ప్రియుడి మోసానికి యువతి బలి | A young woman died in the hospital after being cheated by her lover | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో నమ్మించి గర్భిణిని చేసిన ప్రేమికుడు

Aug 11 2024 10:28 AM | Updated on Aug 11 2024 10:28 AM

A young woman died in the hospital after being cheated by her lover

తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న యువతి

ప్రేమ పేరుతో నమ్మించి గర్భిణిని చేసిన ప్రేమికుడు

అనారోగ్యం కారణంగా పరిస్థితి విషమించడంతో ఒంగోలు జీజీహెచ్‌లో అడ్మిట్‌ చేసి పరార్‌

ఆస్పత్రిలో యువతి మృతి

ఒంగోలు టౌన్‌: ప్రేమ పేరుతో ఓ యువకుడి చేతిలో వంచనకు గురైన యువతి చివరకు ప్రాణాలొదిలింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో నమ్మించడంతో పాటు శారీరకంగా దగ్గరై యువతిని గర్భిణిని చేశాడు. ఆ యువతి ఆరోగ్యం క్షీణించడంతో ఒంగోలు జీజీహెచ్‌లో అడ్మిట్‌ చేసి పరారయ్యాడు. చికిత్స పొందుతూ యువతి మృతిచెందింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు రాజీవ్‌కాలనీకి చెందిన చప్పిడి రాజేంద్రప్రసాద్‌, అరుణకుమారి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులిద్దరూ పనిచేస్తున్నారు. తండ్రి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా, తల్లి కూలి పనులకు వెళ్లి పిల్లలను చదివించుకుంటోంది.

 పెద్ద కూతురు ప్రియ తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. మిగతా ఇద్దరు కూతుళ్లు చీమకుర్తిలో పదో తరగతి చదువుకుంటున్నారు. ప్రియ కూడా 3వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు చీమకుర్తి గురుకుల పాఠశాలలో చదివింది. తన క్లాస్‌మేట్‌, దూరపు బంధువైన శివకళ్యాణ్‌తో ఏడాది క్రితం ఆమెకు పరిచయమైంది. సంతనూతలపాడు మండలంలోని తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన శివకళ్యాణ్‌ పెయింటర్‌గా పనిచేస్తుంటాడు. వారి పరిచయం ప్రేమగా మారింది. ఎస్వీ యూనివర్శిటీలో బీటెక్‌ చదువుకుంటున్న ప్రియ.. తన తల్లిదండ్రులకు తెలియకుండా తక్కెళ్లపాడు వచ్చి తరచూ ప్రియుడితో కలుస్తుండేది. 

ఈ క్రమంలో శారీరకంగా కూడా దగ్గరైంది. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ప్రియుడు శివకళ్యాణ్‌కు చెప్పింది. జూలై చివరి వారంలో యూనివర్శిటీ నుంచి వచ్చేసి తక్కెళ్లపాడులో ప్రియుడితో కలిసి జీవిస్తోంది. శుక్రవారం రాత్రి ప్రియ ఆరోగ్యం దెబ్బతింది. ఎగశ్వాస వస్తుండటంతో ఆమెను ఒంగోలులోని జీజీహెచ్‌కి శివకళ్యాణ్‌ తీసుకొచ్చాడు. హాస్పిటల్‌లో చేర్పించి ప్రియ తండ్రి రాజేంద్ర ప్రసాద్‌కు గుర్తు తెలియని వ్యక్తిలా ఫోన్‌ చేశాడు. తిరుపతి నుంచి రైలులో వస్తుండగా మీ అమ్మాయికి ఫిట్స్‌ వచ్చాయని, ఆమెను ఒంగోలు జీజీహెచ్‌లో జాయిన్‌ చేశానని చెప్పాడు. 

ఆందోళనకు గురైన రాజేంద్ర ప్రసాద్‌ హడావిడిగా జీజీహెచ్‌కి వచ్చాడు. ఆస్పత్రిలో వాకబు చేయగా, మీ కూతురు ఆరో నెల గర్భిణి అని, ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంతనూతలపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ప్రియ ప్రియుడు శివకళ్యాణ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

నా బిడ్డను చంపిన హంతకులను శిక్షించండి సారూ...
నా బిడ్డతో రెండు రోజుల క్రితమే మాట్లాడాను. బాగానే మాట్లాడింది. కాస్త దగ్గు వస్తుందని చెప్పింది. ఇంతలో ఇలా చనిపోతుందని అనుకోలేదంటూ ప్రియ తల్లి అరుణకుమారి గుండెలవిసేలా రోదిస్తోంది. తన బిడ్డను మోసం చేసి ఆమె చావుకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని, తన బిడ్డలాగా మరొకరి బిడ్డ బలికాకూడదని కన్నీరు పెట్టింది. ప్రియ కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు కోరుతున్నారు. ప్రియ నోటి నుంచి నురగ వస్తుండటంతో ఆమె మరణం సహజ మరణం కాదన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమైపె హత్యా ప్రయత్నం జరిగి ఉండవచ్చని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు పూర్తిగా విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement