Yuvraj collector
-
భూ బాగోతంపై కలెక్టర్ సీరియస్
పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం బాధ్యుల గుండెల్లో రైళ్లు నక్కపల్లి: మండలంలోని అమలాపురంలో సుమారు రూ. 12 కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు పరిహారం స్వాహా చేసేందుకు జరిగిన ప్రయత్నాలపై డొంక కదులుతోంది. ఈ వ్యవహరం బయటకు పొక్కి పత్రికల్లో రావడంతో జిల్లా యంత్రాంగం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ బాగోతాన్ని కలెక్టర్ యువరాజ్ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. సుమారు 90 ఎకరాల ప్రభుత్వ భూమికి అడ్డగోలుగా రికార్డులు తారుమారుచేసి ఆన్లైన్ చేయడం, వన్-బీ రికార్డులు తయారీ వెనుక ఏయే అధికారుల ప్రమేయం ఉంది.. ఏ నాయకులు ఒత్తిడి చేశారు.. ఎవరిపేరున రికార్డులు తారుమారుచేశారు.. ఈ తతంగమంతా ఎప్పుడు జరిగిందనే వివరాలు తక్షణమే అందజేయాలని స్థానిక అధికారులను ఆదేశించినట్లు సమాచారం. వివరాల సేకరణలో తహసీల్దార్ ఈ బాగోతంపై నక్కపల్లి తహసీల్దార్ గంగాధర్‌రావు సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. కార్యాలయంలో ఉన్న పాత రికార్డులు అడంగళ్లు పరిశీలించి నివేదిక తయారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. అసైన్మెంట్ కమిటీ ఆమోదం, సబ్‌డివిజన్ రికార్డు లేకుండా 53 ఎకరాల ప్రభుత్వ భూమికి 39 మందికి పట్టాలు ఇచ్చినట్లు రికార్డులు తయారుచేశారు. వన్-బీలో ఈ భూమిని అతుకుబడిగా నమోదు చేశారు. అతుకుబడి అంటే రెవెన్యూ పరిభాషలో ప్రభుత్వ భూమిని పేదలకు డీఫాం పట్టాలు ఇవ్వడమని అర్థం. ఎప్పటి నుంచో సాగుచేసుకుంటేనే ఇలా అతుకుబడిగా అడంగళ్‌లో నమోదుచేసి పట్టాలు జారీ చేస్తారు. కానీ రికార్డుల్లో పేర్కొన్న వారెవరూ సాగులో లేరు. వారిపేరున ఎటువంటి పట్టాలు జారీ కాలేదు. అయినా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకు అక్రమాలకు పాల్పడి రికార్డులు తారుమారు చేసి వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇష్టానుసారం పోర్టల్ లాగిన్ తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు ఈ బాగోతంలో నలుగురైదుగురు సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. భూముల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే క్రమంలో తహసీల్దార్ ఆధీనంలో ఉండే డిజిటల్ కీ ఉపయోగించి వెబ్‌ల్యాండ్ పోర్టల్ లాగినై ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా తహసీల్దార్ సమక్షంలోనే జరగాలి. కానీ తహసీల్దార్ కార్యాలయంలో మాత్రం ఈ డిజిటల్ కీ ఎవరి దగ్గరపడితే వారిదగ్గరే ఉంటూ ఎప్పుడు పడితే అప్పుడు వెబ్‌ల్యాండ్ పోర్టల్ లాగినై మామూళ్లు ఇచ్చిన వారి భూముల వివరాలు ఆన్లైన్ చేసేవారు. కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కూడా డిజిటల్ కీను ఉపయోగించి అక్రమాలకు పాల్పడినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కార్యాలయంలో గోప్యంగా ఉండాల్సిన అడంగళ్లు, ఎఫ్‌ఎంబీలు, ఎస్ఎఫ్ఏలు బయట వ్యక్తుల వద్ద రియల్ ఎస్టేట్ బ్రోకర్ల వద్ద దర్శనమిస్తున్నాయి. కార్యాలయం సమయానికి అందుబాటులో లేని రికార్డులను బ్రోకర్లు, వీఆర్వోల కుటుంబ సభ్యులు క్షణాల్లో తేగలుతున్నారంటే ఈ కార్యాయంలో కీలక రికార్డుల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. గతంలో పనిచేసిన క్షేత్రస్థాయి అధికారుల మంచితనం.. లేదా బలహీనతలను ఆసరగా తీసుకుని కొంతమంది సిబ్బంది ఈ విధమైన అక్రమాలకు పాల్పడేవారని పలువురు ఆరోపిస్తున్నారు. మరి కొన్ని చోట్ల రికార్డుల తారుమారు ఇటువంటి రికార్డుల తారుమారు ఒక్క అమలాపురంలోనే కాకుండా డీఎల్‌పురం, రాజయ్యపేట, వేంపాడులలో కూడా జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు మరో రెండు రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. డీఫాం పట్టాలనేవి సెంటు భూమిలేని నిరుపేదలకు మంజూరు చేస్తారు. కానీ అమలాపురం, వేంపాడు, రాజయ్యపేట, డీఎల్‌ఫురం తదితర గ్రామాల్లో భూస్వాములకు కూడా పట్టాలిచ్చారు. వారి ఆక్రమణల్లో వందలాది ఎకరాలున్నట్లు ఆయా గ్రామాల వారు చెబుతున్నారు. మొత్తం మీద ఈ వ్యవహరంపై జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపి పాత రికార్డులన్నీ పరిశీలిస్తే మండల స్థాయి అధికారులతోపాటు పలువురు రైతులు, భూస్వాముల బాగోతం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత తహసీల్దార్ గంగాధర్‌రావు ఈ బాగోతాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్యాలయ ప్రక్షాళనకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వెబ్‌ల్యాండ్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దళారులకు అవకాశం లేకుండా లబ్ధిదారుల పనులు నేరుగా తానే పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. అమలాపురం బాగోతం వెనుక పూర్తి వివరాలు సేకరించి నివేదికను కలెక్టర్‌కు పంపుతామని తహసీల్దార్ తెలిపారు. -
ఆగని రాయ‘బేరాలు’
నాలుగు తహశీల్దార్ స్థానాల కోసం పైరవీలు పోస్టుకు అరకోటి సమర్పణకు రెడీ? విశాఖపట్నం: రాజకీయ ఒత్తిళ్లతో అర్ధరాత్రి జరిగిన తహశీల్దార్ల బదిలీల వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. గుట్టు చప్పుడు కాకుండా జరిగినప్పటికీ ఈ బదిలీల రేపిన కలకలం ఇప్పట్లో చల్లారేటట్టు కన్పించడం లేదు. మంత్రులు..వారి అనుచరులు ఒత్తిళ్లు చేసి మరీ తమకు అనువుగా ఉన్నవారికి తాము కోరుకున్న చోట పోస్టింగ్‌లు ఇప్పించుకోగలిగారు. కొన్ని స్థానాలకు సంబంధించి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు రాకపోవడంతో కలెక్టర్ యువరాజ్ వెయిటింగ్లో ఉన్నవారితో పాటు మరికొందరికి పోస్టింగ్‌లు ఇచ్చారు.రూరల్ తహశీల్దార్‌గా పనిచేస్తున్న జెడ్పీ చైర్ పర్శన్ లాలం భవాని మరిది లాలం సుధాకర్ నాయుడిని మంత్రి గంటా అనుచరుడు పరుచూరి భాస్కరరావు ఒత్తిడి మేరకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో అచ్యుతాపురం తహశీల్దార్ ఎం.శంకరరావును ఏరికోరి తెచ్చుకున్నారు. అయితే ఈ పోస్ట్‌పై ఎప్పటి నుంచో కన్నేసిన విశాఖ ఆర్డీవో ఏఓ రామారావును చోడవరం బదిలీ చేయడంతో ఆయన ఈ పోస్టు కోసం పైరవీలుసాగిస్తున్నట్టు తెలియవచ్చింది. ఈయనతో పాటు మరికొందరు కూడా ఈ పోస్ట్‌ను దక్కించుకోవడానికి మళ్లీ ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. పరుచూరి వ్యతిరేక వర్గీయులు వీరిని ప్రోత్సహిస్తున్నట్టు చెబుతున్నారు. అలాగే గాజువాక, విశాఖ అర్బన్, అనకాపల్లి తహశీల్దార్ పోస్ట్‌ల కోసం విఫలయత్నం చేసిన పలువురు తహశీల్దార్లు కూడా సూట్‌కేస్‌లు తీసుకువెళ్లి మరీ మంత్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసింది.అలాగే గతంలో కలెక్టరేట్లో పనిచేసిన ఓ కీలకాధికారి మరోసారి నగరంలో కీలకమైన తహశీల్దార్ పోస్ట్ కోసం పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలియవచ్చింది. నగర పరిధిలోని ఈ నాలుగు తహశీల్దార్ స్థానాల కోసం తలా రూ. 50 లక్షల నుంచి కోటి వరకు ముట్ట జెప్పేందుకు వీరు సిద్దపడినట్టు తెలుస్తోంది. దీంతో ఈ నాలుగుపోస్టుల్లో చేర్పులు మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదని రెవెన్యూ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. రెండు మూడ్రోజుల్లో ఈ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
ఇండస్ట్రియల్ టౌన్షిప్ నిర్మిస్తాం
కలెక్టర్ యువరాజ్ అచ్యుతాపురం:ఎస్ఈజెడ్ పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులకు వసతి ఏర్పాటుకు ఇండస్ట్రియల్ టౌన్షిప్ నిర్మాణం చేపడతామని కలెక్టర్ యువరాజ్ తెలిపారు. సోమవారం ఆయన బ్రాండిక్స్ పరిశ్రమను సందర్శించారు. దూరప్రాంతాలనుంచి పరిశ్రమకు రావడం వల్ల ఎదుర్కొం టున్న సమస్యలను యాజమాన్యం, ఉద్యోగులనుంచి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగులను తరలించడంలో పరిశ్రమలకు భారంగా ఉందన్నారు. ఉద్యోగులు వ్యయప్రయాసలు పడాల్సి వస్తుందన్నారు. ట్రాఫిక్ సమస్య, ఇంధన వినియోగం తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా టౌన్షిప్ నిర్మాణం చేపడతామని తెలిపారు. ఉద్యోగులు తమ జీతం నుంచి కొంత భాగాన్ని వాయిదాగా చెల్లించడానికి ముందుకు వస్తే ఇంటినిర్మాణం చేపట్టి అందిస్తామన్నారు. ఇందుకోసం చోడపల్లి సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. సెజ్‌కు సమీపంలో మరికొంత ప్రభుత్వ స్థలాన్ని సేకరించి టౌన్‌ఫిప్‌కు సిద్ధం చేస్తామని వివరించారు. చదరపు అడుగు రూ.వెయ్యి నుంచి రూ.1500 ధరలో నిర్మాణం చేపట్టేలా సంస్థలకు అప్పగిస్తామన్నారు. ఉద్యోగికి తక్కువ ధరకు అపార్టమెంట్ అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొదటి వాయిదా చెల్లించిన వెంటనే ఉద్యోగికి ఇల్లు అప్పగిస్తామని వాయిదాలు పూర్తయిన తరువాత ఇంటి డాక్యుమెంట్‌ను అందజేస్తామని చెప్పారు. మొదటి విడతగా 15 వేల మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం నిర్మించే పైపులైన్‌కు పూడిమడక మత్స్యకారులు సహకరించాలని కోరారు. ఉన్నఫలంగా 4,500 మందికి ఉద్యోగాలు కల్పించడం సాధ్యపడదన్నారు. ప్యాకేజీ తీసుకొని పైపులైన్‌క అంగీకరిస్తే అంచెలంచెలుగా ఉపాధి కల్పిస్తామని తెలిపారు. దీనిపై మత్స్యకారులతో బుధవారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో బ్రాండిక్స్ హెచ్ఆర్ మేనేజర్ రఘుపతి, భాస్కర్ , శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ మార్పులు
ఈ-టైటిల్‌డీడ్ రైతులకు పోస్టు ద్వారా పంపిణీ పైలట్ ప్రాజెక్టు కింద అనకాపల్లిలో ఈ-టైటిల్ డీడీ, ఈ-ఆర్వో విధానం ప్రారంభం ఇక పోస్టు ద్వారా నేరుగా ఈ-పాస్‌బుక్, ఈ-టైటిల్డీడ్లు జిల్లా కలెక్టర్ యువరాజ్ వెల్లడి అనకాపల్లి: భూ యజమానులకు అందించే ఈ-పాస్‌బుక్, ఈ-టైటిల్డీడ్లను పోస్టు ద్వారా నేరుగా పంపించే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నట్టు జిల్లా కలెక్టర్ యువరాజ్ తెలిపారు. అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో శనివారం ఉదయం పైలట్ ప్రాజెక్టు కింద అమలవుతున్న ఈ-టైటిల్ డీడ్, ఈ-ఆర్వో (మధ్యాహ్న భోజన పథకం)ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ విభాగంలో పారదర్శకత కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ విభాగాల్లో అత్యంత కీలకమైన ెవెన్యూ విభాగంలోనే కంప్యూటరీకరణ ఆలస్యంగా మొదలైందని తెలిపారు. రెవెన్యూ రికార్డుల్లో ఏ చిన్న తప్పు దొర్లినా అది కోర్టు కేసు వరకు వెళుతుందని అందుకే దశలవారీగా రెవెన్యూ వ్యవస్థలో కంప్యూటరీకరణ, ఆన్లైన్ వ్యవస్థలను అమలు చేస్తున్నామన్నారు. ఈ-టైటిల్‌డీడ్ విధానం జిల్లాలో విజయవంతమయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారని తెలిపారు. ఈ-పాస్‌బుక్, ఈ-టైటిల్ డీడ్ విధానం వల్ల నకిలీ పాస్‌బుక్‌లు, మోసాలకు అవకాశముండదని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ-పాస్‌బుక్‌లను చెన్నైలో ముద్రిస్తున్నారని, భవిష్యత్‌లో ఈ-పాస్‌బుక్‌లు, ఈ-టైటిల్డీడ్లను మీసేవా కేంద్రాలలోనే ముద్రించే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు ఆయన తెలిపారు. జిల్లాలో 10వేలకు పైగా ఈ-పాస్‌బుక్‌లకు దరఖాస్తులు చేసుకోగా 3 వేల దరఖాస్తులను తిరస్కరించామని చెప్పారు. వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాలను నమోదు చేశామని, బ్యాంకర్లు సైతం వెబ్‌ల్యాండ్‌లో భూ యజమానుల వివరాలను తెలుసుకొని రుణాలను మంజూరు చేసుకోవచ్చని తెలిపారు. భవిష్యత్‌లో సాధారణ ప్రజలు సైతం వెబ్‌ల్యాండ్‌లో తమ భూముల వివరాలను చూసుకునే వెసులుబాటు కల్పించే ప్రతిపాదన ఉందన్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు మేలు జరిగేలా ఈ-రిలీజ్ ఆర్డర్ విధానం వల్ల సమయం ఆదా అవుతుందని, సరుకుల కేటాయింపులో సైతం పారదర్శకత ఉంటుందన్నారు. రేషన్ సరుకుల గోదాము ఈ వ్యవస్థలో అత్యంత కీలకమని తెలిపారు. రేషన్ డిపోలలోఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలను ఉపయోగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సరుకుల విడుదల కోసం డీలర్లు ఇకపై ప్రతినెలా డీడీలు తీసుకొని సేవా రుసుం కోల్పోయే బదులు ఆంధ్రాబ్యాంకు రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఆ ప్రక్రియ మరింత సులభతరం చేసే అవకాశాలు త్వరలో అమల్లోకి రానున్నాయన్నారు. జాయింట్ కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ఈ టైటిల్‌డీడ్, ఈ-ఆర్వో విధానంపై ఎంఈవోలు, హెచ్ఎమ్లు, డీలర్లు పూర్తి అవగాహన పొంది ఉండాలన్నారు. 15 రోజుల్లోనే ఈ-టైటిల్ డీడ్లను అందించే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. ఈ-పాస్‌బుక్ పొందిన వెంటనే ఈ-టైటిల్ డీడ్లు కూడా అందించేందుకు నిర్ణయించామన్నారు. ఆన్లైన్ విధానంలో ఈ-ఆర్వో విధానం ద్వారా మధ్యాహ్న భోజన పథకానికి సరుకుల విడుదల సరళతరమవుతుందని అభిప్రాయపడ్డారు. మధ్యాహ్న భోజన పథకానికి మేలి రకం బియ్యం అందించాలని జిల్లా కలెక్టర్ సూచించినట్లు తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ-టైటిల్ విధానంతో పాటు ఆన్లైన్ వ్యవస్థపై వీఆర్వోలకు డివిజన్ స్థాయిలో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించామన్నారు. ఆర్డీవో పద్మావతి మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థలో సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఈ-టైటిల్ విధానం అనకాపల్లిలో ప్రారంభిస్తున్నట్లుగా వివరించారు. ఈ సందర్భంగా 19 మందికి ఈ-టైటిల్ డీడ్లను అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భాస్కరరెడ్డి, సివిల్‌సప్లయి ఏఎస్వో శివప్రసాద్, సీఎస్‌డీటీ శ్రీనివాస్, ఆర్ఐలు సుభాకర్, గాయత్రి, వీఆర్వోలు, రేషన్ డిపో డీలర్లు, హెచ్ఎమ్లు పాల్గొన్నారు. -
