విరామం లేని ఉద్యమం
Published Sun, Sep 8 2013 2:49 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో సమైక్యంధ్ర ఉద్యమం విరామం లేకుండా ముందుకుసాగుతోంది. శనివా రం కూడా వివిధ రూపాల్లో సమైక్యవాదులు నిరసన తెలిపారు. హైకోర్టులో సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణవాదులు చేసిన దాడులను జిల్లాకు చెందిన న్యాయవాదులు, ప్రజలు ఖం డించారు. సాగర మత్యకారుల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. 13 మండలాల నుంచి మత్స్యకార సంఘాల ప్రతినిధులు తరలివచ్చారు. హైకోర్టులో సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ న్యాయవాదులు చేసిన దాడులను ఖండిస్తూ పట్టణంలోని న్యాయవాదులు ర్యాలీ, దీక్షలు చేపట్టారు. న్యాయవాదులపై దాడికి నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం పట్టణ ముఖద్వారం వద్ద జాతీయ రహదారిని స్తంభింపజేశారు.
రాజాంలో ఎన్‌జీఓ జేఏసీ ఆధ్వర్యంలో కళాసాగర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులంతా వివిధ వే షధారణలో దీక్షా శిబిరంలో కూర్చొని ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ నిర్వీరామంగా సమైక్య గీతాలు ఆలపిస్తూ అలరించారు. ఏరియా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, రాజాం క్లస్టర్ పరిధిలోని పీహెచ్‌సీల వైద్యులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. టీడీపీ ఆధ్వర్యంలో రెండో రోజు దీక్షా శిబిరాన్ని మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి ప్రారంభించారు. వంగరలో ఆటో యూనియన్ బంద్ పాటించారు. పాలకొండ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక రిలే నిరాహారదీక్షా శిబిరంలో పాలకొండ బార్ అసోసియేషన్ పరిధిలోని న్యాయవాదులు నిరాహారదీక్ష చేపట్టారు. వీరికి వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం,
పాలకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సామంతుల దామోదరరావు సంఘీభావం తెలిపారు. పాలకొండ-విశాఖ రహదారిని మంగళాపురం జంక్షన్ వద్ద సమైక్యవాదులు దిగ్భంధించారు. నరసన్నపేట జేఏసీ సమైక్యాంధ్ర దీక్షా శిబిరంలో సర్పంచ్‌లు పాల్గొన్నారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో భిక్షాటన చేసి, చెప్పులు కుట్టి నిరసన తెలియజేశారు. పోలాకిలో మండల పరిషత్ ఉద్యోగులు, న్యాయవాదులు దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. జలుమూరు మండలంలో తహశీల్దార్, మండల స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు దీక్షలో పాల్గొని మానవహారం నిర్వహించారు. సారవకోటలో మండల ప్రత్యేక అధికారి ఇతర ఉద్యోగులతో భారీ ర్యాలీ చేశారు.
టెక్కలిలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఉపాధ్యాయులంతా అంబేద్కర్ కూడలిలో రిలే దీక్షలో పాల్గొన్నారు. సీమాంధ్ర మంత్రుల ముఖాలతో రావణాసురుని వేషధారణతో నిరసన తెలిపారు. ఆమదాలవలస, పొందూరు, బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో నిరసలు ఉద్ధృతమయ్యాయి. ఆమదాలవలసలో పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ఎన్‌జీవోలు హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన సమావేశం విజయవంతం కావాలని వేంకటేశ్వరాలయంలో పూజలు చేసి ర్యాలీ నిర్వహించారు. పలాస, కాశీబుగ్గ పట్టణాల్లో వెశ్యసంఘాలు, సెల్‌ఫోన్ దుకాణ యాజమానులు ర్యాలీలు నిర్వహించారు. వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్ కణితి విశ్వనాథం సంఘీభావం తెలిపారు.
ఎచ్చెర్లలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో విద్యార్థులు వీసీ కార్యాలయం మేడ పైకి ఎక్కి నిరసన తెలియజేశారు. విద్యార్థులు, ప్రొఫెసర్లు జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట మండలాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి.
పాతపట్నంలో ఏపీఎన్‌జీవో సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన సేవ్‌ఆంధ్రప్రదేశ్‌కు మద్దతుగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పెద్దసీధి జంక్షన్ వరకు వేలాది మంది విద్యార్థులు, స్థానికులు, జేఏసీ నాయకులు, బార్ అసోసియేషన్ సభ్యులు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘ నాయకులు మహామానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు.
Advertisement