
అక్క మృతదేహానికి తాడుకట్టి లాక్కెళ్లిన చెల్లెళ్లు
ఆస్తి కోసం అయినవారి కీచులాట
అంత్యక్రియలు తామే చేస్తామంటూ గొడవ
అమరాపురం, న్యూస్‌లైన్: మానవత్వం చిన్నబోయింది. మనిషితత్వం బయటపడింది. ఆస్తి కోసం అయినవారే అడ్డంగా వాదులాడుకున్నారు. సంస్కారం మరిచి అంతిమ సంస్కారం తామే చేస్తామంటూ కొట్లాడుకున్నారు. అనంతపురం జిల్లా అమరాపురం మండలం వలస గ్రామానికి చెందిన లక్ష్మమ్మ (85) సోమవారం అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె భర్త పూజారప్ప పదేళ్ల కిందటే మరణించాడు. వీరికి సంతానం లేదు. ఇల్లు, ఐదెకరాల పొలం ఉంది.
లక్ష్మమ్మ మృతి చెందడంతో ఆమె ఆస్తి కోసం పూజారప్ప సోదరులు ఒకవైపు.. లక్ష్మమ్మ చెల్లెళ్లు శాంతమ్మ, లక్ష్మక్క మరో వైపు పోటీపడ్డారు. అంత్యక్రియలు ఎవరు చేస్తే వారికి ఆస్తిపై హక్కు వస్తుందనే ఉద్దేశంతో.. దహన సంస్కారం తామంటే తాము చేస్తామంటూ గొడవపడ్డారు. ఈ క్రమంలో మృతదేహాన్ని తీసుకెళ్లాల్సిన బంధువులు, పూజారప్ప సోదరులను లక్ష్మమ్మ చెల్లెళ్లు అడ్డుకున్నారు. చివరికి వాళ్లిద్దరే మృతదేహాన్ని శ్మశానానికి ఎత్తుకెళ్లలేక తాడు కట్టుకుని లాక్కెళ్తుండగా గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని సంప్రదాయం ప్రకారం దహన సంస్కారం చేయించారు.