పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం
బాధ్యుల గుండెల్లో రైళ్లు
నక్కపల్లి: మండలంలోని అమలాపురంలో సుమారు రూ. 12 కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు పరిహారం స్వాహా చేసేందుకు జరిగిన ప్రయత్నాలపై డొంక కదులుతోంది. ఈ వ్యవహరం బయటకు పొక్కి పత్రికల్లో రావడంతో జిల్లా యంత్రాంగం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ బాగోతాన్ని కలెక్టర్ యువరాజ్ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. సుమారు 90 ఎకరాల ప్రభుత్వ భూమికి అడ్డగోలుగా రికార్డులు తారుమారుచేసి ఆన్‌లైన్ చేయడం, వన్-బీ రికార్డులు తయారీ వెనుక ఏయే అధికారుల ప్రమేయం ఉంది.. ఏ నాయకులు ఒత్తిడి చేశారు.. ఎవరిపేరున రికార్డులు తారుమారుచేశారు.. ఈ తతంగమంతా ఎప్పుడు జరిగిందనే వివరాలు తక్షణమే అందజేయాలని స్థానిక అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
వివరాల సేకరణలో తహసీల్దార్
ఈ బాగోతంపై నక్కపల్లి తహసీల్దార్ గంగాధర్‌రావు సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. కార్యాలయంలో ఉన్న పాత రికార్డులు అడంగళ్లు పరిశీలించి నివేదిక తయారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. అసైన్‌మెంట్ కమిటీ ఆమోదం, సబ్‌డివిజన్ రికార్డు లేకుండా 53 ఎకరాల ప్రభుత్వ భూమికి 39 మందికి పట్టాలు ఇచ్చినట్లు రికార్డులు తయారుచేశారు. వన్-బీలో ఈ భూమిని అతుకుబడిగా నమోదు చేశారు. అతుకుబడి అంటే రెవెన్యూ పరిభాషలో ప్రభుత్వ భూమిని పేదలకు డీఫాం పట్టాలు ఇవ్వడమని అర్థం. ఎప్పటి నుంచో సాగుచేసుకుంటేనే ఇలా అతుకుబడిగా అడంగళ్లో నమోదుచేసి పట్టాలు జారీ చేస్తారు. కానీ రికార్డుల్లో పేర్కొన్న వారెవరూ సాగులో లేరు. వారిపేరున ఎటువంటి పట్టాలు జారీ కాలేదు. అయినా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకు అక్రమాలకు పాల్పడి రికార్డులు తారుమారు చేసి వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇష్టానుసారం పోర్టల్ లాగిన్
తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు ఈ బాగోతంలో నలుగురైదుగురు సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. భూముల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసే క్రమంలో తహసీల్దార్ ఆధీనంలో ఉండే డిజిటల్ కీ ఉపయోగించి వెబ్‌ల్యాండ్ పోర్టల్ లాగినై ఆన్‌లైన్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా తహసీల్దార్ సమక్షంలోనే జరగాలి. కానీ తహసీల్దార్ కార్యాలయంలో మాత్రం ఈ డిజిటల్ కీ ఎవరి దగ్గరపడితే వారిదగ్గరే ఉంటూ ఎప్పుడు పడితే అప్పుడు వెబ్‌ల్యాండ్ పోర్టల్ లాగినై మామూళ్లు ఇచ్చిన వారి భూముల వివరాలు ఆన్‌లైన్ చేసేవారు. కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కూడా డిజిటల్ కీను ఉపయోగించి అక్రమాలకు పాల్పడినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కార్యాలయంలో గోప్యంగా ఉండాల్సిన అడంగళ్లు, ఎఫ్‌ఎంబీలు, ఎస్‌ఎఫ్‌ఏలు బయట వ్యక్తుల వద్ద రియల్ ఎస్టేట్ బ్రోకర్ల వద్ద దర్శనమిస్తున్నాయి. కార్యాలయం సమయానికి అందుబాటులో లేని రికార్డులను బ్రోకర్లు, వీఆర్వోల కుటుంబ సభ్యులు క్షణాల్లో తేగలుతున్నారంటే ఈ కార్యాయంలో కీలక రికార్డుల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. గతంలో పనిచేసిన క్షేత్రస్థాయి అధికారుల మంచితనం.. లేదా బలహీనతలను ఆసరగా తీసుకుని కొంతమంది సిబ్బంది ఈ విధమైన అక్రమాలకు పాల్పడేవారని పలువురు ఆరోపిస్తున్నారు.
మరి కొన్ని చోట్ల రికార్డుల తారుమారు
ఇటువంటి రికార్డుల తారుమారు ఒక్క అమలాపురంలోనే కాకుండా డీఎల్‌పురం, రాజయ్యపేట, వేంపాడులలో కూడా జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు మరో రెండు రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. డీఫాం పట్టాలనేవి సెంటు భూమిలేని నిరుపేదలకు మంజూరు చేస్తారు. కానీ అమలాపురం, వేంపాడు, రాజయ్యపేట, డీఎల్‌ఫురం తదితర గ్రామాల్లో భూస్వాములకు కూడా పట్టాలిచ్చారు.
వారి ఆక్రమణల్లో వందలాది ఎకరాలున్నట్లు ఆయా గ్రామాల వారు చెబుతున్నారు. మొత్తం మీద ఈ వ్యవహరంపై జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపి పాత రికార్డులన్నీ పరిశీలిస్తే మండల స్థాయి అధికారులతోపాటు పలువురు రైతులు, భూస్వాముల బాగోతం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత తహసీల్దార్ గంగాధర్‌రావు ఈ బాగోతాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్యాలయ ప్రక్షాళనకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వెబ్‌ల్యాండ్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దళారులకు అవకాశం లేకుండా లబ్ధిదారుల పనులు నేరుగా తానే పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. అమలాపురం బాగోతం వెనుక పూర్తి వివరాలు సేకరించి నివేదికను కలెక్టర్‌కు పంపుతామని తహసీల్దార్ తెలిపారు.
భూ బాగోతంపై కలెక్టర్ సీరియస్
Published Wed, Jul 13 2016 2:46 AM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM
Advertisement