క్రీడల నిర్వహణకు నిధులివ్వాలని వినతి
కడప స్పోర్ట్స్ : జిల్లాలో పాఠశాలల క్రీడల నిర్వహణకు అవసరమైన నిధులు అందించాలని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డిని జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం నాయకులు కోరారు. శనివారం నగరంలోని వైఎస్ గెస్ట్‌హౌస్‌లో జిల్లా వ్యాయామ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివశంకర్‌రెడ్డి, ప్రవీణ్‌కిరణ్ ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయులు ఎంపీని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలలను 8 క్రీడాజోన్లుగా ఏర్పాటు చేసి క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జోనల్ క్రీడలతో పాటు సెంట్రల్‌మీట్‌లు నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థికసాయం అందక క్రీడల నిర్వహణ భారంగా తయారవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దాతల చేయూతతో క్రీడల నిర్వహణ సాగుతోందన్నారు. గతంలో జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన సురేష్‌బాబు హయాంలో ఒక్కో పాఠశాలకు రూ.5వేలు చొప్పున నిధులను కేటాయించారన్నారు. క్రీడల నిర్వహణకు జెడ్పీ లేదా ఎంపీ నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.