జిల్లా స్థాయి కమిటీ ద్వారానే రీసోర్స్ టీచర్ల ఎంపిక
కర్నూలు(అగ్రికల్చర్): రీసోర్స్ టీచర్ల ఎంపికకు పరీక్ష నిర్వహించి జిల్లా స్థాయి కమిటీ ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయ్‌మోహన్ సర్వశిక్ష అభియాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయన సర్వశిక్ష అభియాన్ వయోజన విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి రీసోర్స్ టీచర్ల ఎంపికకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఈ నెల 15 నాటికి పూర్తి చేయాలన్నారు. ఈ నెల నుంచి 2 నుంచి 20 వరకు నిర్వహించే జన్మభూమి-మాఊరు కార్యక్రమం పూర్తయ్యేలోపు బడిబయట ఉన్న బడిఈడు పిల్లలను వంద శాతం పాఠశాలలో చేర్పించేలా కృషి చేయాలన్నారు. విద్యా హక్కు చట్టం, గుణాత్మక విద్య, నిరంతర సమగ్ర మూల్యాంకనం ద్వారా పిల్లల చదువు వారి స్థితి గతులతో పాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వంట గదుల నిర్మాణం, మధ్యాహ్న భోజనంలో మెను అమలు, క్రీడా సామగ్రి, తదితర వసతులు ఉన్నాయా లేదా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు అంటువ్యాధులు సోకకుండా హెల్త్ క్యాంపులు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేయాలన్నారు. స్కూలు గ్రాంటు, మెయిన్‌టెనెన్స్ గ్రాంటు కింద ఇచ్చిన నిధుల వినియోగంపై ర్యాండమ్‌గా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎస్‌ఎస్‌ఏ పీఓను ఆదేశించారు. విద్యార్థులకు సరఫరా చేస్తున్న యూనిఫాం, టైలరింగ్ చార్జీల చెల్లింపు, కమ్యూనిటీ మొబలైజర్స్ విధి విధానాలకు సంబంధించిన ఫైల్‌ను తమకు పంపాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరక్షరాస్యులైన మహిళలను వంద శాతం అక్షరాస్యులుగా చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతుందని తెలిపారు. వయోజన విద్య శాఖ డీడీ సత్యనారాయణ, ఎస్‌ఎస్‌ఏ పీఓ మురళీధర్, ఈఈ ప్రసాద్, వయోజన విద్యశాఖ ఏపీఓలు పాల్గొన్నారు.