వేళ తప్పితే వేటే!
సమయపాలన పాటించని ఉద్యోగులపై కలెక్టర్ కన్నెర్ర
20 మందికి తాఖీదులు.. ఇద్దరు డీటీలకు కూడా
ప్రజాదర్బార్‌కు రాని అధికారులకు క్లాస్
పాలనలో కలెక్టర్ రఘునందన్ కొత్త ఒరవడి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సమయపాలన పాటించని ఉద్యోగులపై కొత్త బాస్ కొరడా ఝళిపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించిన 20 మందికి తాఖీదులు జారీ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన‘ప్రజాదర్బార్’కు డుమ్మా కొట్టిన ఉన్నతాధికారులను వదలకూడదని నిర్ణయించిన కలెక్టర్ రఘునందన్‌రావు.. విధులకు ఆలస్యంగా వచ్చిన, ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన ఉద్యోగులకు నోటీసులు ఇవ్వాలని సంబంధిత శాఖాధిపతులను ఆదేశించారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడమే తరువాయి కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్స్‌డేకు విధిగా జిల్లా అధికారులు హాజరుకావాలని, మండల స్థాయిలోనూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సర్క్యులర్ జారీ చేశారు. ఈ క్రమంలోనే గత 21న కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగుల హాజరును స్వయంగా తెలుసుకున్న సంగతి తెలిసిందే.
సంజాయిషీ ఇవ్వాల్సిందే..
కార్యాలయానికి సకాలంలో హాజరుకాని ఉద్యోగుల నుంచి సంజాయిషీ కోరాలని ఆయా శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గత సోమవారం విధులకు ఆలస్యంగా వచ్చిన 12 మందికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. వీరిలో ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు టైపిస్టులు, ఒక యూడీఆర్‌ఐ ఉన్నారు. అలాగే మండల పరిషత్ కార్యాలయాల్లో పనిచేస్తున్న 8 మందికి కూడా శ్రీముఖాలను జారీ చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. నిర్ణీత సమయానికి విధులకు రాని ముగ్గురితోపాటు అనధికారికంగా విధులకు ఎగనామం పెట్టిన మరో ఐదుగురికి ఈ నోటీసులు అందాయి.
దర్బార్‌కు రానివారి సంగతి తేల్చండి..
ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజాదర్బార్‌కు జిల్లా అధికారులు ముఖం చాటేస్తున్నారు. ఆర్నెల్లుగా అర్జీలను స్వీకరించేందుకు కలెక్టర్, జేసీలు సైతం హాజరుకాకపోవడంతో దర్బార్‌పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. యథారాజా తథా అధికారి అన్న తరహాలో జిల్లా బాస్‌లు రాకపోవడంతో అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో ప్రతి సోమవారం ప్రజాదర్బార్ మొక్కుబడిగా మారింది. ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించినకలెక్టర్ రఘునందన్‌రావు.. పాత రికార్డుల దుమ్ముదులపాలని నిర్ణయించారు. ప్రజాదర్బార్‌కు సంబంధించి కొన్ని నెల ల హాజరు వివరాలను నివేదిం చాలని డీఆర్‌ఓను ఆదేశిం చారు. ఈ సమాచారాన్ని బేరీజు వేయ డం ద్వారా గ్రీవెన్స్‌డేకు రాని అధికారులకు తలంట నున్నట్లు తెలిసింది. కలెక్టరేట్ తరహా లోనే క్షేత్రస్థాయిలోనూ ఇదే విధానం అమలు చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచా రం. చెత్తకుప్పలను తలపించేలా వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీలు.. మెకానిక్ షెడ్డును పోలినట్లు చెడిపోయిన కార్ల పార్కింగ్‌తో కనిపించిన కలెక్టరేట్ ఆవరణను కొత్త యంత్రాంగం ‘క్లీన్’గా చేసిం ది. కేవలం ఆవరణలేకాకుండా.. పనితీరులోనూ మార్పు తెచ్చేలా నయా బాస్ రఘునందన్ సంస్కరణలు తీసుకురావడం విశేషం.