ఈ-టైటిల్‌డీడ్ రైతులకు పోస్టు ద్వారా పంపిణీ
పైలట్ ప్రాజెక్టు కింద అనకాపల్లిలో ఈ-టైటిల్ డీడీ, ఈ-ఆర్‌వో విధానం ప్రారంభం
ఇక పోస్టు ద్వారా నేరుగా ఈ-పాస్‌బుక్, ఈ-టైటిల్‌డీడ్లు
జిల్లా కలెక్టర్ యువరాజ్ వెల్లడి
అనకాపల్లి: భూ యజమానులకు అందించే ఈ-పాస్‌బుక్, ఈ-టైటిల్‌డీడ్లను పోస్టు ద్వారా నేరుగా పంపించే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నట్టు జిల్లా కలెక్టర్ యువరాజ్ తెలిపారు. అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో శనివారం ఉదయం పైలట్ ప్రాజెక్టు కింద అమలవుతున్న ఈ-టైటిల్ డీడ్, ఈ-ఆర్‌వో (మధ్యాహ్న భోజన పథకం)ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ విభాగంలో పారదర్శకత కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ విభాగాల్లో అత్యంత కీలకమైన ెవెన్యూ విభాగంలోనే కంప్యూటరీకరణ ఆలస్యంగా మొదలైందని తెలిపారు. రెవెన్యూ రికార్డుల్లో ఏ చిన్న తప్పు దొర్లినా అది కోర్టు కేసు వరకు వెళుతుందని అందుకే దశలవారీగా రెవెన్యూ వ్యవస్థలో కంప్యూటరీకరణ, ఆన్‌లైన్ వ్యవస్థలను అమలు చేస్తున్నామన్నారు. ఈ-టైటిల్‌డీడ్ విధానం జిల్లాలో విజయవంతమయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారని తెలిపారు.
ఈ-పాస్‌బుక్, ఈ-టైటిల్ డీడ్ విధానం వల్ల నకిలీ పాస్‌బుక్‌లు, మోసాలకు అవకాశముండదని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ-పాస్‌బుక్‌లను చెన్నైలో ముద్రిస్తున్నారని, భవిష్యత్‌లో ఈ-పాస్‌బుక్‌లు, ఈ-టైటిల్‌డీడ్లను మీసేవా కేంద్రాలలోనే ముద్రించే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు ఆయన తెలిపారు. జిల్లాలో 10వేలకు పైగా ఈ-పాస్‌బుక్‌లకు దరఖాస్తులు చేసుకోగా 3 వేల దరఖాస్తులను తిరస్కరించామని చెప్పారు. వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాలను నమోదు చేశామని, బ్యాంకర్లు సైతం వెబ్‌ల్యాండ్‌లో భూ యజమానుల వివరాలను తెలుసుకొని రుణాలను మంజూరు చేసుకోవచ్చని తెలిపారు. భవిష్యత్‌లో సాధారణ ప్రజలు సైతం వెబ్‌ల్యాండ్‌లో తమ భూముల వివరాలను చూసుకునే వెసులుబాటు కల్పించే ప్రతిపాదన ఉందన్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు మేలు జరిగేలా ఈ-రిలీజ్ ఆర్డర్ విధానం వల్ల సమయం ఆదా అవుతుందని, సరుకుల కేటాయింపులో సైతం పారదర్శకత ఉంటుందన్నారు. రేషన్ సరుకుల గోదాము ఈ వ్యవస్థలో అత్యంత కీలకమని తెలిపారు. రేషన్ డిపోలలోఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలను ఉపయోగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సరుకుల విడుదల కోసం డీలర్లు ఇకపై ప్రతినెలా డీడీలు తీసుకొని సేవా రుసుం కోల్పోయే బదులు ఆంధ్రాబ్యాంకు రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ఆ ప్రక్రియ మరింత సులభతరం చేసే అవకాశాలు త్వరలో అమల్లోకి రానున్నాయన్నారు. జాయింట్ కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ఈ టైటిల్‌డీడ్, ఈ-ఆర్‌వో విధానంపై ఎంఈవోలు, హెచ్‌ఎమ్‌లు, డీలర్లు పూర్తి అవగాహన పొంది ఉండాలన్నారు. 15 రోజుల్లోనే ఈ-టైటిల్ డీడ్లను అందించే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. ఈ-పాస్‌బుక్ పొందిన వెంటనే ఈ-టైటిల్ డీడ్లు కూడా అందించేందుకు నిర్ణయించామన్నారు. ఆన్‌లైన్ విధానంలో ఈ-ఆర్‌వో విధానం ద్వారా మధ్యాహ్న భోజన పథకానికి సరుకుల విడుదల సరళతరమవుతుందని అభిప్రాయపడ్డారు. మధ్యాహ్న భోజన పథకానికి మేలి రకం బియ్యం అందించాలని జిల్లా కలెక్టర్ సూచించినట్లు తెలిపారు.
జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ-టైటిల్ విధానంతో పాటు ఆన్‌లైన్ వ్యవస్థపై వీఆర్‌వోలకు డివిజన్ స్థాయిలో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించామన్నారు. ఆర్డీవో పద్మావతి మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థలో సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఈ-టైటిల్ విధానం అనకాపల్లిలో ప్రారంభిస్తున్నట్లుగా వివరించారు. ఈ సందర్భంగా 19 మందికి ఈ-టైటిల్ డీడ్లను అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భాస్కరరెడ్డి, సివిల్‌సప్లయి ఏఎస్‌వో శివప్రసాద్, సీఎస్‌డీటీ శ్రీనివాస్, ఆర్‌ఐలు సుభాకర్, గాయత్రి, వీఆర్‌వోలు, రేషన్ డిపో డీలర్లు, హెచ్‌ఎమ్‌లు పాల్గొన్నారు.
రెవెన్యూ మార్పులు
Published Sat, Feb 21 2015 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM
Advertisement