రైల్వే గేటు.. క్రాసింగ్ వద్ద ప్రమాదాల నివారణకు తొలి మెట్టు. కాని వీటిని ఏర్పాటు చేయడంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు.
కర్నూలు(రాజ్‌విహార్): రైల్వే గేటు.. క్రాసింగ్ వద్ద ప్రమాదాల నివారణకు తొలి మెట్టు. కాని వీటిని ఏర్పాటు చేయడంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. గేటు లేక, కాపలాదారుడు కనిపించక రైలు వస్తుందన్న విషయాన్ని తెలుసుకోకుండా పలువురు పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పొతున్నారు.అయినా పాలకుల్లో స్పందన కరువైంది.
గతంలో కర్నూలుకు చెందిన ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నా ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. తాజాగా మెదక్ జిల్లాలోని మూసాయిపేట వద్ద పట్టాలు దాటుతున్న స్కూలు బస్సును రైలు ఢీకొనడంతో జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. స్థానికంగా ఉన్న రైల్వే గే ట్లు, కాపలాదారులు లేని పట్టాలను తలుచుకొని భయాందోళనకు గురవుతున్నారు.
వివిధ ప్రాంతాల్లో రైల్వే -రోడ్డు క్రాసింగ్ వద్ద గతంలో జరిగిన ప్రమాదాల్లో 17 మంది అమాయక ప్రజలు చనిపోయారు. వందల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. అందులో కొన్ని దుర ్ఘటనలు..
కల్లూరు మండలం చెట్ల మల్లాపురం గ్రామ వద్ద 2012 మార్చి 31వ తేదీన పట్టాలు దాటుతున్న ఆటోను రైలు ఢీ కొని ఐదు మంది యువకులు దుర్మరణం పాలయ్యారు. అక్కడ పట్టాల వద్ద గేటు, కాపలాదారుడు లేని కారణంగా వివాహ వేడుకలకు వెళ్లి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన డ్రమ్స్ వాయిద్యకారులు చనిపోయారు.
కోసిగి మండలం ఐరన్‌గల్లు గ్రామం వద్ద 2005 మే 18వ తేదీన పట్టాలు దాటుతున్న ఆటోను రైలు ఢీ కోనడంతో ఐదు మంది వ్యవసాయ కూలీలు చనిపోయారు. అక్కడ గేటు, కాపలాదారుడు లేకపోవడంతో వ్యవసాయ పనులకు వెళ్తున్న కూలీల ఆటోను రైలు ఢీకొంది. అయితే, ఇప్పటికీ అక్కడ గేటును ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.
2009లో బేతంచెర్ల పట్టణంలో జరిగిన చెన్నకేశవ స్వామి తిరునాలతో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్లేందుకు గేటు దాటుతున్న హనుమాన్ నగర్ బాలికను రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
డోన్ మండలం బి. రామదుర్గం వద్ద రెండేళ్ల క్రితం రైల్వే ట్రాక్‌కు గేటు లేని కారణంగా పట్టాలు దాటుతున్న ఆర్టీసీ డోన్ డిపో బస్సును రైలు ఢీకొంది. ఫలితంగా డ్రైవర్ జంగాల రాముతోపాటు బట్టల వ్యాపారి ఈశ్వరయ్య చనిపోయారు.
వెల్దూర్తి మండలం గుంటపల్లి వద్ద ఏడేళ్ల కిత్రం పట్టాలు దాటుతూ ఇద్దరు చనిపోగా అలాగే సూదెపల్లె వద్ద ఐదేళ్ల క్రితం ఒకరు చనిపోయారు. ఇక మూ గజీవాల గురించి చెప్పనక్కరలేదు.
పట్టాలు దాటాలంటే భయం..భయం!
నూనెపల్లె: నంద్యాల రైల్వేస్టేషన్ కేంద్రంగా గుంటూరు, గుంతకల్ డివిజన్‌లున్నాయి. డోన్ నుంచి ఊడుమాల్పురం వరకు గుంతకల్ డివిజన్, నంద్యాల నుంచి గజ్జలకొండ వరకు గుంటూరు డివిజన్‌లు కాగా గిద్దలూరు స్టేషన్ వరకు నంద్యాల బ్రాంచిలోకి వస్తాయి.
ఈ ప్రాంతాల్లో చాలా వరకు కాపలాలేని గేట్లు అనేకంగా ఉన్నాయి. డోన్ నుంచి నంద్యాల వరకు మొత్తం 16 గేట్లు ఉండగా అందులో 11 మ్యాన్‌గేట్లు, 5 అన్‌మ్యాన్‌గేట్‌లున్నాయి. అలాగే నంద్యాల నుంచి గిద్దలూరు వరకు 23 గేట్లు ఉండగా 9 అన్‌మ్యాన్ గేట్లున్నాయి. రైళ్లు వేగంగా వచే ్చటప్పుడు కాపలాలేని గేట్ల వద్ద అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.