వివాహేతర సంబంధం: ప్లీజ్‌.. ఆలోచించండి ఓ అమ్మానాన్న! | Why Married People Cheat Reason Behind Extramarital Affairs | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం: ప్లీజ్‌.. ఆలోచించండి ఓ అమ్మానాన్న!

Published Thu, Sep 29 2022 2:18 PM | Last Updated on Thu, Sep 29 2022 2:32 PM

Why Married People Cheat Reason Behind Extramarital Affairs - Sakshi

కట్టుబాట్లను దాటిన ఇష్టాలు, బంధాలను బలి కోరే సంబంధాలు, నైతికం కాని స్నేహాలు జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. దారి తప్పుతున్న దంపతులు పిల్లల బతుకులను చేతులారా ధ్వంసం చేస్తున్నారు. వివాహేతర సంబంధాలతో వినాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నారు. జిల్లాలోనూ ఈ పెడధోరణి పెచ్చుమీరుతోంది. ఆదర్శ దాంపత్యాలు అడుగడుగునా కనిపిస్తున్నా.. ఎక్కడో ఓ చోట ఈ విషపు గుళికలా ఇలాంటి అక్రమ సంబంధాలూ తారస పడుతున్నాయి. ఒక్కసారి కట్టు తప్పితే ఆ తప్పులకు మూల్యంగా ప్రాణాలే పోతున్నాయి. 

టెక్కలి: హిరమండలానికి చెందిన ఓ వివాహిత ప్రియుడి మోజులో పడి భర్తను దారుణంగా చంపేసి పెట్రోల్‌ పోసి తగలబెట్టేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆరా తీస్తే గానీ వివాహిత మోసం బయటపడలేదు. రణస్థలం మండలం దన్నానపేట గ్రామంలో వివాహేతర సంబంధంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా మరో వ్యక్తి ఉరి వేసుకుని ప్రాణాలు విడిచాడు. మహిళ భర్త గతంలో చనిపోగా కూరగాయలు అమ్ముకుంటూ ఒకే ఒక్క కుమారుడిని పోషిస్తోంది.

మృతి చెందిన మరో వ్యక్తికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహేతర సంబంధంతో ఒకే సారి ఇరువురూ మృతి చెందడంతో, మహిళకు చెందిన కుమారుడు అనాథగా మారగా, మరో వ్యక్తి కుటుంబం చిన్నాభిన్నమైంది. ఇలాంటి సంఘటనలు జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. దాదాపు గ్రామీణ నేపథ్యం గల మన జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం ఆశ్చర్యకరమే. జీవితాంతం కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడూనీడగా ఉండి సాఫీగా సాగాల్సిన సంసారాలను వివాహేతర సంబంధాలు విచ్ఛిన్నం చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని అభం శుభం తెలియని పిల్లల్ని అత్యంత పాశవికంగా చంపేస్తున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహాలతో పాటు ప్రేమ వివాహాల్లో కూడా వివాహేతర సంబంధాలు కనిపిస్తున్నాయి.  

పాపం పసివారు.. 
అక్రమ సంబంధాలు భార్యాభర్తల గొడవలతో ముగిసిపోవు. వాటి ప్రభావం పిల్లలపై అధికంగా పడుతోంది. ఎదిగే వయసులో తల్లిదండ్రులు గొడవ పడడం చూసిన పిల్లల మనసులు తీవ్రంగా గాయపడతాయి. మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోవడం, మరొకరు ఆ కారణంతో జైలు పాలవడం వంటి ఘటనలతో చిన్నారుల బాల్యంపై మరక పడుతోంది. అది జీవితకాలం వెంటాడుతుంది. తల్లిదండ్రుల సంరక్షణలో చక్కగా నవ్వుతూ బతకాల్సిన పిల్లలు ఇలా ఏడుస్తూ రోజులు లెక్కపెట్టాల్సి వస్తోంది. 

వివాహేతర సంబంధాలకు కొన్ని కారణాలు.. 
►సంపాదనే ధ్యేయంగా సంసారాన్ని నిర్లక్ష్యం చేయడం. 
►దంపతుల మధ్య చిన్నపాటి గొడవలను పెద్దవి చేసుకోవడం. 
►భార్యాభర్తల విషయాల్లో కుటుంబ సభ్యుల మితిమీరిన జోక్యం. 
►మితిమీరిన ఆన్‌లైన్‌ స్నేహాలు. 
►చెడు వ్యసనాలకు బానిస కావడం. 
►బలహీన మనస్తత్వాలు 

ఇవి తప్పనిసరిగా పాటించాలి 
►దాంపత్యంలోని మాధుర్యాన్ని గ్రహించాలి. 
►ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి 
►అభిప్రాయాలను ఒకరు గౌరవించాలి. 
► ఆకర్షణలు తాత్కాలికమే గానీ శాశ్వతం కావనే నిజాన్ని తెలుసుకోవాలి.  
►నైతిక విలువలు, సంబంధాలు, కుటుంబ విలువలకు గౌరవం ఇవ్వాలి. 
►దాంపత్య జీవితంలో భాగస్వామికి అన్ని విషయాల్లో తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాలి.  

నేరాలకు పాల్పడకూడదు 
దంపతుల మధ్య సమస్య ఉంటే చట్టాన్ని ఆశ్రయించి పరిష్కరించుకోవాలే తప్ప నేరాలకు పాల్పడకూడదు. కౌన్సెలింగ్‌ ద్వారా చాలా జంటలు మళ్లీ ఒక్కటై సంతోషంగా ఉన్నాయి. ఆకర్షణలకు లోనై జీవితాలను నాశనం చేసుకోకూడదు. 
– బెండి గౌరీపతి, సీనియర్‌ న్యాయవాది, టెక్కలి. 

పిల్లలపై తీవ్ర ప్రభావం
వివాహేతర సంబంధాల వల్ల పిల్లలపైనే ఎక్కువ ప్రభావం పడుతుంది. పెద్దలు చేస్తున్న తప్పిదాలను గమనిస్తూ చిన్నారులు మానసిక క్షోభకు గురవుతారు. దీని వల్ల భవిష్యత్‌లో ఎన్నో ఇబ్బందులు పడతారు.  
– నిర్మల్‌ అలెగ్జాండర్, మానసిక వైద్య నిపుణుడు, జిల్లా ఆసుపత్రి, టెక్కలి. 

జీవితాలను నాశనం చేసుకోవద్దు
మానవ సంబంధాల్లో అత్యంత ప్రమాదకరమైనది ఈ వివాహేతర సంబంధం. దీని వల్ల రెండు కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకునే ప్రమాదాలు ఉన్నాయి. వ్యామోహం, సరదాతో ప్రారంభమై చివరకు జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోతాయి. మా దగ్గరకు వచ్చే భార్య భర్తల తగాదాల్లో అత్యధిక శాతం ఇలాంటి కేసులే వస్తుంటాయి. ఇప్పటికే ఎంతో మందికి కౌన్సిలింగ్‌ చేసి వారి జీవితాలను నిలబెట్టాం.  
– ఎస్‌.వాసుదేవ్, డీఎస్పీ, దిశ పోలీస్‌స్టేషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement