నాలుగు తహశీల్దార్ స్థానాల కోసం పైరవీలు
పోస్టుకు అరకోటి సమర్పణకు రెడీ?
విశాఖపట్నం: రాజకీయ ఒత్తిళ్లతో అర్ధరాత్రి జరిగిన తహశీల్దార్ల బదిలీల వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. గుట్టు చప్పుడు కాకుండా జరిగినప్పటికీ ఈ బదిలీల రేపిన కలకలం ఇప్పట్లో చల్లారేటట్టు కన్పించడం లేదు. మంత్రులు..వారి అనుచరులు ఒత్తిళ్లు చేసి మరీ తమకు అనువుగా ఉన్నవారికి తాము కోరుకున్న చోట పోస్టింగ్‌లు ఇప్పించుకోగలిగారు. కొన్ని స్థానాలకు సంబంధించి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు రాకపోవడంతో కలెక్టర్ యువరాజ్ వెయిటింగ్‌లో ఉన్నవారితో పాటు మరికొందరికి పోస్టింగ్‌లు ఇచ్చారు.రూరల్ తహశీల్దార్‌గా పనిచేస్తున్న జెడ్పీ చైర్ పర్శన్ లాలం భవాని మరిది లాలం సుధాకర్ నాయుడిని మంత్రి గంటా అనుచరుడు పరుచూరి భాస్కరరావు ఒత్తిడి మేరకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో అచ్యుతాపురం తహశీల్దార్ ఎం.శంకరరావును ఏరికోరి తెచ్చుకున్నారు. అయితే ఈ పోస్ట్‌పై ఎప్పటి నుంచో కన్నేసిన విశాఖ ఆర్డీవో ఏఓ రామారావును చోడవరం బదిలీ చేయడంతో ఆయన ఈ పోస్టు కోసం పైరవీలుసాగిస్తున్నట్టు తెలియవచ్చింది.
ఈయనతో పాటు మరికొందరు కూడా ఈ పోస్ట్‌ను దక్కించుకోవడానికి మళ్లీ ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. పరుచూరి వ్యతిరేక వర్గీయులు వీరిని ప్రోత్సహిస్తున్నట్టు చెబుతున్నారు. అలాగే గాజువాక, విశాఖ అర్బన్, అనకాపల్లి తహశీల్దార్ పోస్ట్‌ల కోసం విఫలయత్నం చేసిన పలువురు తహశీల్దార్లు కూడా సూట్‌కేస్‌లు తీసుకువెళ్లి మరీ మంత్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసింది.అలాగే గతంలో కలెక్టరేట్‌లో పనిచేసిన ఓ కీలకాధికారి మరోసారి నగరంలో కీలకమైన తహశీల్దార్ పోస్ట్ కోసం పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలియవచ్చింది. నగర పరిధిలోని ఈ నాలుగు తహశీల్దార్ స్థానాల కోసం తలా రూ. 50 లక్షల నుంచి కోటి వరకు ముట్ట జెప్పేందుకు వీరు సిద్దపడినట్టు తెలుస్తోంది. దీంతో ఈ నాలుగుపోస్టుల్లో చేర్పులు మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదని రెవెన్యూ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. రెండు మూడ్రోజుల్లో ఈ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.