సాక్షి, తిరుమల: సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా మంగళవారం తిరుమల కొండకు 38 ఏళ్ల తర్వాత ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. అయితే, ఆర్టీసీతో టీటీడీ అధికారులు జరిపిన చర్చలు సఫలం కావడంతో మంగళవారం రాత్రి 11 గంటలకు తిరుమల నుంచి తిరుపతికి బస్సులను పునరుద్ధరించారు. రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు రోజుకు సుమారు 500 బస్సు సర్వీసులు 3,200 ట్రిప్పులు తిప్పుతున్నారు. దీనివల్ల రోజుకు సరాసరిగా రోజుకు 40వేల మందిని తిరుమలకు చేరవేస్తున్నారు. దీనివల్ల ఆర్టీసీకి రోజుకు రూ.35 లక్షల మేర ఆదాయం సమకూరుతోంది. సమ్మెలో భాగంగా తిరుమల డిపోకు తాళం వేయడంతో అందులోని 106 బస్సులు ఆగిపోయాయి.
తిరుపతి, అలిపిరి, మంగళంతోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల బస్సులు కూడా డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా, మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్, టీటీడీ ఈవో ఎంజీ గోపాల్, తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు తదితరులు కలసి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరాజ్, కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపారు. అరగంట పాటు సాగిన ఈ చర్చల్లో తిరుమలకు బుధవారం వేకువజామున నుంచి బస్సులు నడిపేందుకు కార్మిక సంఘా లు అంగీకరించాయి. తిరుమల డిపోకు చెందిన 107 బస్సులను మాత్రమే నడపాలని, ఇవి కూడా అలిపిరి వద్ద ఉన్న బాలాజీ బస్టేషన్ వరకు నడపాలని నిర్ణయించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండ టానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రభాకర్, చల్లా చంద్రయ్య తెలిపారు.
తిరుమలలో బస్సుల పునరుద్ధరణ
Published Wed, Aug 14 2013 4:19 AM | Last Updated on Tue, Aug 28 2018 5:54 PM
Advertisement
Advertisement