సమస్యల పరిష్కారానికి కమిటీ సూచనలు
అందరూ బయోమెట్రిక్ కార్డు తీసుకోవాలి
నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం
కలెక్టర్ యువరాజ్
విశాఖపట్నం : తూర్పు నావికాదళ ప్రత్యామ్నాయ స్థావరం ఏర్పాటు కోసం తొలి విడతగా భూములు సేకరించిన ఎస్.రాయవరం, రాంబిల్లి మండాలాల్లోని నాలుగు గ్రామాల్లో నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. నిర్వాసిత గ్రామాల నుంచి ఇద్దరు లేక ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వాసిత గ్రామాల రైతులు, యూనియన్ నాయకులు, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు పంచకర్ల రమేశ్‌బాబు, వంగలపూడి అనిత, ఎంపీ అవంతి శ్రీనివాస్, నావికాదళ అధికారులతో సమీక్షించారు. తొలుత నిర్వాసితుల డిమాండ్లు తెలుసుకొని వాటిపై ఎంపీ, ఎమ్మెల్యేలు అభిప్రాయాలు తెలిపారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు మాట్లాడుతూ నిర్వాసితులకిచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల వారిలో అభద్రత భావం నెలకొందన్నారు. వారికి మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని సూచించారు. ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ రెండో విడత తన నియోజకవర్గ పరిధిలో ప్రాజెక్టు పునరావసం కల్పించాల్సి వస్తోందని, ఈసారి ముందుగానే పరిష్కారం చూపాలన్నారు. నేవల్ అధికారులు కేంద్రీయ విద్యాలయంతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పటల్‌ను నిర్మించాలన్నారు. ఎంపీ ముత్తంశెట్టి మాట్లాడుతూ నావికాదళ స్థావరం ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అయితే రైతులకు తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. మత్స్యకార కుటుంబీకులు మాట్లాడుతూ చేపల వేట తాము చేపడితే మహిళలు చేపలు అమ్మి జీవనం సాగించేవారని ఇప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల పూర్తిగా జీవనం కోల్పోయామన్నారు.
తమతో పాటు మహిళలకు కూడా ప్యాకేజీ ఇవ్వాలన్నారు. మత్స్యకార సొసైటీ భూములకు నష్టపరిహారం ఇవ్వాలని, వితంతువులు, 18 ఏళ్లు నిండిన వారిని ఓ కుటుంబంగా గుర్తించి, లక్ష రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొప్పుగుండు పాలెం, వాడ పాలెం గ్రామాలకు కూడా ఈ ప్యాకేజీ వర్తింప చేయాలని కోరారు. వీటిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ నిర్వాసితులంతా బయోమెట్రిక్ కార్డుల పొందడం ద్వారా పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. దీనిద్వా రా నష్టపరిహారం పంపిణీ సులభతరమవుతుందన్నారు. వితంతువులకు నష్టపరిహారం వర్తింప చేస్తామని, కుటుంబం లో మేజర్లకు కూడా ప్యాకేజీ వర్తింపచేస్తామని, పట్టా భూమితో సమానంగా అసైన్డ్ భూమికి నష్టపరిహారం ఇస్తామని తెలిపారు. ఈ అంశం పై రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో త్వరలోనే ఓ నిర్ణయం వస్తుందన్నారు. మత్స్యకార కుటుంబాల్లో ఓ మహిళను చేపలు విక్రయదారునిగా గుర్తించి నష్టపరిహారం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జేసీ ప్రవీణ్‌కుమార్, భూసేకరణ విభాగం ప్రత్యేక ఉప కలెక్టర్ సత్యకుమార్ పాల్గొన్నారు.
నేవల్ బేస్ నిర్వాసితులతో కమిటీ
Published Sun, Dec 14 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM
Advertisement