
తగ్గిన గ్యాస్ ధర
- గృహావసరాల సిలిండర్‌పై రూ.53
- వాణిజ్య అవసరాల సిలిండర్‌పై రూ.88
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : వంట గ్యాస్ ధర స్వల్పంగా తగ్గింది. చమురు కంపెనీలు గృహ, వాణిజ్య అవసరాల గ్యాస్ ధరలను తగ్గిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశాయి. గృహావసరాల సిలిండర్‌పై రూ.53, వాణిజ్య అవసరాల సిలిండర్‌పై రూ.88 తగ్గించారు. గృహావసరాల సిలిండర్ ధర రూ.1,213 ఉండగా అది రూ.1,160కి తగ్గుతోంది. వాణిజ్య అవసరాల సిలిండర్ ధర రూ.2,019 ఉండగా, రూ.1,981కి తగ్గించారు. తగ్గిన ధరలు జిల్లాలోని అన్ని గ్యాస్ ఏజెన్సీల్లో అమలులోకి వచ్చాయి.
గ్యాస్ ధరలు ప్రతినెలా పెరగటం, తగ్గటం వల్ల వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంత వినియోగదారులకు గ్యాస్ ధర తగ్గిన విషయం తెలియటం లేదని చెబుతున్నారు. ప్రతినెలా హెచ్చుతగ్గుల వల్ల రిక్షాలపై గ్యాస్ సరఫరా చేసేవారు మోసాలు చేసి అమాయకుల నుంచి అధిక సొమ్ము వసూలు చేసే అవకాశముందని పలువురు పేర్కొంటున్నారు.
10 రోజుల్లో ఆధార్ పై ఆదేశాలు...
గ్యాస్ సబ్సిడీని ఆధార్‌కు సంబంధం లేకుండా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఇంకా గ్యాస్ కంపెనీలకు అందలేదు. మరో పది రోజుల వరకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ కొనసాగిస్తామని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. ఉత్తర్వులు జారీ అయ్యేవరకు గ్యాస్ సబ్సిడీ బ్యాంకు ఖాతాలలోనే పడుతుందని తెలిపారు. దాంతో జిల్లాలో ఆధార్ అనుసంధానం కాని వినియోగదారులు పూర్తి ధర చెల్లించి గ్యాస్ కొనుగోలు చేయాల్సి వస్తోంద ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది మంది వినియోగదారులు ఆధార్ తొలగించిన ఉత్తర్వుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూపులు చూస్తున్నారు.