లకు లేదా ఎక్కడికైనా వెళుతూ ఉంటారు. అలాంటి సమయాల్లో కారుకు ఏమైనా ప్రమాదం జరిగితే? అందుకే కారుకు కచ్చితంగా ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. ఇది సరిపడినంత ఉండాలి. ఇది వరకే పాలసీ ఉంటే.. అది దేనిదేనికి... ఎలాంటి సందర్భాల్లో వర్తిస్తుందో ఒక సారి సరిచూసుకోండి.
పదవీ విరమణ: విశ్రాంతి తీసుకోవాల్సిన సమ యం. ఇలాంటప్పుడు చాలా మంది కొత్త ప్రదేశాలను చూడాలనుకుంటారు. విహార యాత్రలకు కొత్త ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు.. ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను తప్పక తీసుకోవాలి. టూర్‌కు వెళ్లిన చోట ఊహించని సంఘటనలు జరిగితే.. ఇది మనకు బాసగటా నిలుస్తుంది.
ఊహించని ప్రమాదాలు: అకస్మాత్తుగా మనకేమైనా జరిగినా మనపై ఆధారపడ్డ వారు ఎలాంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కోకుండా ఉండాలనుకుంటే మాత్రం వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకోండి. అలాగే హాస్పిటల్ ఖర్చులు వంటి తదితర వాటి నుంచి ఉపశమనం పొందొచ్చు.
- పునీత్ సాహ్ని
ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ హెడ్, ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్