కర్నూలు అగ్రికల్చర్: జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో ఎప్పటిలాగే ప్రజాదర్బార్ పోటెత్తింది. ఎన్ని సార్లు తిరిగినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని బాధితులు వాపోయారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో కలెక్టర్ సీహెచ్ విజయ్‌మోహన్ వినతులు స్వీకరించారు. జేసీ హరికిరణ్, ఏజేసీ రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్ గౌడ్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి పివి.రమణరావు, ల్యాండ్‌రిఫామ్స్ తహశీల్దారు ఎలిజబెత్ తదితరులు కూడా వినతులు స్వీకరించారు.వచ్చిన వినతులను అక్కడే స్కానింగ్ చేసి ప్రజావాణి వెబ్‌సైట్‌లో ఉంచి సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు. ప్రజాదర్బార్‌కు వచ్చిన సమస్యల్లో కొన్ని ఇలా ఉన్నాయి.
చాగలమర్రి మండలం చిన్న బోధనం గ్రామంలో రాంపుల్లయ్య పాయన్నలు 4.62 ఎకరాల ప్రభుత్వ భూమిని కొన్ని దశాబ్దాలుగా అనుభవిస్తున్నారు. ఇందులో రెండు ఎకరాలకు ప్రభుత్వం వీరికి పట్టా, పాస్ పుస్తకం కూడా ఇచ్చింది. అయితే ఓబుల్‌రెడ్డి అనే వ్యక్తి తన భార్య భారతి పేరు మీద 4.62 ఎకరాకు బోగస్ పట్టాదారు పాస్ పుస్తకం తీసుకుని ఆన్‌లైన్‌లో ఎక్కించుకున్నాడు. దీనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వారు కలెక్టర్‌ను కోరారు.
ఉయ్యాలవాడ మండలం బోడెమ్మనూరు గ్రామంలో గ్రామ దేవత పెద్దమ్మ మాన్యం భూములను పెద్దలు ఆక్రమించుకున్నారు. కొన్నేళ్లుగా దీనిపై ఫిర్యాదులు చేస్తున్న పట్టించుకునే వారు లేరు. పేదలు అనుభవిస్తున్న మాన్యం భూములను పెద్దలు ఆక్రమించుకున్న విషయం తెలిసినా ఎవ్వరు స్పందించడం లేదు. ఇప్పటికైనా చర్యలు తీసుకొని మాన్యం భూములను పెద్దల నుండి స్వాధీనం చేసుకోవాలని ఓబులపతి, ఓబులేసు తదితరులు కోరారు.
హామీలు అమలు చేయండి..
తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టి తొమ్మిది నెలలు గడిచిన ఇప్పటి వరకు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల్లో ఏ ఒక్కదానిపైన దృష్టి సారించలేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని విభజన చట్టంలోని హామీలను సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజాదర్బార్‌లో కలెక్టర్‌ను కోరారు. డీసీసీ అధ్యక్షుడు బీవై.రామయ్య, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, మాజీ జడ్పీ ఛైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, డీసీసీ ఉపాధ్యక్షుడు సర్దార్ బుచ్చిబాబు తదితరులు కలెక్టర్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.
షరా మామూలే..!
Published Tue, Feb 24 2015 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM
Advertisement
Advertisement