=చెరకుకు చాలీచాలని మద్దతు ధర
=సాయం చేయని రాష్ట్ర ప్రభుత్వం
=భారీ వర్షాలతో దిగుబడిపై ప్రభావం
=ఆదుకోకుంటే అన్నదాతకు కష్టమే
సాక్షి, విశాఖపట్నం : తీపిని పంచే చెరకు రైతుకు రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపింది. మరోవైపు ప్రకృతి కన్నెర్ర చేసింది. మద్దతు ధరకు నోచుకోక నష్టాల బాట పడుతున్న అన్నదాతను ఇటీవల కురిసిన భారీ వర్షాలు పుట్టిముంచాయి. దీంతో రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చెరకు సాగు వ్యయం ఏటేటా పెరిగిపోతోంది. కానీ కేంద్ర ప్రభుత్వమిచ్చే మద్దతు ధర ఆ స్థాయిలో పెరగడం లేదు. తమవంతుగా ఆదుకోవల్సిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో సహకార చక్కెర కర్మాగారాల దయాదాక్షిణ్యాలపైన చెరకు రైతులు ఆధారపడుతున్నారు.
నిర్వహణ వ్యయం పెరిగిపోవడంతో అవికూడా ఇప్పుడు సాయం చేసే పరిస్థితుల్లో లేవు. ఫలితంగా చెరకు సాగంటేనే రైతులు హడలిపోతున్నారు. జిల్లాలో సుమారు 1.5 లక్షల ఎకరాల్లో చెరకు పండిస్తున్నారు. ఇందులో 60నుంచి 70వేల ఎకరాల పంట గోవాడ, అనకాపల్లి,ఏటికొప్పాక, తాండవ చక్కెర కర్మాగారాలకు సరఫరా చేస్తున్నారు. దాదాపు 40వేల మంది రైతులు క్రషింగ్‌పై ఆధారపడి కొనసాగుతున్నారు. టన్ను చెరకుకు కనీసం రూ.2500 ఇస్తే తప్ప గిట్టుబాటు కాదు. అంత మొత్తం వచ్చేలా అధికారులు, మంత్రులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కానీ పట్టించుకున్న దాఖలాల్లేవు.
2011-12లో కేంద్రం టన్నుకి రూ.1600 మద్దతు ధర ప్రకటించింది. దీనికి మరో రూ.200కలిపి కర్మాగారాలు చెల్లించాయి. దానికదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.200 ఇచ్చింది. దీంతో అప్పట్లో కాస్త గిట్టుబాటైంది. కానీ 2012-13లో కేంద్ర ప్రభుత్వం రూ. 1700 మద్దతు ధర ప్రకటించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 300కలిపి రూ. 2వేల వరకు ఇస్తారని రైతులు ఆశించారు. సీజన్ ముగిసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం రాలేదు. దీంతో కర్మాగారాలే తమకొచ్చిన లాభాల నుంచి కొంత మొత్తం ఇచ్చాయి. కానీ ఆ సాయం ఎటూ సరిపోలేదు. రైతులు నష్టాలనే చవిచూశారు.
మహరాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌లోనైతే కేంద్రం ప్రకటించే మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం కొంత కలిపి చైరకు రైతులకు అందజేశాయి. వాటితో పాటే ప్రోత్సాహకాలు ఇచ్చాయి. దీంతో అక్కడ రైతులు మంచి లాభాలు ఆర్జించారు. కానీ మన రాష్ట్రంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇక 2013-14సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం టన్నుకు రూ.2100మద్దతు ధర ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈలోపే భారీ వర్షాలు పడ్డాయి. వేలాది ఎకరాల చెరకు నీట మునగడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది.
ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధర లభించక, ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం లేక రైతు మరింత ఆందోళన చెందుతున్నాడు. పోనీ గతంలో మాదిరిగా కర్మాగారాలు ఆదుకుంటాయనకుంటే ఇప్పుడా పరిస్థితిలో లేవు. ఆధునికీకరణకు నోచుకోకపోవడం, నిర్వహణ వ్యయం పెరగడం, పంచదార ధర ఆశించిన స్థాయిలో లేకపోవడంతో లాభాలొచ్చే అవకాశాల్లేకుండా పోయింది. ఈ క్రమంలో కర్మాగారాలు ఉదారంగా రైతుకు కొంత ఇచ్చే అవకాశం లేదు. ఈసారైనా రాష్ట్ర ప్రభుత్వం తమవంతుగా సాయమందించకపోతే చెరకు సాగుకు రైతులు వెనకడుగేసే అవకాశం ఉంది.