పెళ్లయి నాలుగేళ్లయినా సంతానం లేదు... తగిన సలహా ఇవ్వండి | Meet A Child Gynecologist To Find A Solution To Your Problem | Sakshi
Sakshi News home page

పెళ్లయి నాలుగేళ్లయినా సంతానం లేదు... తగిన సలహా ఇవ్వండి

Published Mon, Oct 14 2019 1:59 AM | Last Updated on Mon, Oct 14 2019 1:59 AM

Meet A Child Gynecologist To Find A Solution To Your Problem - Sakshi

నా వయసు 39 ఏళ్లు. నా భార్య వయసు 36 ఏళ్లు. కెరీర్‌లో పడి పెళ్లి లేటయ్యింది. పెళ్లయి నాలుగేళ్లయినా పిల్లలు లేరని మా ఇరువైపుల తల్లిదండ్రులు, పెద్దల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నాం. ‘బాగా లేటైంది కదా... ఇప్పుడు కష్టమే’ అని కొందరు భయపెడుతున్నారు. మాకు ఏ రకమైన ఇతర సమస్యలూ లేవు. దయచేసి పిల్లల తొందరగా పుట్టడానికి మేము ఏయే పరీక్షలు చేయించుకోవాలి వంటి వివరాలను తెలియజేయగలరు.

సంతానం ఇప్పుడు అందని మానిపండేమీ కాదు... ఆధునిక వైద్య చికిత్సలతో సంతానలేమికి చెక్‌ పెట్టవచ్చు. ముందుగా మీరు అనుభవజ్ఞులైన గైనకాలజిస్ట్‌ను కలవండి. సంతానలేమితో వచ్చిన దంపతులకు ముందుగా సంతాన పొందలేకపోవడానికి వారికి గల కారణాలేమిటో వైద్యులు తొలుత గుర్తిస్తారు. వాటిని అధిగమించడానికి తోడ్పడగల ప్రణాళికలను సిద్ధం చేస్తారు. ఆ ప్రణాళికలకు  అనుగుణంగా నిపుణులు–అనుభవజ్ఞులైన వైద్యుల బృందంతో పాటు ఆధునికమైన సౌకర్యాలు కలిగిన కేంద్రాల్లో తగిన చికిత్స అందించి విజయవంతమైన ఫలితాలు సాధించగలుగుతున్నారు. సంతానం పొందాలనుకునే వారు ఎలాంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించకుండా ఏడాది వరకు ప్రయత్నించినా గర్భం రాకపోతే దాన్ని వైద్యులు ‘ఇన్‌ఫెర్టిలిటీ’గా పరిగణిస్తారు. ఈ సంతానలేమికి కొన్ని ప్రధాన కారణాలను వైద్యనిపుణులు గుర్తించారు. అవి...

ఓవ్యులేషన్‌ డిజార్డర్‌ : కొంతమంది మహిళల్లో పలు కారణాల వల్ల అండాలు విడుదల కావు. లేదా సహజమైన క్రమంలో విడుదల కావు. హార్మోన్లతో పాటు రుతుక్రమాన్ని అదుపు చేసే అనేక కారణాలు ఈ పరిస్థితికి దారితీస్తాయి. పిట్యుటరీ గ్రంథి – అండాశయాలు – ఫాలికిల్స్‌ మధ్య సున్నితమైన సమాచార మార్పిడి సంబంధం సరిగా పనిచేయకపోవడం, చాలాకాలం పాటు హార్మోనక్ష ఆధారిత గర్భనిరోధక విధానాలు అనుసరించడం కూడా ఇందుకు ఒక కారణం అయ్యేందుకు అవకాశం ఉంది.

