‘మేటే’ కాటేశాడు...
ఓ మూగ మహిళ ప్రాణాల
మీదకు తెచ్చిన కామాంధుడు
పోలీసులకు ఫిర్యాదు
అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న వైనం
ఆమె పుట్టుకతోనే మూగ, చెవుడు. చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి మరో వివాహం చేసుకొని వదిలేశాడు. తాత ఆదరించి పెద్ద చేశాడు. తాతకు సాయంగా ఉండాలని వికలాంగుల గ్రూపులో ఉపాధిహామీ పనికి చేరింది. అంతే.. ఉపాధిహామీ మేట్‌గా బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి కామాంధుడై ఆమె అమాయకత్వంపై కాటేశాడు. గర్భవతిని చేసి.. అది పోయేందుకు పసర మందు మింగించి ప్రాణాల మీదకు తెచ్చాడు. ఆ అభాగ్యురాలి ఫిర్యాదుతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పాలకొండ: మండలంలోని అవలంగి గ్రామానికి చెందిన ఓ మహిళ పుట్టుకతో మూగ చెవుడు. చిన్నతనంలో తల్లి చనిపోయింది. తండ్రి మరో పెళ్లి చేసుకుని ఓని గ్రామంలో నివసిస్తున్నాడు. దీంతో అనాథగా మారిన చిన్నారిని వృద్ధుడైన తాత గురాన సింహాద్రి ఆదరించాడు. పెంచి పెద్ద చేశాడు. అయితే, తాతకు సాయంగా ఉండాలని గ్రామంలో జరుగుతున్న ఉపాధిహామీ పనుల్లో ఆ మూగ మహిళ చేరింది. ఆమె అమాయకత్వాని ఉపాధిహామీ మేట్ దాసరి రామకృష్ణ అలుసుగా తీసుకున్నాడు. శారీరకంగా దగ్గరకాకపోతే పని నుంచి తొలగించేస్తానంటూ వేధించాడు.
ఆ కామాంధుని మాటలు నమ్మిన యువతి మోసపోయింది. ఏం జరుగుతుందో తెలియని అమాయకత్వంలో గర్భం దాల్చింది. ఆమెకు ఇటీవల ఓ వ్యక్తితో వివాహం జరిగింది. ఏడునెలల గర్భవతి అని తెలియడంతో ఆయన తాత ఇంటిదగ్గర తెచ్చి మహిళను దించేశాడు. దీంతో ఆ అభాగ్యురాలు జరిగిన విషయంపై మేట్ రామకృష్ణను నిలదీసింది. ఆమెను మరోసారి మోసం చేస్తూ గర్భం పోయేందుకు పసర మందు తాగించాడు. దీంతో ఆరోగ్యం పూర్తిగా వికటించింది.
పరిస్థితి ప్రాణం మీదకు వచ్చింది. అసలే పేదరికం... ఆపై అనారోగ్యంతో రోజురోజుకూ నీరసించిపోవడంతో గ్రామస్తులకు విషయం తెలిసింది. ఆమెకు గ్రామస్తులు అండగా నిలిచారు. దీంతో జరిగిన విషయమంతా పేపరుమీద రాసి పాలకొండ పోలీసులకు గ్రామస్తుల సమక్షంలో గురువారం ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
గర్భవతిని చేసి.. పసరమందు మింగించి..!
Published Fri, Jun 5 2015 1:42 AM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM
Advertisement
Advertisement