పదవీ విరమణ వయసు పెంచే యోచన
సాక్షి, హైదరాబాద్: ఎన్నో రోజుల నుంచి నానుతున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని అధికార వర్గాల సమాచారం. పదవీ విరమణ వయసు పెంపుపై ఉద్యోగ సంఘాలు ఇచ్చిన విజ్ఞాపన పత్రాలను ముఖ్యమంత్రి కార్యాలయం పరిశీలన నిమిత్తం పదో వేతన సవరణ సంఘం చైర్మన్ అగర్వాల్‌కు పంపింది. అయితే ఈ అంశం వేతన సంఘం పరిధిలోకి రాదని, దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని అగర్వాల్ స్పష్టం చేశారు. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయం సూచన మేరకు పదవీ విరమణ వయసును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచేందుకు అనుకూలంగా ఆర్థిక శాఖ నోట్ సిద్ధం చేసిందని అధికార వర్గాలు తెలిపాయి.
ఏప్రిల్‌లోగా రాష్ట్రంలో ప్రధానంగా జంటనగరాల్లోనే 1.80 లక్షల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తారని అధికారులు అంచనా వేశారు. ఇప్పుడు పదవీ విరమణ వయసును పెంచడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చునే అభిప్రాయంలో ముఖ్యమంత్రి ఉన్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులు పదవీ విరమణ పొందితే పలు శాఖల్లో అనుభవజ్ఞులైన అధికారులు, ఉద్యోగులు లేకపోతే పరిపాలనాపరంగా సమస్యలు తలెత్తుతాయనే అభిప్రాయం ఆర్థిక శాఖలో కూడా వ్యక్తమవుతోంది. పెద్ద ఎత్తున ఒకేసారి లక్షల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయడంతో వెంటనే పదవీ విరమణకు చెందిన మొత్తాలను ఆర్థిక శాఖ వారికి చెల్లించాల్సి ఉంటుంది. పదవీ విరమణ వయసు పెంచడం ద్వారా వారికి చెల్లించాల్సిన లబ్ధి కూడా వాయిదా పడుతుందని, ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ రిటైర్మెంట్ వయసును పెంచడానికి సానుకూలంగా ఉందనే అభిప్రాయం అధికార వర్గాల్లో ఉంది. ఆర్థిక శాఖ సిద్ధం చేసిన నోట్ సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్‌కు) వెళ్తుంది. అక్కడి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వెళ్తుందని, ఆ తర్వాత ఆర్థిక మంత్రి, సీఎం ఆమోదానికి వెళ్తుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.