లో స్పెర్మ్‌ కౌంట్‌
సంతానాన్ని పొందే అవకాశాలు పుష్కలంగా ఉండాలంటే పురుషుడి ఒక మిల్లీలీటర్‌ వీర్యంలో రెండు కోట్ల పురుష బీజకణాలు ఉండాలి. ఈ సంఖ్య కోటీ యాభైలక్షలు... లేదా అంతకంటే తక్కువ ఉన్నట్లయితే దాన్ని లో–స్పెర్మ్‌ కౌంట్‌గా పరిగణిస్తారు. ఈ పురుష బీజకణాల సంఖ్య సహజ పద్ధతిలో అండాన్ని ఫలదీకరించడానికి సరిపోదు. అందువల్ల దంపతుల్లో సంతానలేమి ఏర్పడే అవకాశం ఉంది. మద్యం అలవాటు, పొగాకు వాడటం, అనారోగ్యకరమైన జీవనశైలి ఇలా స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడానికి కారణమవుతున్నట్లు గుర్తించారు.

అనారోగ్యకరమైన పురుష బీజకణాలు
 పురుష బీజ కణాల కదలికల్లో (దాని తోక భాగంలో చలనంలో) లోపం, పురుష బీజ కణం నిర్మాణంలో (రూపం – తయారుకావడం – డీఎన్‌ఏ) లోపం వంటివి కూడా సంతానలేమికి కారణమవుతాయి. సంతానలేమి కేసుల్లో దాదాపు 25 శాతం ఈ కారణంవల్లనేనని ఒక అంచనా. పోషకాలు కొరవడిన అనారోగ్యకరమైన ఆహారం, పొగాకు, మద్యపానం వంటి అలవాట్లు పురుష బీజ కణాల ఉత్పత్తి, నాణ్యతను దెబ్బతీస్తున్నాయి.

ఫెలోపియన్‌ ట్యూబ్స్‌ మూసుకుపోవడం
అండాశయం నుంచి విడుదలైన అండాలు గర్భాశయానికి రావడం అన్నది ఫెలోపియన్‌ ట్యూబ్స్‌ నుంచి ప్రయణించడం ద్వారా జరుగుతుంది. ఒకవేళ ఈ గొట్టాలు మూసుకుపోయినట్లయితే ఫలదీకరణం చెందిన అండం (జైగోట్‌)... గర్భాశయానికి చేరి గర్భం వచ్చే అవకాశాలు ఉండవు. పెల్విక్‌ ఇన్ఫెక్షన్‌ డిసీజ్‌ (పీఐడీ... అంటే కటి ప్రాంతంలో ఇన్ఫెక్షన్‌ రావడం), ఎండోమెట్రియాసిస్, లైంగికంగా వ్యాపించే రోగాలు (సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ డీసీజెస్‌–ఎస్‌టీడీస్‌) వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఫెలోపియన్‌ టీబీ కారణంగా కూడా ఈ గొట్టాలు మూసుకుపోవచ్చు.

ఎండోమెట్రియాసిస్‌
సంతానలేమితో బాధపడుతున్న మహిళల్లో దాదాపు మూడోవంతు (35 శాతం) ఎండోమెట్రియాసిసే ఇందుకు కారణం. గర్భాశయాన్ని గర్భధారణకు సిద్ధం ప్రక్రియలో భాగంగా ఏర్పడే ఎండోమెట్రియమ్‌ పొర రుతు సమయంలో మొత్తంగా విడిపోకుండా అక్కడే ఉండిపోతుంది. అలా ఉండిపోయిన ఆ పొర అంతర్గత అవయవాల్లో ఇతర భాగాలకు అతుక్కుపోతుంది. గర్భాశయంలో మిగిలిపోయిన ఎండోమెట్రియం... ఫలదీకరణం చెందిన అండం (జైగోట్‌)... అక్కడ స్థిరపడానికి ఆటంకం అవుతుంది. మరోవైపు ఇతర భాగాల్లో అతుక్కున్న ఎండోమెట్రియమ్‌ కొన్నిసార్లు ఫిలోపియన్‌ ట్యూబ్స్‌లో అడ్డంకిగా మారి అండం–పురుషబీజకణం కలవకుండా అడ్డుపడుతుంది.

