దయలేని దవాఖాన | Rejection of Medical treatment for the dumb woman | Sakshi
Sakshi News home page

దయలేని దవాఖాన

Published Wed, Oct 23 2013 2:27 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM

Rejection of Medical treatment for the dumb woman

సంగారెడ్డి మునిసిపాలిటీ, న్యూస్‌లైన్: ఆమె ఓ మూగ మహిళ. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలియదు. ఏడాదిగా ఓ గ్రామంలో యాచిస్తూ జీవనం సాగిస్తోంది. గ్రామస్థులు పెట్టింది తింటూ బస్టాండులో ఉంటోంది. ఐదు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఏమీ తినలేని స్థితికి చేరుకుంది. ఆ గ్రామం పేరు మోమిన్‌పేట(రంగారెడ్డి జిల్లా). మోమిన్ అంటే మృధువైన మనస్సు కలిగిన వ్యక్తి అని అర్థం. ఊరి పేరుకు తగ్గట్లు మోమిన్‌పేట వాసులది జాలి గుండె. మనకేందుకులే అనుకొని ఊరుకోలేదు. ఆ మూగ మహిళకు దగ్గరుండి అన్నం తినిపించి సపర్యలు చేసే ప్రయత్నం చేయగా వాంతులు చేసుకుంది.
 
ఒంట్లో సత్తువ లేక నీరసించి స్పృహ కోల్పోయింది. గ్రామస్థులు, ఆటో డ్రైవర్లు కలిసి ఆమెను సంగారెడ్డిలోని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి వైద్యం చేయించాలని నిర్ణయించారు. కొందరు ముందుకు వచ్చి చందాలు పోగుచేశారు. మోమిన్‌పేట ఎస్‌ఐ నాగరాజు సైతం కోరిన వెంటనే ఓ హోంగార్డును ఆస్పత్రి వరకు పంపేందుకు అంగీకరించారు. రోగితో పాటు ఆస్పత్రిలో ఉంటూ సపర్యలు చేయడానికి మంగమ్మ అనే మహిళను అటెండెంట్‌గా నియమించి రోజుకు రూ.200 చొప్పున 5 రోజుల కోసం రూ.వెయ్యి చెల్లించారు. మంగళవారం మధ్యాహ్నం హోంగార్డు గోపాల్ రెడ్డి, ఆటో డ్రైవర్లు తౌఫీక్, రాములు అటెండెంట్ మంగమ్మతో కలిసి ఆ యాచకురాలిని ఆటోలో సంగారెడ్డి ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ, ఆమె పరిస్థితి బాగాలేదనే కారణంతో ఆస్పత్రిలో చేర్పించుకోడానికి సిబ్బంది ముందుకు రాలేదు. రోగితో వచ్చిన వ్యక్తులు బతిమిలాడినా వైద్యులు, సిబ్బంది కనికరించలేదు. యాచకురాలి వద్ద దుర్వాసన వస్తోందిని, ఎలా వైద్యం చేయాలని ఎదురు ప్రశ్నించారు.
 
దీంతో రెండు గంటల పాటు ఆమె అత్యవసర విభాగం ఎదుట స్ట్రెచర్‌పైనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆస్పత్రి అంబులెన్స్ మరో రోగిని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సమాయత్తమవుతుండగా.. మోమిన్‌పేట వాసుల బలవంతం మీద అదే అంబులెన్స్‌లో ఆ యాచకురాలిని గాంధీకి తీసుకెళ్లాలని కోరినా ఫలితం లేకుండాపోయింది. విషయం తెలిసి పాత్రికేయులు అక్కడికి చేరుకోవడంతో.. మొత్తానికి రెండు గంటల తర్వాత ఆమెను ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యం ప్రారంభించారు.
 
వివరాలు తెలియకే ఆలస్యం
ప్రతి కేసును అడ్మిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కండిషన్ సీరియస్‌గా ఉంటేనే అడ్మిట్ చేసుకుంటాం. రోగి వివరాలు తెలపకపోవడంతోనే ఆస్పత్రిలో చేర్చుకోవడంలో ఆలస్యం జరిగింది. ఒక వేళ ఆమెకు ఏమైన జరిగితే ఎవరికి అప్పగించాలో సమస్యలొస్తాయనే ఆలోచించాం.  కండిషన్ సీరియస్‌గా ఉంటేనే చేర్చుకుంటాం.
 - డాక్టర్ మురహరి, ఆర్‌ఎంఓ, జిల్లా కేంద్రాస్పత్రి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement