ఎల్.ఎన్.పేట: వంశధార రిజర్వాయర్ పనులను పోలీసు బందోబస్తు మధ్య కొనసాగిస్తాం, పనులు అడ్డుకోవాలని చూస్తే నిర్వాసితులకే నష్టం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ అన్నారు. మండలంలోని శ్యామలాపురం వద్ద జరుగుతున్న వంశధార రిజర్వాయర్ పునరావాస కాలనీ నిర్మాణం పనులను ఆయన బుధవారం పరిశీలించారు. రిజర్వాయర్ నిర్మాణానికి సహకరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించాలని నిర్వాసితులు ఆందోళన చేయడంలో తప్పులేదన్నారు. అయితే, ప్రభుత్వ పరంగా రావాల్సిన నష్టపరిహారం అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. శ్యామలాపురం పునరావాస కాలనీలో తాగునీటి, విద్యుత్ సౌకర్యాల కల్పనకు కృషిచేస్తామన్నారు.
కాలనీలో ప్లాట్‌లు లోతట్టుగా ఉన్నాయని, ఎత్తు చేసేందుకు మట్టితరలిస్తామన్నారు. కాలనీకి దిగువున ఉన్న భద్రకాళి సాగరం చెరువుకు సీసీ రక్షణ గోడ నిర్మాణం కంటే మట్టితో గట్టువేసుకుని గట్టుని పార్కులా మొక్కలతో తయారు చేయాలన్నారు. మూడు నెలల్లో మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామన్నారు. కాలనీకి ఆనుకుని ఏబీ రోడ్డువైపున ఉన్న భూముల సేకరించవద్దని అక్కడి రైతులు జేసీకి విన్నవించారు. తమ భూములన్నీ వంశధార కుడి ప్రధాన కాలువకు, ప్రస్తుతం నిర్మిస్తున్న పునరావాస కాలనీకి, ైెహ లెవల్ కాలువ కోసం సేకరించారని, ఉన్న కొద్దిపాటి భూములే మాకు ఆధారమంటూ రైతులు బి.వెంకటేష్, సింహాచలం, చంద్రరావు తదితరులు గోడు వినిపించారు. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
మౌలిక సదుపాయాలు కల్పించండి...
ఆమదాలవలస: హిరమండలం మండలం తులగాం నిర్వాసితులు 73 కుటుంబాలకు మండలంలోని జొన్నవలస సమీపంలో ఇళ్లపట్టాలు అందించారు. రోడ్డు నిర్మించకపోవడంతో ఇక్కడ ఒక్క ఇల్లుకూడా నిర్మించలేదు. ఈ స్థలానికి వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని, నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి సహకరించాలని జేసీ వివేక్‌యాదవ్ స్థానిక అధికారులను ఆదేశించారు. రోడ్డు నిర్మాణానికి కావాల్సిన భూమిని ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడంతో వెంటనే పనులు ప్రారంభించాలని తహశీల్దారు కె.శ్రీరాములకు సూచించారు. కాలనీలో ఇళ్ల నిర్మాణం మ్యాప్‌ను పరి శీలించారు.
పనులు వేగవంతం చేయాలి
కొత్తూరు: కర్లెమ్మ పంచాయతీ పరిధి మహసింగిగూడ సమీపంలో నిర్మిస్తున్న పునరావస కాలనీ పనులను వేగవంతం చేయాలని జేసీ వివేక్‌యాదవ్ స్థానిక అధికారులను ఆదేశించారు. పునరావాస కాలనీలో నిర్మించిన పాఠశాల, పంచాయతీ భవనం, అంగన్‌వాడీ కేంద్రం, పాలకేంద్రంతో పాటు పలు నిర్మాణాలను పరిశీలించారు. కాలనీలో ఇంత వరకు ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాలను సేకరించి నిర్వాసితులకు పట్టాలు అందజేయాలని తహశీల్దార్ దదిరావు చంద్రశేఖర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు సాల్మన్‌రాజ్, దయానిధి, వంశధార ఈఈ ఎం.ఎ.సీతారాం నాయుడు, డీఈ కె.బ్రహ్మానందం, ఎల్.ఎన్.పేటతహశీల్దారు ఎన్.ఎం.ఎన్.వి.రమణమూర్తి, ఏఈఈ పి.రంజిత్ జేఈలు ఎం.కపిల్, ఎస్.హరీష్, మహేష్, ఆర్‌ఐలు ఎ.జగదీష్‌బాబు, కూర్మారావు, రామచంద్రరావు, వీర్వో కృష్ణచంద్రపట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
పనులు అడ్డుకుంటే నిర్వాసితులకే నష్టం
Published Thu, Jul 9 2015 12:55 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement
Advertisement