నేవల్ బేస్ నిర్వాసితులతో కమిటీ
సమస్యల పరిష్కారానికి కమిటీ సూచనలు అందరూ బయోమెట్రిక్ కార్డు తీసుకోవాలి నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం కలెక్టర్ యువరాజ్ విశాఖపట్నం : తూర్పు నావికాదళ ప్రత్యామ్నాయ స్థావరం ఏర్పాటు కోసం తొలి విడతగా భూములు సేకరించిన ఎస్.రాయవరం, రాంబిల్లి మండాలాల్లోని నాలుగు గ్రామాల్లో నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. నిర్వాసిత గ్రామాల నుంచి ఇద్దరు లేక ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. శనివారం కలెక్టరేట్లో నిర్వాసిత గ్రామాల రైతులు, యూనియన్ నాయకులు, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు పంచకర్ల రమేశ్‌బాబు, వంగలపూడి అనిత, ఎంపీ అవంతి శ్రీనివాస్, నావికాదళ అధికారులతో సమీక్షించారు. తొలుత నిర్వాసితుల డిమాండ్లు తెలుసుకొని వాటిపై ఎంపీ, ఎమ్మెల్యేలు అభిప్రాయాలు తెలిపారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు మాట్లాడుతూ నిర్వాసితులకిచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల వారిలో అభద్రత భావం నెలకొందన్నారు. వారికి మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని సూచించారు. ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ రెండో విడత తన నియోజకవర్గ పరిధిలో ప్రాజెక్టు పునరావసం కల్పించాల్సి వస్తోందని, ఈసారి ముందుగానే పరిష్కారం చూపాలన్నారు. నేవల్ అధికారులు కేంద్రీయ విద్యాలయంతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పటల్‌ను నిర్మించాలన్నారు. ఎంపీ ముత్తంశెట్టి మాట్లాడుతూ నావికాదళ స్థావరం ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అయితే రైతులకు తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. మత్స్యకార కుటుంబీకులు మాట్లాడుతూ చేపల వేట తాము చేపడితే మహిళలు చేపలు అమ్మి జీవనం సాగించేవారని ఇప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల పూర్తిగా జీవనం కోల్పోయామన్నారు. తమతో పాటు మహిళలకు కూడా ప్యాకేజీ ఇవ్వాలన్నారు. మత్స్యకార సొసైటీ భూములకు నష్టపరిహారం ఇవ్వాలని, వితంతువులు, 18 ఏళ్లు నిండిన వారిని ఓ కుటుంబంగా గుర్తించి, లక్ష రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొప్పుగుండు పాలెం, వాడ పాలెం గ్రామాలకు కూడా ఈ ప్యాకేజీ వర్తింప చేయాలని కోరారు. వీటిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ నిర్వాసితులంతా బయోమెట్రిక్ కార్డుల పొందడం ద్వారా పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. దీనిద్వా రా నష్టపరిహారం పంపిణీ సులభతరమవుతుందన్నారు. వితంతువులకు నష్టపరిహారం వర్తింప చేస్తామని, కుటుంబం లో మేజర్లకు కూడా ప్యాకేజీ వర్తింపచేస్తామని, పట్టా భూమితో సమానంగా అసైన్డ్ భూమికి నష్టపరిహారం ఇస్తామని తెలిపారు. ఈ అంశం పై రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో త్వరలోనే ఓ నిర్ణయం వస్తుందన్నారు. మత్స్యకార కుటుంబాల్లో ఓ మహిళను చేపలు విక్రయదారునిగా గుర్తించి నష్టపరిహారం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జేసీ ప్రవీణ్‌కుమార్, భూసేకరణ విభాగం ప్రత్యేక ఉప కలెక్టర్ సత్యకుమార్ పాల్గొన్నారు.