మృత్యు మార్గాలు
► పట్టాలపై పొంచి ఉన్న ప్రమాదం
►రైల్వే గేట్ల వద్ద కాపలా కరువు
► మొద్దు నిద్రలో రైల్వే శాఖ
►ప్రత్యామ్నాయ రక్షణ చర్యలపై నిర్లక్ష్యం
గోదావరిఖని బొగ్గు గనుల నుంచి రామగుండం రైల్వేస్టేషన్ వరకు ఉన్న రైల్వేలైను బద్రిపల్లి గ్రామానికి మధ్యలో నుంచి ఉండడం, రైల్వే యార్డులో లైన్స్ క్లియర్‌గా లేకపోవడంతో గూడ్సురైలు గంటల తరబడి అక్కడే నిలిపివేస్తున్నారు. ఆసమయంలో గ్రామస్తులు, విద్యార్థులు గూడ్సు రైలు కింద నుంచి దూరి వెళ్తున్నా రు. అయినా అక్కడ ఎలాంటి కాపలా లేదు. దు రదృష్టవశాత్తు రైలు కదిలితే మూల్యం చెల్లించుకోవాల్సిందే.
ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారో అధికారులకే తెలియాలి. మల్యాలపల్లిలో ఉన్న రైల్వే గేట్ వద్ద ఎలాంటి కాపలా లేదు. ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్న అధికారులు రక్షణ చర్యలు తీసుకోవడంలేదు. నాలుగేళ్ల క్రితం ఇక్కడ మల్యాలపల్లికి చెందిన ఈర్ల నారాయణ అనే వ్యక్తి టాటాఏస్ వాహనంతో గూడ్సు రైలును గమనించక పట్టాలు దాటుతుండగా, రైలు ఢీకొనడంతో ఆయన కాళ్లు విరిగాయి. వాహనం నుజ్జునుజ్జు అయింది. రైలు వస్తున్న సమయంలో నిర్లక్ష్యంగా వెళ్లి ప్రమాదానికి కారణమయ్యావని అధికారులు బాధితుడిపైనే కేసు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు.
తెరిచే ఉంటున్న గేట్లు
గంగాధర: కరీంనగర్-నిజామాబాద్ రైల్వే రూట్లో రైల్వే క్రాస్ రోడ్ల వద్ద గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటున్నాయి. రైలు వచ్చేప్పుడు హారన్ వినిపిస్తేనే వాహనాలు నిలుపుకుంటున్నారు. ఒకవేళ హారన్ వినిపించకపోతే ప్రమాదానికి గురికావల్సిందే. గతంలో గంగాధర చౌరస్తాకు సమీపంలో రైల్వే గేట్ వద్ద రైలును గమనించక ఓలారీడ్రైవర్ పట్టాలు దాటుతూ సడన్ బ్రేక్ వేయడంతో లారీ వెనుక వస్తున్న ద్విచక్రవానం లారీకి ఢీకొట్టగా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
తృటిలో ప్రాణాపాయం తప్పింది. రామడుగు మండలం దేశరాజుపల్లి సమీపంలోని కాకతీయ కెనాల్ వద్ద రైల్వే గేట్ దాటుతున్న ట్రాక్టర్‌ను రైలు ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణాపాయం జరుగలేదు. గంగాధర మండలం కొండన్నపల్లి శివారులో ఉన్న రైల్వే గేటు వద్ద కాపలా లేదు. రామడుగు మండలం వెదిర క్రాస్ రోడ్డు నుంచి గోపాల్‌రావుపేట ప్రధాన రహదారిలో రాజాజీనగర్, దేశరాజుపల్లి, కొడిమ్యాల మండలం నమిలికొండ, పూడూరు, మల్యాల మండలం నూకపల్లిలో ఉన్న రైల్వే గేట్ల వద్ద ఎలాంటి కాపలా లేదు.
లింగంపేటలోనూ ఇదే దుస్థితి
జగిత్యాల రూరల్ : మండలంలోని లింగంపేట రైల్వే గేట్ వద్ద ప్రమాదం పొంచి ఉంది. గ్రామ శివారులో, అంతర్గాం గ్రామ శివారులో ఉన్న రైల్వే గేట్ల వద్ద ఎలాంటి కాపలా లేదు. ఇక్కడ గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటున్నాయి. ఉదయం 5 గంటలకు జగిత్యాల-కాగజ్‌నగర్ రైలు, సాయంత్రం 6 గంటలకు కాగజ్‌నగర్-జగిత్యాల రైలు వస్తోంది. కాపలా లేకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.