యూనివర్సిటీ క్యాంపస్ : ఎస్వీ యూనివర్సిటీలో నాక్ కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ డీసీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఎస్వీయూ ఆక్వా కల్చర్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డీసీ రెడ్డి 2013 ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేశారు. అనంతరం నాక్ కో-ఆర్డినేటర్‌గా నియమితులై 20 నెలలపాటు పనిచేశారు. రెండు నెలలుగా రాజీనామా విషయమై తర్జనభర్జన పడుతున్నారు. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం వీసీ రాజేంద్రను కలిసి రాజీనామా పత్రం సమర్పించారు.
రాష్ట్రంలో పది సంవత్సరాల తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. క్యాంపస్‌లోని టీడీపీ సానుభూతిపరులు పదవుల పట్ల ఆశలు పెట్టుకున్నారు. అప్పటి వరకు పదవుల్లో కొనసాగిన అధికారులు ఒక్కొక్కరే తప్పుకుంటున్నారు. ఫైనాన్స్ సలహాదారుగా ఉన్న ప్రొఫెసర్ వీ.కోదండరామిరెడ్డి జూలైలో రాజీనామా చేశారు. మీడియా డీన్‌గా పనిచేసిన ప్రొఫెసర్ పేట శ్రీనివాసులురెడ్డి గత నెలలో రాజీనామా చేశారు. ఇప్పుడు డీసీ రెడ్డి కూడా వారిబాటనే అనుసరించారు. మరికొంతమంది అధికారులు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు క్యాంపస్‌లో ప్రచారం జరుగుతోంది.
కొత్త అధికారుల నియామకం
ఎస్వీయూలో కొత్త అధికారుల నియామకం కొనసాగుతోంది. రిజిస్ట్రార్‌గా పనిచేసిన సత్యవేలురెడ్డి స్థానంలో ప్రొఫెసర్ ఎం.దేవరాజులు నియమితులయ్యారు. సీడీసీ డీన్‌గా పనిచేసిన శ్రీకాంత్‌రెడ్డి స్థానంలో త్యాగరాజు నియమితులయ్యారు. పరీక్షల విభాగం గౌరవ డెరైక్టర్‌గా ప్రొఫెసర్ కిరణ్‌కాంత్ చౌదరి, డీడీఈ ఆన్‌లైన్ ఎగ్జామ్స్, ఆన్‌లైన్ అడ్మిషన్ గౌరవ డెరైక్టర్‌గా ప్రొఫెసర్ పీ.గోవిందరాజులు నియమితులయ్యారు. ఈ ఇద్దరు ప్రొఫెసర్లు సర్వీసు నుంచి రిటైర్డ్ అయ్యారు. ఉచితంగా సేవ చేసేందుకు ముందుకు రావడంతో వారిని పై పదవుల్లో నియమించారు.
మీడియా డీన్ పోస్టుకు తీవ్ర పోటీ
ఎస్వీ యూనివ ర్సిటీలో మీడియా డీన్ పోస్టుకు తీవ్ర పోటీ నెలకొంది. ఈ పదవిలో కొనసాగిన పేట శ్రీనివాసులురెడ్డి గత నెలలో రాజీనామా చేశారు. ఈ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. అకడమిక్ స్టాఫ్ కళాశాలకు చెందిన వెంకటరమణ, ప్రాచ్య పరిశోధనకు చెందిన పీసీ.వెంకటేశ్వర్లు మధ్య పోటీ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
ఎస్వీయూ నాక్ కో-ఆర్డినేటర్ రాజీనామా
Published Fri, Oct 17 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM
Advertisement
Advertisement