
హోం మంత్రికి పోలీసు అధికారుల సంఘం వినతి
కడప అర్బన్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్పకు జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అగ్రహారం శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో ఆదివారం వినతిపత్రం అందజేశారు. వ్యక్తిగత రుణాల మంజూరు కోసం బ్యాంకులు వేతన ధ్రువీకరణ పత్రాలు తప్పని సరి అని పేర్కొంటున్నాయన్నారు. కానీ పోలీసు శాఖలో వేతన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు మంత్రికి వివరించారు.
దీనిపై స్పందించిన హోం మంత్రి పోలీసు సిబ్బందికి వేతన ధ్రువీకరణ పత్రాలను డ్రాయింగ్ అధికారి ద్వారా జారీ చేసేలా ఉత్తర్వులు విడుదల చేస్తామన్నారు. సమస్యపై సానుకూలంగా స్పందించిన హోం మంత్రికి పోలీసు అధికారుల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. హోంమంత్రిని కలిసిన వారిలో సంఘం ఉపాధ్యక్షుడు నాయకుల నారాయణ, కార్యదర్శి బాల మద్దిలేటి, కోశాధికారి ఆర్.నారాయణరాజు, సభ్యులు కె.మనోహర్‌వర్మ, బాలాజీ ఉన్నారు.