=లక్ష్యం మేరకు గానుగాటపై అనుమానాలు
=తలలు పట్టుకుంటున్న సుగర్స్ యాజమాన్యాలు
=అతివృష్టితో కొత్త చిక్కులు
అనకాపల్లి/చోడవరం,న్యూస్‌లైన్: కోటి ఆశలతో జిల్లాలోని సహకార చక్కెర కర్మాగారాలు క్రషింగ్‌కు సన్నద్ధమవుతున్నాయి. గోవాడలో బాయిలర్‌పూజకూడా చేపట్టారు. ఈ నెల మూడో వారం నుంచి రెగ్యులర్ గానుగాటకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కానీ ఆయా యాజమాన్యాలకు చెరకు కొరత బెంగ పీడిస్తోంది. సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గిపోవడం ఇందుకు కారణం. ఇది పరోక్షంగా క్రషింగ్ లక్ష్యాలపై కనబడుతోంది. రాష్ట్రంలోని 11 సహకార చక్కెర కర్మాగారాల్లో మూడు మూత పడ్డాయి. ప్రస్తుతం 8 ఫ్యాక్టరీలు మాత్రమే గానుగాటకు సిద్ధమవుతున్నాయి.
ఇందులో నాలుగు జిల్లాలోనే ఉన్నాయి. మరొకటి సరిహద్దులోని భీమసింగిలో ఉంది. జిల్లాలో వరి తర్వాత చెరకుయే ప్రధాన పంట. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ పంట సాగులో జిల్లా ఒకప్పుడు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండేది. ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయింది. జిల్లాలోని ఒక్క గోవాడ(చోడవరం) చక్కెర కర్మాగారం లాభాల్లో పయనిస్తోంది. ఏటికొప్పాక అరకొరగా లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ, గతంలో పేరుకుపోయిన నష్టాల నుంచి గట్టెక్కలేకపోతోంది. తాండవదీ అదే పరిస్థితి. తుమ్మపాల ఆరేళ్లుగా నష్టాలను మూటగట్టుకుంటోంది.
ఏడాదికేడాది కనాకష్టం మీద గానుగాడుతోంది. పురాతన యంత్రాలు, పరికరాలతో ప్రతి సీజన్‌లోనూ క్రషింగప్పుడు అన్ని ఫ్యాక్టరీల్లోనూ అంతరాయం ఏర్పడుతోంది. పరోక్షంగా రికవరీ రేటు పడిపోతోంది. ఈ పరిస్థితుల్లో సుగర్స్ యాజమాన్యాలు రాయితీలు, మద్దతు ధర కల్పనలో విఫలమవుతుండటంతో రైతులు ఏటేటా సాగును తగ్గించేస్తున్నారు. వార్షిక పంట అయిన దీనితో ఏడదంతా అపసోపాలు పడేకంటే, ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, సరుగుడు వంటివి మేలని భావిస్తున్నారు.
ఈ కారణంగానే విస్తీర్ణం పడిపోతుందనేది సుగర్స్ యాజమాన్యాల ఆందోళన. జిల్లాలో చెరకు సాగు సాధారణ విస్తీర్ణం 40,358 హెక్టార్లు. ఈ ఏడాది 26,834 హెక్టార్లలో వేశారు. గతంలో కర్మాగారాలకు సరఫరాతోపాటు బెల్లం తయారీ, విత్తనానికి కలిపి సుమారు 50 వేల హెక్టార్లలో పంటను చేపట్టేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇదే దుస్థితి కొనసాగితే కర్మాగారాలకు భవిష్యత్‌లో చెరకు దొరకదు. దీనికితోడు ఇటీవల భారీ వర్షాల కారణంగా చెరకు తోటలు ముంపునకు గురయ్యాయి. లక్ష్యం మేరకు క్రషింగ్‌కు పరిస్థితులు లేవనే భావన అటు రైతులలోను, ఇటు కర్మాగారాల యాజమాన్యాలలోను వ్యక్తమవుతోంది.