
పచ్చనోటు చెదిరిపోవునులే!
నోటు లేనిదే పూట గడవదు! మరి మనిషికి జీవితాన్నిస్తున్న ఆ నోటు జీవితకాలమెంత? దాని ప్రింటింగ్ ఖర్చు ఎంత? అనే ప్రశ్నలకు ఆర్టీఐ ద్వారా అర్జీ పెట్టాడో వ్యక్తి! అందుకు ఆర్బీఐ ఇచ్చిన వివరాలు ఆశ్చర్యం గొలుపుతున్నాయి.
మనదేశంలో పచ్చనోటు జీవిత కాలం ఒక సంవత్సరం కంటే తక్కువ. ఇది ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే చాలా తక్కువ! దీనికి, నోటుపై పిచ్చిరాతలు రాయడం, జేబులో పెట్టినప్పుడు చెమటతో తడిసినలిగిపోవడం, పర్సులో నోట్లను అతి చిన్నవిగా మడవడం వంటి కారణాలనేకం. తెలిసో, తెలియకో చేసే ఈ పనులు ఆర్బీఐకి భారంగా పరిణమిస్తున్నాయి. 2013-14లో 13 ట్రిలియన్ల కరెన్సీ ప్రింటయితే... 11.9 ట్రిలియన్ల కరెన్సీ రిటైర్ అయింది. 13 ట్రిలియన్ల కరెన్సీ ముద్రించడానికి ఆర్‌బీఐ ఖర్చు చేసిన మొత్తం రూ.11,300 కోట్లు. రాష్ట్రాలకు రవాణా, పంపిణీ, భద్రత కోసం వెచ్చించే ఖర్చు ఇంకా అదనం.
ప్రపంచవ్యాప్తంగా నగదు లావాదేవీలు పూర్తిగా తగ్గిపోయినా మన దేశంలో ఎక్కువస్థాయిలోనే జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో క్రెడిట్, డెబిట్ కార్డ్స్, ఎలక్ట్రానిక్ పేమెంట్స్ పెరిగినా ప్లాస్టిక్ మనీ వినియోగం పెరగాల్సి ఉంది. క్యాష్‌లెస్ ఎకానమీ దిశగా అడుగులువేస్తున్న స్వీడన్ తలసరి ఆదాయంలో బ్యాంక్ నోట్లు, కాయిన్ల రూపంలో ఉన్నది కేవలం 3 శాతమే. యూఎస్‌ఏ, కెనడా, సింగపూరుల్లో అధిక శాతం ఎలక్ట్రానిక్ బదిలీలే జరుగుతున్నాయి. 4.5 కోట్ల జనాభా కలిగిన కెన్యా సైతం 25 శాతం లావాదేవీలను మొబైల్ ద్వారానే జరుపుతోంది.