గజరాజులు ఏం చేసినా ముచ్చటగానే ఉంటుంది. ఏనుగులు వాటి తెలివితేటలను ప్రదర్శిస్తూ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటాయి. ఈసారి ఓ ఏనుగు తన గజబలాన్ని చూపించకుండా బుద్ధిబలాన్ని ప్రదర్శించింది. ఓ ఏనుగు నడుచుకుంటూ వెళ్తుండగా రైల్వేట్రాక్ ఎదురైంది. దీంతో అది వెనక్కు వెళ్లిపోలేదు. అలా అని వాటిని ధ్వంసం చేసి ముందుకు వెళ్లనూలేదు. ఓ చిన్న ఐడియాతో చాకచక్యంగా రైల్వేట్రాక్ దాటి అందరి ప్రశంసలు అందుకుంటోంది. నెమ్మదిగా తొండంతో రైల్వేగేటు ఎత్తి దాని కిందనుంచి పట్టాలపైకి చేరుకుంది. అటువైపు ఉన్న మరో గేటును కాస్త కిందకు వంచి తాడాట ఆడినట్టుగా జంప్ చేసి అవతలివైపుకు సురక్షితంగా చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోది.
ఈ వీడియోను అటవీ శాఖ అధికారి సుశాంత్ నందా ట్విటర్‌లో షేర్ చేశాడు. ‘ఏనుగులకు అవి నివసించే ప్రదేశాలు బాగా గుర్తుంటాయి. ఈ రైల్వేక్రాసింగ్‌లు వాటిని వెళ్లనీయకుండా ఆపలేవు’ అని రాసుకొచ్చాడు. ఇక ఈ ఏనుగు తెలివితేటలకు నెటిజన్లు ముచ్చటపడిపోతున్నారు. కానీ కొంతమంది జంతుప్రేమికులు మాత్రం అది చేసిన పనికి కంగారు పడిపోయారు. ఒకవేళ ఆ సమయంలో రైలు వస్తే దాని పరిస్థితి ఏమయ్యేది అని ఆందోళన చెందారు. తెలివైన పనే కానీ ప్రమాదమైనదని నెటిజన్లు ఏనుగును మెచ్చుకుంటూనే సుతిమెత్తంగా తిడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment