
జూలైలో పుష్కరనీరు విడుదల చేయాలి
జగ్గంపేట : మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలను అందించే పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా జూలై మొదటి వారం నుంచే రైతులకు సాగునీరు విడుదల చేయాలని పుష్కర ఇరిగేషన్ అధికారులను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. పుష్కర పథకం సాగునీరు అందించడంలో ఏర్పడే సమస్యలు, వాటి పరిష్కారం తదితర అంశాలపై శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జ్యోతుల మాట్లాడుతూ పుష్కర పథకం ద్వారా మూడేళ్లుగా ఖరీఫ్‌లో రైతులకు నీరు సరఫరా చేస్తున్నా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో అందడం లేదన్నారు.
మొత్తం 1,86,000 ఎకరాలకు నీరు అందించేందుకు రూపొందించిన ఈ పథకం ద్వారా జగ్గంపేట నియోజకవర్గంలో 59 వేల ఎకరాలకు నీరు రావాలన్నారు. అయితే 20 వేల ఎకరాలకు నీరందే పరిస్థితి నెలకొందన్నారు. కాలువల్లో పూడిక తీయడానికి సమయం లేనందున ఉపాధి పథకం ద్వారా వీలైనంత త్వరగా చిన్న చిన్న కాలువలను శుభ్రపరచాలన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం క్షేత్రస్థాయిలో కాలువల పరిశీలన చేద్దామన్నారు.
జగ్గంపేట, గండేపల్లి, గోకవరం, కిర్లంపూడి మండలాల నుంచి వచ్చిన రైతులు సమీక్షలో పుష్కర సమస్యలను ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమావేశానికి ధవళేశ్వరం ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు అత్తులూరి సాయిబాబు, డీఈఈలు రామచంద్రరావు, శ్రీరామచంద్రమూర్తి, ప్రశాంత్ బాబు, హోలిపుల, జేఈ మనోహర్ చంద్రశేఖర్, ఇన్‌చార్జి ఎంపీడీఓ నరసింగరావు, జగ్గంపేట సర్పంచ్ ప్రసన్నరాణి తదితరులు పాల్గొన్నారు.