సాక్షి, శృంగవరపుకోట: 13ఏళ్లుగా సహజీవనం సాగిస్తున్న ఓ జంట.. తమ పిల్లల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం సంతగైరమ్మపేటలో బుధవారం జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన వివరాల్లోకెళ్తే.. సంతగైరమ్మపేట ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న నరవ సన్యాసిరావు, కొండమ్మ 13 ఏళ్ల క్రితం ప్రేమించుకుని పెళ్లికి సిద్ధపడ్డారు. ఇరువురూ ఒకే కులానికి చెందిన వారైనప్పటికీ ఇరు పక్షాల పెద్దలూ వీరి పెళ్లికి అంగీకరించకపోవటంతో సన్యాసిరావు, కొండమ్మ ఊరు విడిచి వెళ్లి పోయారు.
ఏడాదిపాటు ఊరికి దూరంగా నివసించి.. తిరిగి వచ్చి తల్లిదండ్రులు, అత్తమామలకు సమీపంలోనే అద్దె ఇల్లు తీసుకుని 13 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వీరికి రమ్య(12), ఈశ్వరరావు(7) అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
వ్రతం కోసం...: పిల్లలు, బంధుమిత్రులతో ఎంతో అన్యోన్యంగా గడుపుతున్న సన్యాసిరావు, కొండమ్మ కూలీ పనులు చేసుకుంటూ సంపాదించిన నగదుతో గ్రామంలోనే చిన్నపాటి ఇల్లును కట్టుకున్నారు. గృహప్రవేశం, శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే నిమిత్తం వీరివురూ ఒక పురోహితుడిని సంప్రదించగా.. వ్రతం భార్యభర్తలే వారే ఆచరించాల్సి ఉందని చెప్పటంతో వీరివురూ ఆలోచనలో పడి గ్రామంలోని పెద్దలు, కుటుంబ సభ్యులను సంప్రదించారు.
చివరికి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని పెద్దలు, బంధువులకు తెలియజేయగా.. వారంతా తొలుత ఆశ్చర్యపడినా పెళ్లి ఏర్పాట్లు చేశారు. స్థానిక రామాలయంలో బుధవారం ఉదయం 7.15 గంటలకు వేదమంత్రాల సాక్షిగా కొండమ్మ మెడలో సన్యాసిరావు మూడు ముళ్లు వేశారు. గ్రామపెద్దలు, బంధువులు పెళ్లికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. పిల్లలు రమ్య, ఈశ్వరరావు అమ్మానాన్నల పెళ్లిని దగ్గరుండి చూసి.. ముచ్చట పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment