మద్యం దుకాణాన్ని తొలగించాలి
కొంకుదురు(బిక్కవోలు) : బ్రాందీ షాపు తొలగించాలంటూ కొంకుదురు గ్రామంలో సోమవారం శెట్టిబలిజ పేట వాసులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే... 2014 సంవత్సరానికి గాను కొంకుదురు గ్రామానికి రెండు మద్యం షాపులకు టెండర్లు నిర్వహించారు. ఒక షాపును ప్రైవేట్ వ్యక్తులు పాడుకొని శెట్టిబలిజ పేటలో ఉన్న 4-1 డోర్ నంబర్ గల ఇంటిలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. దీనిని పట్టాభిరామ శెట్టి బలిజ సొసైటీ ఆధ్వర్యంలో శెట్టిబలిజలు అడ్డుకున్నారు. ఊరు బయట షాపు నిర్వహించుకోవాలని సూచించారు. ఇక రెండో షాపునకు పాటదారులెవరూ ముందుకు రాకపోవడంతో ఏపీబీసీఎల్ ద్వారా ప్రభుత్వమే మద్యం దుకాణాన్ని శెట్టిబలిజపేటలో ఉన్న 4-1 డోర్ నంబరు గల ఇంటిలో ఈ నెల ఒకటో తేదీన ఏర్పాటు చేసింది. దీంతో శెట్టిబలిజలు మరోసారి ఆందోళనకు దిగారు.
సోమవారం ఉదయం సుమారు 500 మంది మద్యం షాపు ఏర్పాటుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్యం షాపు ముందు టెంట్ వేసి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న బిక్కవోలు ఎస్సై పి.దొరరాజు తన సిబ్బందితో వచ్చి ఆందోళనకారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మద్యం షాపును ఊరి మధ్య నుంచి తరలించాలని కోరారు. దీనికి ఎస్సై పి.దొరరాజు బదులిస్తూ ఈ సమస్యను తనపై అధికారులు, ఎక్సైజ్ డిపార్ట్‌మెంటు దృష్టికి తీసుకు వెళతానని, అంత వరకు కానిస్టేబుల్‌ను దుకాణం వద్ద కాపలా పెడతానని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.