dumb woman
-
పెళ్లి బంధంతో ఒక్కటైన మూగ జంట
ఖానాపూర్: మండలంలోని గోడలపంపు గ్రామానికి చెందిన మూగజంటకు గురువారం వివాహం జరిగింది. గ్రామానికి చెందిన ఆమంద లక్ష్మి–సుదర్శన్ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు సుకృత్(మూగ)కు నిజామాబాద్ జిల్లా రేంజర్ల మండలం ఈరన్నగుట్టకు చెందిన లాస్య(మూగ)తో పట్టణంలోని జేకే ఫంక్షన్హాల్లో సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. ఈ వివాహానికి పలు జిల్లాల నుంచి మూగ యువతీ, యువకులు హాజరై దంపతులను ఆశీర్వదించారు. చదవండి: (రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి) -
మిర్చి తోటలో నీరు పెట్టేందుకు వెళ్లిన మూగ యువతిపై అత్యాచారం
సాక్షి,తిరుమలాయపాలెం(ఖమ్మం): మిర్చి తోటలో నీళ్లు పెట్టేందుకు వెళ్లిన మూగ యువతిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై బాధితురాలి తండ్రి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుబ్లేడు గ్రామానికి చెందిన 24 ఏళ్ల ఓ మూగ యువతి గత నెల 31న మిర్చి తోటలో నీళ్లు పెట్టేందుకు వెళ్లింది. ఒంటరిగా ఉన్న ఆమెపై అదే గ్రామానికి చెందిన ఈడబోయిన గోపి అనే కామాంధుడు గుట్టల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని కొద్ది రోజుల తర్వాత తన సోదరికి తెలపడంతో బయటపడింది. ఈ మేరకు ఎస్సై భవాని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అర్ధరాత్రి రోడ్డుపై ఒంటరిగా యువతి.. బిక్కుబిక్కుమంటూ..
గుంటూరు రూరల్: మనసులోని బాధను ఎవ్వరితోనూ చెప్పుకోలేదు. తాను ఎక్కడుందో ఆమెకే తెలియదు. ఎందుకు వచ్చిందో తెలియదు, ఎదుటివారు ఏమి మాట్లాడుతున్నారో ఆమెకు వినపడదు, అటువంటి మూగ, చెవిటి యువతి అర్ధరాత్రి ఒంటరిగా జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16)పై బిక్కుబిక్కుమంటూ నిలబడగా ఆమెను నల్లపాడు పోలీసులు రక్షించి మహిళా ప్రాంగణానికి తరలించారు. నగరమంతా దీపావళి వేడుకలు నిర్వహించుకుంటోంది. విధి నిర్వహణలో నల్లపాడు పోలీసులు విజుబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు. చదవండి: వివాహేతర సంబంధం, హత్య కేసు.. నిందితుడిని పట్టించిన ‘చెప్పు’ ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో ఒక యువతి రోడ్డుపై నిలబడటం చూసి ఎందుకున్నావని సీఐ ప్రేమయ్య పలకరించారు. దీంతో ఆమె తనకు మాటలు రావని, చెవుడని సైగల ద్వారా తెలిపింది. ఆమె సైగల ద్వారా ఆమె నెల్లూరుకు చెందిన స్వాతిగా గుర్తించారు. ఎందుకు వచ్చావని ప్రశ్నించగా తన స్నేహితుడు లారీలో తెచ్చి, ఇక్కడ వదిలి వెళ్లాడని తెలిపింది. దీంతో విషయం అర్థం చేసుకున్న సీఐ ఆమెను నగరంలోని మహిళా ప్రాంగణానికి తరలించి ఆమె బంధువులకు సమాచారం అందించారు. దీంతో ఆమె బంధువులు నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు శుక్రవారం రాత్రి చేరుకున్నారు. వారిని విచారించి ఆమెను ఇంటికి పంపనున్నట్లు సీఐ తెలిపారు. అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డుపై ఉన్న యువతిని కాపాడిన సీఐను స్థానికులు, ప్రజలు అభినందించారు. చదవండి: జూబ్లీహిల్స్: డ్రస్సింగ్ రూంలో మహిళల న్యూడ్ వీడియోలు చిత్రీకరణ -
మూగ యువతిపై అత్యాచారయత్నం
సారవకోట: మూగ యువతిపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడ నుంచి ఉడాయించాడు. ఈ ఘటన సారవకోట మండలం పెద్దలంబ పంచాయతీ మూగుపురం గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితురాలి తల్లి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సారవకోట ఎస్ఐ ముకుందరావు తెలిపిన వివరాల ప్రకారం.. మూగుపురం గ్రామానికి చెందిన యడ్ల సూర్యనారాయణ (30) గురువారం సాయంత్రం ఎవరూ లేని సమయంలో 20 ఏళ్ల మూగ యువతిని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి ఒడిగట్డాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో తల్లితో పాటు చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకోవడంతో సూర్యనారాయణ పరారయ్యాడు. దీనిపై బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి, పాతపట్నం సీఐ రవిప్రసాద్, ఎస్ఐ ముకుందరావులు శుక్రవారం గ్రామాన్ని సందర్శించి స్థానికులతో మాట్లాడారు. యువకుడు పరారీలో ఉండడంతో గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. సూర్యనారాయణకు గతంలో కూడా ఇలాంటి ఘటనలతో సంబంధం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. -
బధిర యువతిపై లైంగికదాడికి యత్నం
కృష్ణాజిల్లా, పెదగొట్టిపాడు (ప్రత్తిపాడు): మూగ యువతిపై ఓ యువకుడు లైంగికదాడియత్నానికి పాల్పడిన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు ఆదిఆంధ్రా కాలనీకి చెందిన లింగాల దీనమ్మ పందొమ్మిది సంవత్సరాల కుమార్తె (పుట్టు మూగ, చెవుడు)ను తీసుకుని శుక్రవారం సాయంత్రం ప్రత్తిపాడులోని వస్త్ర దుకాణానికి వెళ్లింది. దుస్తులు కొనుగోలు చేసుకుని తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఆదిఆంధ్రా కాలనీకి వెళ్లే దారిలోని గోల్‌బావి వద్ద అదే గ్రామంలోని వీఆర్వో కాలనీ (మాలపల్లె)కు చెందిన నామా కల్యాణ్‌కుమార్ (19) వారిని వెంబడించాడు. మార్గమధ్యలో నిర్జన ప్రదేశంలో తల్లీ, కూతుళ్లను అడ్డగించి తల్లిని పక్కకు తోసేశాడు. మూగ యువతిని బలవంతంగా భుజంపైకి ఎత్తుకుని పక్కనున్న పొలాల్లోకి తీసుకెళ్లాడు. ఊహించని పరిణామంతో ఏం చేయాలో పాలుపోని తల్లి దీనమ్మ నడి రోడ్డుపైనే కూర్చుని హాహాకారాలు చేసింది. అదే సమయంలో అటువైపుగా వ్యవసాయ పనులకు వెళ్లి ఆటోలో వస్తున్న మహిళా కూలీలు, ప్రజలు గమనించారు. దీనమ్మ వారికి విషయాన్ని వివరించింది. దీంతో మహిళలు కేకలు వేస్తూ కల్యాణ్‌ని వెంబడించారు. పారిపోయేందుకు ప్రయత్నించిన యువకుడ్ని పట్టుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన.. అత్యాచార యత్నానికి పాల్పడిన యువకుడిని కఠినంగా శిక్షించాలంటూ గొట్టిపాడు ఆదిఆంధ్రా కాలనీకి చెందిన మహిళలు, కాలనీ వాసులు రాత్రి ఎనిమిది గంటల సమయంలో పెద్ద ఎత్తున ప్రత్తిపాడు పోలీస్ స్టేషనుకు చేరుకున్నారు. యువకుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, కాలనీ వాసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. యువకుడ్ని ఉపేక్షించబోమంటూ ఎస్ఐ ఏ బాలకృష్ణ వారికి నచ్చజెప్పారు. విషయం తెలుసుకున్న గుంటూరు సౌత్ జోన్ డీఎస్పీ కే ప్రకాష్‌బాబు ప్రత్తిపాడు వచ్చి బాధిత తల్లీకూతుళ్లతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తల్లి దీనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చేబ్రోలు సీఐ నరేష్కుమార్ పర్యవేక్షించారు. -
మౌనంగా రోదించి.. తనువు చాలించి..
దేశమంతా మంగళవారం ఆత్మహత్యల నివారణ దినాన్ని నిర్వహిస్తున్న వేళ.. ఓ అభాగ్యురాలు అదే అఘాయిత్యం చేసుకోవడం విషాదకరం.. ఆమెకు పుట్టుకతోనే మూగ, చెవుడు.. చిన్నప్పటి నుంచి బాధలు భరిస్తోంది.. కుటుంబ ఆర్థిక సమస్యలు అష్టకష్టాలకు గురి చేశాయి... ఇలాంటి సమయంలో ఆదరించాల్సిన భర్త వేధించడం మొదలెట్టాడు... ఆమె మౌనంగా భరించిందే కానీ పల్లెత్తు మాట అనలేని పరిస్థితి... అయినా ఆరళ్లు ఎక్కువ కావడంతో తనువు చాలించింది. ప్రొద్దుటూరు క్రైం : మండలంలోని అమృతానగర్‌కు చెందిన కొండపల్లి జహుర్‌బీ (23) మంగళవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అమృతానగర్‌లోని మాబుషరీఫ్నకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె జహుర్‌బీ, మూడో కుమార్తె ఫాతిమాకు పుట్టుకతోనే మూగ, చెవుడు ఉన్నాయి. రెండో కుమార్తె మాబుచాన్ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. జహుర్బీకి 9 నెలల క్రితం బద్వేలుకు చెందిన జిలాన్‌తో వివాహం చేశారు. అతను లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. పెళ్లి సమయంలో కట్న కానుకల కింద ఒకటిన్నర తులం బంగారు, రూ.15 వేల నగదు ఇచ్చారు. పెళ్లి అయ్యాక జహుర్‌బీ అమ్మగారింట్లోనే కాపురం ఉండేలా.. వారి మధ్య అంగీకారం కుదిరింది. అప్పటి నుంచి భార్యాభర్తలిద్దరూ వారింట్లోనే ఉంటున్నారు. వేరుగా కాపురం ఉండాలనిచెప్పడంతో.. వయసు మీద పడటంతో మాబుషరీఫ్ పనికి వెళ్లడం మానేశాడు. ఆయన భార్య ఖాదర్‌బీ మిల్లులో పనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నారు. అల్లుడు, కుమార్తె కూడా ఇంటిలోనే ఉండటంతో వారికి కుటుంబ పోషణ భారంగా మారింది. కుమార్తె, భర్తను వేరుగా కాపురం పెట్టించాలని తమ ఇంటి పక్కనే తండ్రి బాడుగ ఇల్లు కూడా చూశాడు. ఇదే విషయాన్ని అల్లుడు జిలాన్‌తో చెప్పాడు. అయితే అతను వేరుగా కాపురం ఉండటానికి అంగీకరించలేదు. ‘పక్కన కాపురం పెట్టాల్సి వస్తే ఇక్కడ ఎందుకు ఉంటాను.. మా ఊరికి వెళ్తాను’ అని చెప్పి అత్తామామలతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో గత నెల 17న జిలాన్ భార్యను పిలుచుకొని బద్వేలు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన నాటి నుంచి ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. అతను తాగి వచ్చి రోజూ భార్యను వేధించేవాడు. ఈ నెల 4న దివ్యాంగుల పింఛన్ కోసం బద్వేలు నుంచి జహుర్‌బీ ఆమె అత్తతో కలసి ప్రొద్దుటూరు వచ్చింది. పింఛన్ తీసుకున్న వెంటనే బద్వేలుకు వెళ్లారు. బాధలు తండ్రితో తెలుపుకొని.. భర్త వేధింపులు ఎక్కువ కావడంతో రెండు రోజుల క్రితం ఆమె తండ్రికి ఫోన్ చేసింది. దీంతో ఆయన సోమవారం బద్వేలు వెళ్లగా.. భర్త పెట్టే బాధలను సైగల ద్వారా చెప్పుకొని రోదించింది. కుమార్తెను వెంట తీసుకొని ఆయన అదే రోజు సాయంత్రం ప్రొద్దుటూరు వచ్చాడు. మంగళవారం ఉదయం తల్లి, మరో చెల్లెలు మిల్లులోకి పనికి వెళ్లగా, రెండో చెల్లెలు పాఠశాలకు వెళ్లింది. తండ్రి పని మీద పట్టణంలోకి వెళ్లాడు. అతను మధ్యాహ్నం ఇంటికి వచ్చి తలుపులు తీయడానికి ప్రయత్నించగా లోపల గడియ వేసి ఉంది. కుమార్తె పడుకొని ఉందేమోనని భావించి బయట పడుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటలు దాటినా కుమార్తె వాకిలి తీయకపోవడంతో మిద్దెపైకి వెళ్లి గవాచిలో నుంచి చూడగా.. జహుర్‌బీ ఉరికి వేలాడుతూ కనిపించింది. గట్టిగా రోదిస్తూ తండ్రి కిందికి దిగి వచ్చాడు. ఆమె దూలానికి చీర కట్టి ఉరి వేసుకుంది. విషయం తెలియడంతో రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్, ఏఎస్ఐ నారాయణ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు జిలాన్, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మూగ పాత్రలో లేడీ సూపర్ స్టార్
తమిళసినిమా: నయనతార ఇప్పుడు అభినయంతో కూడిన పాత్రలకే ఆమోదముద్ర వేస్తున్నారు. అగ్రతార ఇమేజ్ను కాపాడుకునే విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ప్రస్తుతం నయనతార చేతిలో ఉన్న చిత్రాలన్నీ ఆ తరహావే అని చెప్పవచ్చు. త్వరలో విశ్వనటుడు కమలహాసన్‌కు జంటగా ఇండియన్–2 చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న తొలి చిత్రం ఇదే అవుతుందన్నది గమనార్హం. నయనతార నటిస్తున్న చిత్రాల్లో కోకో ( కోలమావు కోకిల) ఒకటి. నయనతార నటనకు ప్రేక్షకులు నీరాజనం పలికిన చిత్రాల్లో నానూ రౌడీదాన్ ఒకటి. అందులో నయనతార చెవిటి యువతి పాత్రలో అద్భుతంగా అభినయించి ప్రశంసలు పొందారు. ఈ పాత్రకుగానూ సైమా అవార్డును కూడా అందుకున్నారు. తాజాగా నటిస్తున్న కోకో చిత్రంలో మూగ అమ్మాయిగా నటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కొత్త దర్శకుడు నెల్సన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర కథ నయనతార చుట్టూనే తిరుగుతుందట. ఇందులో ఆమె పాత్ర స్వరూపం, హావభావాలు, ధరించే దుస్తుల వరకూ చాలా వైవిధ్యంగా ఉంటాయట. అరమ్ చిత్రంలో పూర్తిగా విభిన్నంగా కనిపించిన నయనతార కోకో చిత్రంలో మరోసారి తనను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఇటీవల విడుదలైన చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. -
గర్భవతిని చేసి.. పసరమందు మింగించి..!
‘మేటే’ కాటేశాడు... ఓ మూగ మహిళ ప్రాణాల మీదకు తెచ్చిన కామాంధుడు పోలీసులకు ఫిర్యాదు అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న వైనం ఆమె పుట్టుకతోనే మూగ, చెవుడు. చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి మరో వివాహం చేసుకొని వదిలేశాడు. తాత ఆదరించి పెద్ద చేశాడు. తాతకు సాయంగా ఉండాలని వికలాంగుల గ్రూపులో ఉపాధిహామీ పనికి చేరింది. అంతే.. ఉపాధిహామీ మేట్‌గా బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి కామాంధుడై ఆమె అమాయకత్వంపై కాటేశాడు. గర్భవతిని చేసి.. అది పోయేందుకు పసర మందు మింగించి ప్రాణాల మీదకు తెచ్చాడు. ఆ అభాగ్యురాలి ఫిర్యాదుతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాలకొండ: మండలంలోని అవలంగి గ్రామానికి చెందిన ఓ మహిళ పుట్టుకతో మూగ చెవుడు. చిన్నతనంలో తల్లి చనిపోయింది. తండ్రి మరో పెళ్లి చేసుకుని ఓని గ్రామంలో నివసిస్తున్నాడు. దీంతో అనాథగా మారిన చిన్నారిని వృద్ధుడైన తాత గురాన సింహాద్రి ఆదరించాడు. పెంచి పెద్ద చేశాడు. అయితే, తాతకు సాయంగా ఉండాలని గ్రామంలో జరుగుతున్న ఉపాధిహామీ పనుల్లో ఆ మూగ మహిళ చేరింది. ఆమె అమాయకత్వాని ఉపాధిహామీ మేట్ దాసరి రామకృష్ణ అలుసుగా తీసుకున్నాడు. శారీరకంగా దగ్గరకాకపోతే పని నుంచి తొలగించేస్తానంటూ వేధించాడు. ఆ కామాంధుని మాటలు నమ్మిన యువతి మోసపోయింది. ఏం జరుగుతుందో తెలియని అమాయకత్వంలో గర్భం దాల్చింది. ఆమెకు ఇటీవల ఓ వ్యక్తితో వివాహం జరిగింది. ఏడునెలల గర్భవతి అని తెలియడంతో ఆయన తాత ఇంటిదగ్గర తెచ్చి మహిళను దించేశాడు. దీంతో ఆ అభాగ్యురాలు జరిగిన విషయంపై మేట్ రామకృష్ణను నిలదీసింది. ఆమెను మరోసారి మోసం చేస్తూ గర్భం పోయేందుకు పసర మందు తాగించాడు. దీంతో ఆరోగ్యం పూర్తిగా వికటించింది. పరిస్థితి ప్రాణం మీదకు వచ్చింది. అసలే పేదరికం... ఆపై అనారోగ్యంతో రోజురోజుకూ నీరసించిపోవడంతో గ్రామస్తులకు విషయం తెలిసింది. ఆమెకు గ్రామస్తులు అండగా నిలిచారు. దీంతో జరిగిన విషయమంతా పేపరుమీద రాసి పాలకొండ పోలీసులకు గ్రామస్తుల సమక్షంలో గురువారం ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మూగ యువతిపై సామూహిక అత్యాచారం
వరంగల్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఐనవోలులో దారుణం జరిగింది. ఓ మూగ యువతిపై ...దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. గురువారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన యువతిపై దుండగులు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వర్ధన్నపేట సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరోవైపు వరంగల్ జిల్లా ఎస్పీ కూడా తక్షణ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా ఘటనా స్థలంలో మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, అనుమానితులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మూగ యువతిపై సామూహిక లైంగికదాడి
ముగ్గురు మృగాళ్లు కటకటాలపాలయ్యారు. మూగ యువతి అనే జాలి కూడా లేకుండా ఆ కామాంధులు లైంగికదాడికి పాల్పడ్డారు. నోరు లేదు కదా తమనేం చేస్తుందిలే అనుకున్నారేమో ... మూగ రోదనతోనే తన ఆవేదనను పోలీసులకు చెప్పి తగిన శాస్తి చేసింది. వారు మద్యం తాగడమే కాకుండా యువతి చేత బలవంతంగా మద్యం తాగించి అమానుషంగా అనుభవించారు. పొదిలి : మూగ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక తన కార్యాలయంలో సీఐ రవిచంద్ర ఆ వివరాలు వెల్లడించారు. మర్రిపూడి మండలం గంగపాలెం గ్రామంలో ఓ మూగ యువతి ఈ నెల 3వ తేదీ ఇంట్లో ఒంటరిగా ఉండగా, రాత్రి 12 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన సోమల ప్రసాద్‌రెడ్డి, బూన చినకాశిరెడ్డి, మన్నెం నరసింహ అలియాస్ రవిలు ఆమె ఇంట్లోకి చొరబడి సామూహికంగా లైంగికదాడికి పాల్పడ్డారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మర్రిపూడి పోలీసులు సోమవారం సాయంత్రం మర్రిపూడి మండలం గుండ్లసముద్రం క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న నిందితులను అరెస్టు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న మర్రిపూడి ఎస్సై బీవీవీ సుబ్బారావు, పీఎస్సై ఎం.సుబ్రహ్మణ్యం, సిబ్బందిని సీఐ రవిచంద్ర అభినందించారు. -
దయలేని దవాఖాన
సంగారెడ్డి మునిసిపాలిటీ, న్యూస్‌లైన్: ఆమె ఓ మూగ మహిళ. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలియదు. ఏడాదిగా ఓ గ్రామంలో యాచిస్తూ జీవనం సాగిస్తోంది. గ్రామస్థులు పెట్టింది తింటూ బస్టాండులో ఉంటోంది. ఐదు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఏమీ తినలేని స్థితికి చేరుకుంది. ఆ గ్రామం పేరు మోమిన్‌పేట(రంగారెడ్డి జిల్లా). మోమిన్ అంటే మృధువైన మనస్సు కలిగిన వ్యక్తి అని అర్థం. ఊరి పేరుకు తగ్గట్లు మోమిన్‌పేట వాసులది జాలి గుండె. మనకేందుకులే అనుకొని ఊరుకోలేదు. ఆ మూగ మహిళకు దగ్గరుండి అన్నం తినిపించి సపర్యలు చేసే ప్రయత్నం చేయగా వాంతులు చేసుకుంది. ఒంట్లో సత్తువ లేక నీరసించి స్పృహ కోల్పోయింది. గ్రామస్థులు, ఆటో డ్రైవర్లు కలిసి ఆమెను సంగారెడ్డిలోని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి వైద్యం చేయించాలని నిర్ణయించారు. కొందరు ముందుకు వచ్చి చందాలు పోగుచేశారు. మోమిన్‌పేట ఎస్ఐ నాగరాజు సైతం కోరిన వెంటనే ఓ హోంగార్డును ఆస్పత్రి వరకు పంపేందుకు అంగీకరించారు. రోగితో పాటు ఆస్పత్రిలో ఉంటూ సపర్యలు చేయడానికి మంగమ్మ అనే మహిళను అటెండెంట్‌గా నియమించి రోజుకు రూ.200 చొప్పున 5 రోజుల కోసం రూ.వెయ్యి చెల్లించారు. మంగళవారం మధ్యాహ్నం హోంగార్డు గోపాల్ రెడ్డి, ఆటో డ్రైవర్లు తౌఫీక్, రాములు అటెండెంట్ మంగమ్మతో కలిసి ఆ యాచకురాలిని ఆటోలో సంగారెడ్డి ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ, ఆమె పరిస్థితి బాగాలేదనే కారణంతో ఆస్పత్రిలో చేర్పించుకోడానికి సిబ్బంది ముందుకు రాలేదు. రోగితో వచ్చిన వ్యక్తులు బతిమిలాడినా వైద్యులు, సిబ్బంది కనికరించలేదు. యాచకురాలి వద్ద దుర్వాసన వస్తోందిని, ఎలా వైద్యం చేయాలని ఎదురు ప్రశ్నించారు. దీంతో రెండు గంటల పాటు ఆమె అత్యవసర విభాగం ఎదుట స్ట్రెచర్‌పైనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆస్పత్రి అంబులెన్స్ మరో రోగిని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సమాయత్తమవుతుండగా.. మోమిన్‌పేట వాసుల బలవంతం మీద అదే అంబులెన్స్‌లో ఆ యాచకురాలిని గాంధీకి తీసుకెళ్లాలని కోరినా ఫలితం లేకుండాపోయింది. విషయం తెలిసి పాత్రికేయులు అక్కడికి చేరుకోవడంతో.. మొత్తానికి రెండు గంటల తర్వాత ఆమెను ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యం ప్రారంభించారు. వివరాలు తెలియకే ఆలస్యం ప్రతి కేసును అడ్మిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కండిషన్ సీరియస్‌గా ఉంటేనే అడ్మిట్ చేసుకుంటాం. రోగి వివరాలు తెలపకపోవడంతోనే ఆస్పత్రిలో చేర్చుకోవడంలో ఆలస్యం జరిగింది. ఒక వేళ ఆమెకు ఏమైన జరిగితే ఎవరికి అప్పగించాలో సమస్యలొస్తాయనే ఆలోచించాం. కండిషన్ సీరియస్‌గా ఉంటేనే చేర్చుకుంటాం. - డాక్టర్ మురహరి, ఆర్ఎంఓ, జిల్లా కేంద్రాస్పత్రి