రాజంపేట: నిఘా పెరిగే కొద్దీ ఎర్రచందనం స్మగ్లర్లు కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు. పద్ధతి ఏదైనా వారి దారి రైలు మార్గమే. రోడ్డు మార్గంలో వాహనాల్లో కంటే రైలు మార్గమే సురక్షితమని వారు భావిస్తున్నారని తాజా సంఘటనలు రుజువు చేస్తున్నారుు. ఇటీవల జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌పై పోలీసుశాఖ పట్టుబగించడం.. మరోవైపు శేషాచలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఉద్ధృతం కావడంతో స్మగ్లర్లు రవాణా రూట్ మార్చుకుంటున్నారు.
తాజాగా రైళ్ల ద్వారా ప్రయాణికుల్లా బ్యాగుల్లో దుంగలను తరలించేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇటీవల నందలూరులో కూడా బ్యాగులో దుంగలను తరలిస్తుండగా రైల్వే జనరల్ పోలీసులు పట్టుకున్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో చెట్లు నరికేందుకు తమిళతంబిలు కూడా రైళ్లలో రాజంపేట, బాలుపల్లె, రైల్వేకోడూరు, మామండూరు, అనంతరాజంపేట, పుల్లంపేట రైల్వేస్టేషన్ల ద్వారా శేషాచలంలోకి ప్రవేశించేశారు. ఇలాంటి వందలాది మందిని గతంలో పట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా దుంగలను రైళ్ల ద్వారా గమ్యాలకు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది.
పునరావృతమైన రైళ్లలో స్మగ్లింగ్
రెండు దశాబ్ధాల కిందట స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను గూడ్స్‌రైళ్లలో రవాణా చేసేవారు. శేషాచల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న బాలపల్లె, మామండూరు తదితర ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని రవాణా చేసేవారు. చెన్నై హార్బర్‌కు వెళ్లే ఐరన్‌ఓర్ రవాణా చేసే గూడ్స్‌రైళ్లలో దుంగలను తరలించేవారు. వ్యాగిన్‌లో దుంగలు హార్బర్‌కు వెళితే.. అక్కడ నుంచి స్టీమర్ల ద్వారా విదేశాలకు ఎగుమతి అయ్యేది. గూడ్స్‌రైళ్లలో దుంగల తరలింపు అప్పట్లో పెద్దఎత్తున జరిగేది. అయితే ఈ రవాణాపై నిఘా వ్యవస్ధ ్ట తీవ్రస్ధాయిలో దృషి సారించడంతో స్మగ్లర్లు రవాణా రూట్‌ను మార్చుకున్నారు. రోడ్డు మార్గాన్ని ఎంచుకుని చాలా ఏళ్లు సాగించారు. అక్కడ నిఘా ఎక్కువ కావడంతో ఇప్పుడు మళ్లీ ఏకంగా ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణీకుల ముసుగులో దుంగలను తరలించేస్తున్నారు.
పరిస్ధితులను బట్టి రవాణా
పరిస్ధితులను బట్టి స్మగ్లర్లు దుంగలను రవాణా చేసేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎర్రచందనం స్మగ్లర లారీలు, ఆర్టీసీ బస్సుల నుంచి రైళ్లలో రవాణా జరిగే స్థాయికి పెరిగింది. ఇటీవల ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా పెట్టడంతో శేషాచల అడవుల నుంచి వివిధ మార్గాల ద్వారా తరలిస్తున్నారు. గతంలో లారీలు, ట్రక్కులు, ఆటోలు, జీపులలో చివరికి టు వీలర్లలో సైతం తరలిస్తూ అనేక మంది పట్టుబడ్డారు. ఇటీవల జిల్లా పోలీసు, అటవీ శాఖ అధికారుల విచారణలో ఆర్టీసీ బస్సు ద్వారా కూడా ఈ రవాణా జరుగుతున్నట్లుగా వెల్లడైంది. ఇందులో పలువురు ఆర్టీసీ డ్రైవర్లు సస్పెండ్ కాగా మరి కొందరు కూడా అదేబాటలో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
గుట్టుచప్పుడుగా..
అక్రమ రవాణాకు అలవాటు పడి కోట్లరూపాయలు సంపాదిస్తున్న వారు తాజాగా రైళ్లలో ఎర్రచందనం తరలిస్తూ రైల్వే పోలీసులకు పట్టుబడటం సంచలనం కల్పిస్తుంది. మరోవైపు ప్రభుత్వం ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని చెపుతోంది. చెన్నై నుంచి గుంతకల్ వైపు వెళ్లే రైళ్లలో దుంగలు తరలింపు కొనసాగుతోంది. అయితే అది కూడా చైన్‌లింక్ సిస్టమ్‌లో కొనసాగుతోంది. ఒక వేళ పట్టుబడిన వ్యక్తికి ఎక్కడి నుంచి దుంగలు వస్తున్నాయో సమాచారం తెలియకుండానే దుంగల రవాణా కానిచ్చేస్తున్నారు.
ఎర్ర స్మగ్లర్లు
Published Fri, Dec 26 2014 2:46 AM | Last Updated on Mon, Oct 22 2018 1:59 PM
Advertisement
Advertisement