తొలగింపుపై తిరుగుబాటు | Removal of the uprising | Sakshi
Sakshi News home page

తొలగింపుపై తిరుగుబాటు

Published Fri, Dec 25 2015 1:04 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

Removal of the uprising

నోటికి నల్ల రిబ్బన్లతో అంగన్‌వాడీల ప్రదర్శన
సర్కార్ ఉత్తర్వులు రద్దు చేయాలని డిమాండ్
సమస్యలు పరిష్కరించేవరకు ఉద్యమం కొనసాగిస్తామని వెల్లడి

 
విజయవాడ (మధురానగర్) : జీతాల పెంపుపై ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ ఈ నెల 18న ధర్నాలో పాల్గొన్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లను తొలగించాలంటూ ఉత్తర్వులు ఇవ్వటంపై ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యాన గురువారం మౌన నిరసన చేపట్టారు. నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని లెనిన్ సెంటర్‌లో ప్రదర్శన చేశారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుప్రజ మాట్లాడుతూ తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం చేస్తున్న ఉద్యమాలను నీరుగార్చేందుకు టీడీపీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉద్యోగాలు తొలగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. తామంతా సంఘటితంగా ఉండి డిమాండ్లు సాధించుకుంటామని, తమ సమస్యలు పరిష్కరించేవరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

అప్పులు చేసి నిర్వహిస్తున్నాం...
గత ఆరు నెలలుగా వేతనాలు, బిల్లులు సక్రమంగా రాకపోయినా తాము అప్పులు చేసి మరీ సెంటర్లను నిర్వహిస్తున్నామని సుప్రజ చెప్పారు. చాలీచాలని వేతనాలతో అవస్థలు పడుతున్న తాము కనీస వేతనాల కోసం శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తే తమపై పోలీసులతో దాడి చేయించటమే కాకుండా ధర్నాలో పాల్గొన్నవారిని ఉద్యోగాలు నుంచి తొలగించటానికి ప్రయత్నించటం ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు, ధర్నాలు ఉద్యమాలు ఎందుకు చేశారని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీలో రాత్రంతా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురించి చర్చించిన టీడీపీ సర్కారు తమ సమస్యల గురించి పట్టించుకోకపోవటంపై ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. అసెంబ్లీలో తమ సమస్యలపై మాట్లాడుతున్న రోజాను సస్పెండ్ చేయటమేకాక నగరంలో టీడీపీ నాయకులు రోజా దిష్టిబొమ్మను దహనం చేయటం వారి నైజాన్ని తెలియజేస్తోందన్నారు.

అణచివేయాలని చూస్తున్నారు...
ఎన్నికలకు ముందు అంగన్‌వాడీ టీచర్ల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్ర బాబు.. ఇప్పుడు అంగన్‌వాడీ ఉద్యమాన్ని అణచి వేయటానికి ప్రయత్నిస్తునారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ నాయకులు సుధాకర్, టి.ప్రభుదాస్, బి.నాగేశ్వరరావులు మాట్లాడుతూ అంగన్‌వాడీల పోరాటానికి తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందన్నారు. న్యాయమైన డిమాండ్‌ల కోసం కార్మికులు చేస్తున్న ఉద్యమాలను ఖాకీలతో అణగదొక్కాలనుకోవటం ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గుచేటన్నారు. తాను మారాన ని చెప్పి ఎన్నికల్లో ఓట్లేయించుకున్న చంద్రబాబు ఎన్నికల్లో గెలిచిన రెండేళ్లలో పోలీసు బందోబస్తుతోనే పరిపాలన సాగిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీ ఉద్యోగులకు వేతనాల పెంపు జీవోను జారీ చేసి ధర్నాలో పాల్గొన్న ఉద్యోగులను తొలగించటానికి జారీ చేసిన మెమో నంబర్ 5557-కె.3-2015ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకుడు డేవిడ్, ఐద్వా నాయకులు ఝాన్సీ, షకీలా పాల్గొన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement