గుంటూరు(నరసరావుపేట): పోలీసుల కళ్ళుగప్పి రిమాండ్ ఖైదీ పరారైన సంఘటన గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంతర్ జిల్లాల నేరస్తుడు ఏరియా వైద్యశాల నుంచి పోలీసుల కళ్లుకప్పి పారిపోయాడు. ఈ వ్యవహారంపై పోలీసు, సబ్‌జైలు అధికారులు అత్యంత గోప్యంగా విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే. ప్రకాశం జిల్లా ఒంగోలు ఇస్లాంపేట 4వ వీధికి చెందిన షేక్ రఫీ, తండ్రి మస్తాన్‌వలిపై గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలు కేసులు ఉన్నాయి. మూడు నెలల క్రితం నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్‌నగర్‌లో జరిగిన ద్విచక్రవాహన చోరీ కేసులో రఫీ నిందితుడు.
అతనిని ఒంగోలు రూరల్ పోలీసులు దొంగతనం కేసులో రెండు నెలల క్రితం అరెస్టుచేసి సబ్‌జైలుకు తరలించారు. రఫీ సబ్‌జైలులో ఉన్నాడని తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు ఈనెల 6వ తేదీన అతడిని పీటీ వారంట్‌పై ద్విచక్రవాహన దొంగతనం కేసులో న్యాయస్థానం ఎదుట హాజరుపర్చి నరసరావుపేట సబ్‌జైలుకు తరలించారు. అప్పటి నుంచి అతను సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. ఈనెల 12వ తేదీన రఫీకి జ్వరం రావటంతో సబ్‌జైలు సిబ్బంది ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు తమ పర్యవేక్షణలో ఉంచి చికిత్స చేయాలని సూచించటంతో వైద్యశాలలో ఉంచారు. ఈ క్రమంలో 14వ తేదీ తెల్లవారుజామున ఎస్కార్టు విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసు సిబ్బంది కళ్లు గప్పి రఫీ పరారయ్యాడు. ఈ సంఘటనపై అదే రోజు వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. విషయం బయటకు పొక్కకుండా పోలీసులు, సబ్‌జైలు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.