
శిబిరంలో కూర్చున్న రెడ్డి శాంతి
శ్రీకాకుళం అర్బన్: పాతపట్నం మండలం, పెద్దలోగిడి గ్రామానికి చెందిన ఆదివాసీ బాలిక అగదల పార్వతిపై లైంగిక దాడిచేసి హత్య చేశారని, ఈ కేసులో నిందితులను తక్షణమే అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆ శాఖ అధ్యక్షుడు వి.యోగి ఆధ్వర్యంలో పలు సంఘాల ప్రతినిధులతో శ్రీకాకుళంలోని ఎన్‌జీవో కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివాసీ బాలిక పార్వతి టెక్కలి జూనియర్ కళాశాలలో చదువుతోందన్నారు. పార్వతి చనిపోవడానికి గల కారణాలను వెలికితీయాలన్నారు. ఈ కేసు విషయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీవో ఉదాసీన వైఖరి అవలంబించడం శోచనీయమన్నారు. స్థానిక ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఈ కేసులో జోక్యం చేసుకోకపోవడం దుర్మార్గమన్నారు. గిరిజన ప్రజలు పాతపట్నంలో శిబిరం వేసి నిరాహారదీక్షలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వంకల మాధవరావు మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన బాలిక పార్వతిపై గంగువాడకు చెందిన గిరిజనేతరులు బాలి రాజారావు, ఆయన స్నేహితులు లైంగిక దాడిచేసి హత్య చేశారని, ఈ సంఘటన ఆగస్టు 22వ తేదీన జరిగినప్పటికీ ఇంతవరకూ పోలీసులు కేసులో ఎటువంటి పురోగతి చూపకపోవడం శోచనీయమన్నారు. ఈ కేసులో కేవలం ఒక నిందితుడిని అరెస్ట్ చూపించి కేసు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. మానవహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వి.జగన్నాథరావు మాట్లాడుతూ ఈ కేసు పురోగతి కోసం సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు వాబ యోగి, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి టి.కామేశ్వరి, డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోత ధర్మారావు, , పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.వినోద్, ఇఫ్టూ జిల్లా కార్యదర్శి ఎన్.నీలంరాజు, కేఎన్‌పీఎస్ రాష్ట్ర సమాఖ్య కార్యదర్శి మిస్క కృష్ణయ్య, ఐఎఫ్‌టీయూ జిల్లా కన్వీనర్ జుత్తు వీరాస్వామి, ఎంఆర్‌పీఎస్ జిల్లా కార్యదర్శి కానుకుర్తి శంకరమాదిగ, అరుణోదయ కార్యదర్శి కె.సోమేశ్వరరావు, పలు సంఘాల ప్రతినిధులు కె.భాస్కరరావు, కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
పార్వతి కేసును పరిష్కరించాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి
పాతపట్నం : గిరిజన విద్యార్థిని పార్వతి కేసును పోలీసులు త్వరగా పరిష్కరించాలని, దోషులను శిక్షించి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు. పార్వతి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజనులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరంలో ఆమె శనివారం పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసులు, అధికార పార్టీ నేతలతో చేతులు కలిపి కేసును నీరు కారుస్తున్నారని ఆరోపించారు. కేసు పరిష్కారంలో దోషులు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటారన్నారు. ఆమెతో పాటు పార్టీ మండల అధ్యక్షుడు రెగేటి షణ్ముఖరావు, నాయకులు కొండాల అర్జునుడు, పి.వి.వి.కుమార్, రెడ్డి రాజు, మద్ది నారాయణరావు, యడ్ల గోవిందరావు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు బైరి కూర్మారావు, టి.బాబురావుతో పాటు పలువురు దీక్షా శిబిరంలో పాల్గొని సంఘీభావం తెలిపారు.