అనారోగ్యకరమైన అండం
 పోషకాహారలోపం, విపరీతమైన శారీరక–మాసనిక ఒత్తిడి, హార్మోన్లలోపం, అనారోగ్యకరమైన జీవనశైలి, వయసుపైబడటం వంటి కారణాల వల్ల మహిళల్లో అండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది సహజంగానే అండం ఫలదీకరణం, గర్భం దాల్చడంపైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

లోపాలను గుర్తించే పరీక్షలు
సంతానలేమికి గల కారణాలను తెలుసుకునేందుకు దంపతులిద్దరికీ విడివిడిగా కొన్ని పరీక్షలు నిర్వహించాలి. మహిళల్లో సంతానలేమికి దారితీసిన పరిస్తితులను గుర్తించడానికి ప్రాథమిక పరీక్షగా ఓవ్యులేషన్‌ మానిటరింగ్‌ చేస్తారు. ఇందుకుగాను గర్భాశయానికి అల్ట్రాసౌండ్‌ టెస్ట్, ట్యూబ్యులార్‌ ప్రెగ్నెన్సీ టెస్ట్, హార్మోన్‌ టెస్ట్‌ చేస్తారు. ఈ పరీక్షల ఫలితాలపైన ఆధారపడి చికిత్సను నిర్ణయించేందుకు ముందుగా మరికొన్ని పరీక్షలు జరపాల్సిరావచ్చు. అవి... ఎఫ్‌ఎస్‌హెచ్, ఈ2, ఎల్‌.హెచ్‌., హెచసీవీ యాంటీబాడీస్, కంప్లీట్‌ హీమోగ్రామ్, హెచ్‌ఐవీ – 1, 2 యాంటీబాడీస్, టీఎస్‌హెచ్, హెచ్‌పీఎల్‌సీ, ఏఎంహెచ్, రుబెల్లా 1 జీజీ, ఎఫ్‌టీ3, ఎఫ్‌టీ4, బ్లడ్‌షుగర్‌ మానిటరింగ్, ప్రోలాక్టిన్, హెచ్‌బీఎస్‌ యాంటిజెన్, యాంటీహెచ్బీసీ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అదేసమయంలో పురుషుడిలో గల లోపాలను తెలుసుకునేందుకు ముందుగా సెమన్‌ ఎనాలిసిస్‌ పరీక్ష చేయించుకోవాల్సిందిగా సిఫార్సు చేస్తారు.

ఈ పరీక్ష ద్వారా ఆ వ్యక్తికి గల ఫలదీకరణ సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు. సెమన్‌ ఎనాలజిస్‌లో పురుష బీజకణాలు తక్కువగా ఉండటం, వాటి రూపంలో లోపం, వాటిలో కదలిక శక్తి తగినంతగా లేకపోవడం వంటి అసాధారణ పరిస్థితులు ఏమైనా బయటపడితే... డాక్టర్‌ మరికొన్ని పరీక్షలకు సిఫార్సు చేయవచ్చు. అవి... అడ్వాన్స్‌డ్‌ స్మెర్మ్‌ ఎనాలిసిస్‌ పరీక్ష, కంప్లీట్‌ హీమోగ్రామ్, టెస్టిక్యులార్‌ బయాప్సీ, హెచ్‌బీఎస్‌ యాంటిజెన్, స్క్రోటల్‌ అల్ట్రాసౌండ్, హెచ్‌సీవీ యాంటిబాడీస్, జెనెటిక్‌ టెస్ట్, హెచ్‌ఐవీ 1, 2 యాంటీబాడీస్, క్యారియోటైప్‌ ఎగ్జామినేషన్, వీడీఆర్‌ఎల్‌ వంటి పరీక్షలను ప్రాథమిక పరీక్షల తర్వాత దంపతులకు అవసరమైన ఈ అదనపు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు... ఆ ఫలితాల ఆధారంగా వారు సంతాన్ని పొందలేకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తారు. దానికి అనుగుణంగా వారికి అవసరమైన చికిత్సా విధానాన్ని గుర్తించి, దాన్ని అమలు చేస్తారు.

డాక్టర్‌ ధాత్రీ కుమారి, సీనియర్‌ ఇన్‌ఫెర్టిలిటీ అండ్‌ ఐవీఎఫ్‌ వైద్యనిపుణులు,
యశోద ‘మదర్‌ అండ్‌ ఛైల్డ్‌’ ఇన్‌స్టిట్యూట్‌  యశోద హస్పిటల్స్, సికింద్రాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement