లెవెల్ క్రాసింగ్ మూసివేతపై ఆందోళన
వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్
పల్లెవాడ (కైకలూరు) : రైల్వే లెవెల్ క్రాసింగ్ దారిని మూసివేయడాన్ని నిరసిస్తూ రామవరం గ్రామస్తులు పాసింజర్ రైలును అడ్డుకున్నారు. గ్రామానికి చేరడానికి దగ్గర దారిగా ఉపయోగపడుతున్న పల్లెవాడ - రామవరం క్రాసింగ్‌ను రైల్వే అధికారులు మూసివేయడంపై ఆందోళన చేపట్టారు. గ్రామానికి చేరే పట్టాల వద్ద వాహనాలు వెళ్లకుండా ఇనుప గడ్డర్లు పాతిన విషయాన్ని తెలుసుకుని పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు వచ్చి పట్టాలపై కూర్చున్నారు. దీంతో గుడివాడ - నర్సాపూర్ (77204) పాసింజరు రైలు 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న కైకలూరు తహశీల్దార్ కేఏ నారాయణరెడ్డి, భీమవరం రైల్వే ఎస్సై చింతయ్య అక్కడికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు.
యాభయ్యేళ్లుగా ఇదే దారిలో గ్రామస్తులందరూ ప్రయాణిస్తున్నారని, కైకలూరు, ఏలూరు వంటి పట్టణాలకు చేరుకోవడానికి దగ్గర మార్గమని వారు వివరించారు. గ్రామానికి చేరుకోడానికి నేరుగా ఉన్న ఈ గేటును మూసివేసి పల్లెవాడ మలుపు వద్ద గేటును ఉంచడం అన్యాయమని చెప్పారు. ప్రజలు రాత్రి సమయంలో వచ్చేటప్పుడు ఆ రహదారిలో లైట్లు లేవని తెలిపారు. గేటు మూసివేత విషయం తెలియడంతో ముందుగానే రైల్వే అధికారులు, కలెక్టర్‌కు వినతిపత్రం అందించామన్నారు. ప్రజల అవసరాల రీత్యా అధికారులు వెంటనే రైలు పట్టాలకు అడ్డంగా నిర్మించిన స్తంభాలను తొలగించాలని వారు కోరారు. చివరకు రైల్వే పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
చేపల రైతులకు మేలు చేసేందుకే...
పల్లెవాడ నుంచి రామవరానికి నేరుగా వచ్చే లెవెల్ క్రాసింగ్ దారిని మూసివేసి సమీపంలోని చేపల చెరువులకు వెళ్లే లెవెల్ క్రాసింగ్‌ను ఉంచడంపై రామవరం గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పల్లెవాడ మలుపు వద్ద నుంచి వెళ్లే రహదారిలో చేపల చెరువులు అధికంగా ఉన్నాయని, యజమానులు చేపల మేతలు తీసుకువెళ్లడానికి ఆ దారి అనుకూలంగా ఉంటుందని వారు చెబుతున్నారు.
పాసింజర్ రైలు అడ్డగింపు
Published Thu, Feb 26 2015 12:51 AM | Last Updated on Sun, Apr 7 2019 3:23 PM
Advertisement