రైతుకు అండగా ఉంటాం | For solving farmer's problem make concerns | Sakshi
Sakshi News home page

రైతుకు అండగా ఉంటాం

Published Fri, May 8 2015 3:30 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

For solving farmer's problem make concerns

- అన్నదాతల సంక్షేమాన్ని పాలకులు విస్మరిస్తున్నారు
- సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేస్తాం
- వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సిద్దార్థరెడ్డి
నిజాంసాగర్ :
రైతుల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, వారి పక్షాన ఉద్యమాలు చేసేందుకు వైఎస్సార్ సీపీ ముందుకు సాగుతోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్దపట్లోళ్ల సిద్దార్థరెడ్డి అన్నారు. అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయమని అన్నారు. వారికి అండగా ఉండేందుకు ఈ నెల 10న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డిలో రైతు దీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

నిజాంసాగర్ మండలం హసన్‌పల్లిలోని తన నివాసంలో గురువారం రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో సిద్దార్థరెడ్డి మాట్లాడారు. అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు రైతులు, ప్రజలను చిన్నచూపు చూస్తున్నాయని విమర్శించారు. ప్రజలకు పట్టెడన్నం పెట్టే రైతులు.. పంటలకు గిట్టుబాటు ధర లేక, పెట్టుబడి ఖర్చులు పెరిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం మాటేమో కానీ.. కనీసం వారిని పరామర్శించిన దాఖలాలు లేవని వాపోయూరు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉచిత కరెంట్, రుణమాఫీ పథకాలతో లక్షలాది రైతు కుటుంబాలను ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రుణమాఫీ పథకానికి మొండిచెయ్యి చూపిందన్నారు. బ్యాంకు రుణాలు, విత్తనాలు సరిపడా అందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. చెరువుల పునరుద్ధరణ  పేరుతో మిషన్ కాకతీయ పథకానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం లేదన్నారు. రైతులకు భరోసా కల్పించాక చెరువుల పనరుద్ధరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈనెల 10న చేపట్టే రైతుదీక్షకు భారీ సంఖ్యలో రైతులు, పార్టీ కార్యకర్తలు హాజరై విజయవంతం చేయూలని కోరారు. సమావేశంలో నాయకులు పట్లోళ్ల లక్ష్మికాంత్‌రెడ్డి, రాములు, ప్రభు, శ్రీధర్‌గౌడ్, శాంతికుమార్, రాజ్‌కుమార్, అనీస్, నర్సింహారెడ్డి, లచ్చానాయక్, శ్రీకాంత్, రమేష్ పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement