The pilot project
-
పైలెట్ పంచాయతీగా కమ్మూరు
అభివృద్ధి ప్రణాళికకు రూపకల్పన కూడేరు : నీటి సంరక్షణ పథకం కింద పంచాయతీల అభివృద్ధిలో భాగంగా మండల పరిధిలోని కమ్మూరు పంచాయతీని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు డ్వామా పీడీ నాగభూషణం తెలిపారు. ఉపాధి హామీ, ఆర్డబ్ల్యూఎస్, అగ్రికల్చర్, గ్రౌండ్ వాటర్, ఫారెస్టు, పశువైద్య శాఖ జిల్లా అధికారులు గురువారం కమ్మూరులో నీటి సంరక్షణకు సంబంధించి యాక్షన్ ప్లాన్‌కు రూపకల్పన చేశారు. రీసెర్చ్ మ్యాప్ నమూనాతో ఐదేళ్లలో పంచాయతీ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై చర్చించారు. డ్వామా పీడీ మాట్లాడుతూ ఈ రూపకల్పన విజయవంతమైన తర్వాత జిల్లాలో మిగిలిన పంచాయతీలలో దీన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. నెలరోజుల పాటు భూగర్భ జలాలను ఎలా సంరక్షించుకోవాలి, పంచాయతీ అభివృద్ధికి ఏం చేయాలి అనే వాటిపై శిక్షణ ఇచ్చి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా క్లష్టర్ ఏపీడీ అయేషాతోపాటు 12 మంది ఏపీడీలు, డబ్ల్యూఎంపీ పీఓ రామయ్య శ్రేష్ఠి, తహశీల్దార్ వసంతలత, ఎంపీడీఓ రాజమన్నార్, ఈఓఆర్డీ గంగావతి, ఏపీఓ నాగమణి, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. -
‘బేటి బచావో’.. పైలట్ ప్రాజెక్టుకు హైదరాబాద్ ఎంపిక
సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో బాలుర కంటె బాలికల శాతం తక్కువగా ఉన్న హైదరాబాద్ జిల్లా.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ‘బేటీ బచావో.. బేటీ పడావో’ పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసింది. దేశంలో 100 జిల్లాలు ఈ పథకం కింద ఎంపిక కాగా, తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, కడప జిల్లాలను ఎంపిక చేశారు. హైదరాబాద్ జిల్లాలో 1000 మంది బాలురకు, 914 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. అక్షరాస్యతలో మాత్రం ఎక్కువగానే ఉంది. ఈ నేపధ్యంలో బాలికలను సంరక్షించుకోవడంతో పాటు, బాలికల అవశ్యకత, ప్రాముఖ్యతపై అవగాహన, చైతన్యాన్ని పెంచేందుకు ఈ పథకం కింద జిల్లాను ఎంపిక చేశారు. ఇందుకోసం వివిధ ప్రభుత్వ శాఖలు కృషి చేసే విధంగా అధికార యంత్రాంగం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ, విద్యా, మహిళా శిశు సంక్షేమ సమగ్ర అభివృద్ధి శాఖ, రెవెన్యూ, వయోజన విద్యాశాఖ భాగస్వామ్యం అవుతాయి. సమన్వయంతో పనిచేసేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమం ఇలా.. ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీ జిల్లా ఐసీడీఎస్‌లోని ఐదు ప్రాజెక్టుల పరిధిలో నాలుగు ఏరియాల చొప్పున 20 ప్రాంతాలను ఎంపిక చేశారు. ఇందులో ఏరియాల వారిగా బాలురు, బాలికల సంఖ్యను సర్వే ద్వారా గుర్తించి ఆయా ప్రాంతాల్లో బోర్డులపై డీస్స్లే చేస్తారు. అదేవిధంగా స్వచ్ఛందంగా పనిచేసే 40 మంది వలంటీర్లను ఎంపిక చేశారు. వీరి ద్వారా ప్రతి నెల రెండో శుక్రవారం జిల్లాలోని 940 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న బాలికలు, గర్భిణిలు, బాలింతల పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేదికలపై బాలికల ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలు చేపడతారు. ఈ కార్యక్రమాన్ని ఏడాదికి పైగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం ప్రభుత్వం రూ.88 లక్షల నిధులు విడుదల చేయనున్నట్టు ఐసీడీఎస్ జిల్లా పీడీ ఆశ్రీత ‘సాక్షి’కి తెలిపారు. -
రెవెన్యూ మార్పులు
ఈ-టైటిల్‌డీడ్ రైతులకు పోస్టు ద్వారా పంపిణీ పైలట్ ప్రాజెక్టు కింద అనకాపల్లిలో ఈ-టైటిల్ డీడీ, ఈ-ఆర్వో విధానం ప్రారంభం ఇక పోస్టు ద్వారా నేరుగా ఈ-పాస్‌బుక్, ఈ-టైటిల్డీడ్లు జిల్లా కలెక్టర్ యువరాజ్ వెల్లడి అనకాపల్లి: భూ యజమానులకు అందించే ఈ-పాస్‌బుక్, ఈ-టైటిల్డీడ్లను పోస్టు ద్వారా నేరుగా పంపించే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నట్టు జిల్లా కలెక్టర్ యువరాజ్ తెలిపారు. అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో శనివారం ఉదయం పైలట్ ప్రాజెక్టు కింద అమలవుతున్న ఈ-టైటిల్ డీడ్, ఈ-ఆర్వో (మధ్యాహ్న భోజన పథకం)ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ విభాగంలో పారదర్శకత కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ విభాగాల్లో అత్యంత కీలకమైన ెవెన్యూ విభాగంలోనే కంప్యూటరీకరణ ఆలస్యంగా మొదలైందని తెలిపారు. రెవెన్యూ రికార్డుల్లో ఏ చిన్న తప్పు దొర్లినా అది కోర్టు కేసు వరకు వెళుతుందని అందుకే దశలవారీగా రెవెన్యూ వ్యవస్థలో కంప్యూటరీకరణ, ఆన్లైన్ వ్యవస్థలను అమలు చేస్తున్నామన్నారు. ఈ-టైటిల్‌డీడ్ విధానం జిల్లాలో విజయవంతమయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారని తెలిపారు. ఈ-పాస్‌బుక్, ఈ-టైటిల్ డీడ్ విధానం వల్ల నకిలీ పాస్‌బుక్‌లు, మోసాలకు అవకాశముండదని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ-పాస్‌బుక్‌లను చెన్నైలో ముద్రిస్తున్నారని, భవిష్యత్‌లో ఈ-పాస్‌బుక్‌లు, ఈ-టైటిల్డీడ్లను మీసేవా కేంద్రాలలోనే ముద్రించే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు ఆయన తెలిపారు. జిల్లాలో 10వేలకు పైగా ఈ-పాస్‌బుక్‌లకు దరఖాస్తులు చేసుకోగా 3 వేల దరఖాస్తులను తిరస్కరించామని చెప్పారు. వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాలను నమోదు చేశామని, బ్యాంకర్లు సైతం వెబ్‌ల్యాండ్‌లో భూ యజమానుల వివరాలను తెలుసుకొని రుణాలను మంజూరు చేసుకోవచ్చని తెలిపారు. భవిష్యత్‌లో సాధారణ ప్రజలు సైతం వెబ్‌ల్యాండ్‌లో తమ భూముల వివరాలను చూసుకునే వెసులుబాటు కల్పించే ప్రతిపాదన ఉందన్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు మేలు జరిగేలా ఈ-రిలీజ్ ఆర్డర్ విధానం వల్ల సమయం ఆదా అవుతుందని, సరుకుల కేటాయింపులో సైతం పారదర్శకత ఉంటుందన్నారు. రేషన్ సరుకుల గోదాము ఈ వ్యవస్థలో అత్యంత కీలకమని తెలిపారు. రేషన్ డిపోలలోఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలను ఉపయోగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సరుకుల విడుదల కోసం డీలర్లు ఇకపై ప్రతినెలా డీడీలు తీసుకొని సేవా రుసుం కోల్పోయే బదులు ఆంధ్రాబ్యాంకు రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఆ ప్రక్రియ మరింత సులభతరం చేసే అవకాశాలు త్వరలో అమల్లోకి రానున్నాయన్నారు. జాయింట్ కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ఈ టైటిల్‌డీడ్, ఈ-ఆర్వో విధానంపై ఎంఈవోలు, హెచ్ఎమ్లు, డీలర్లు పూర్తి అవగాహన పొంది ఉండాలన్నారు. 15 రోజుల్లోనే ఈ-టైటిల్ డీడ్లను అందించే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. ఈ-పాస్‌బుక్ పొందిన వెంటనే ఈ-టైటిల్ డీడ్లు కూడా అందించేందుకు నిర్ణయించామన్నారు. ఆన్లైన్ విధానంలో ఈ-ఆర్వో విధానం ద్వారా మధ్యాహ్న భోజన పథకానికి సరుకుల విడుదల సరళతరమవుతుందని అభిప్రాయపడ్డారు. మధ్యాహ్న భోజన పథకానికి మేలి రకం బియ్యం అందించాలని జిల్లా కలెక్టర్ సూచించినట్లు తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ-టైటిల్ విధానంతో పాటు ఆన్లైన్ వ్యవస్థపై వీఆర్వోలకు డివిజన్ స్థాయిలో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించామన్నారు. ఆర్డీవో పద్మావతి మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థలో సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఈ-టైటిల్ విధానం అనకాపల్లిలో ప్రారంభిస్తున్నట్లుగా వివరించారు. ఈ సందర్భంగా 19 మందికి ఈ-టైటిల్ డీడ్లను అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భాస్కరరెడ్డి, సివిల్‌సప్లయి ఏఎస్వో శివప్రసాద్, సీఎస్‌డీటీ శ్రీనివాస్, ఆర్ఐలు సుభాకర్, గాయత్రి, వీఆర్వోలు, రేషన్ డిపో డీలర్లు, హెచ్ఎమ్లు పాల్గొన్నారు. -
పల్లెల్లో పరిశుభ్రతకు ‘వాష్’
నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత అంశాలకు ప్రాధాన్యం పైలట్ ప్రాజెక్టుగా ప్రతీ జిల్లా నుంచి రెండేసి గ్రామాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మానవ అభివృద్ధి సూచిక మెరుగుదల నిమిత్తం గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ మేరకు ఎంపిక చేసిన 150 మండలాల్లో ‘వాష్’(వాటర్, శానిటేషన్, హైజిన్) పథకాన్ని అమలు చేయాలని సంకల్పించింది. తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత పట్ల విస్తృతమైన అవగాహన కల్పించడం, ఆయా ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టేలా ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. పైలట్ ప్రాజెక్టు కింద ప్రతీ జిల్లా నుంచి రెండు గ్రామాల్లో ‘వాష్’ను అమలు చేయనున్నారు. ఫలితాలను సమీక్షించాక దీన్ని విస్తరించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అధికారులు నిర్ణయించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ పల్లె ప్రగతి’ పథకంలో భాగంగానే ‘వాష్’ ఈ నెల 13 నుంచి ఎంపిక చేసిన గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు కానుంది. ప్రాజెక్టు అమలు ఇలా.. ఎంపిక చేసిన గ్రామంలో ‘వాష్’ బాధ్యతలను గ్రామ సమాఖ్యలు చేపడతాయి. గ్రామాల్లో మార్పు కమిటీలను ఏర్పాటు చేసి, వాటిని బలోపేతం చేయనున్నారు. ప్రధానంగా ఆరుబయట మల విసర్జనను రూపుమాపేందుకు ప్రజలను చైతన్య పరుస్తారు. ఎంపిక చేసిన వాలంటీర్లు నీరు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం.. అంశాలకు సంబంధించి గ్రామంలోని కుటుంబాల వారీగా ప్రస్తుత పరిస్థితిపై బేస్‌లైన్ సర్వే నిర్వహిస్తారు. వాలంటీర్లకు అవసరమైన సహకారాన్ని ఇందిరా క్రాంతి పథం సిబ్బంది అందజేస్తారు. ప్రతీ పల్లెలోను గ్రామసభ నిర్వహించి బేస్‌లైన్ సర్వేలో వెల్లడైన వివరాలను ప్రజలతో ముఖాముఖి చర్చిస్తారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ నిర్ణీత సమయంలోగా ప్రతీ కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకునేలా తీర్మానం చేస్తారు. ‘వాష్ ’ అమలు చేసే నిమిత్తం మూడు (ప్రొక్యూర్మెంట్, కనస్ట్రక్షన్, విజిలెన్స్) ఉప కమిటీలను నియమిస్తారు. ఈ కమిటీల్లో గ్రామ సమాఖ్య సభ్యులు, సర్పంచ్, వార్డు సభ్యులు ఉంటారు. మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రణాళికకు ముందు మేస్త్రీలు, మెటీరియల్ పంపిణీదారులతో ‘వాష్’ సంప్రదింపులు చేయాలి. ప్రతీ మరుగుదొడ్డి నిర్మాణానికి ముందస్తుగా రూ.1,200లను గ్రామ సమాఖ్య ద్వారా‘సెర్ప్’ అందజేస్తుంది. ఇతరుల నుంచి కూడా విరాళాలను సేకరించవచ్చు. ఈ నిర్మాణాన్ని పర్యవేక్షించడంతో పాటు, దానిని సక్రమంగా వినియోగిస్తున్నారా, ఆరుబయట మల విసర్జనను మానేశారా.. లేదా వంటి అంశాలను నిర్ధారించాల్సిన బాధ్యత విజిలెన్స్ కమిటీలదే. ‘వాష్’ ప్రణాళిక, అమల్లో గ్రామ పంచాయతీ సమగ్రమైన భాగస్వామ్యం వహించాలి. గ్రామ సభల నిర్వహణ, వాష్ ప్రణాళిక అభివృద్ధికి సహకరించాలి. వాష్ కమిటీలకు సర్పంచులే నేతృత్వం వహిస్తారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ)ల ఆధ్వర్యంలో పనిచేసే గ్రామ సమాఖ్యలకు రూ.50 లక్షలు చక్రనిధిని గ్రామీణ నీటి పారుదల, పారిశుద్ధ్య(ఆర్డబ్ల్యూఎస్ఎస్) విభాగం అందజేస్తుంది. వాటిని గ్రామ సమాఖ్యలు మరుగుదొడ్ల నిర్మాణానికి అడ్వాన్స్‌గా వినియోగించుకోవచ్చు. -
త్రినేత్రం
సాంకేతికతతో నేరాల నియంత్రణ ప్రతి దృశ్యం... సీసీకెమెరాల్లో నిక్షిప్తం త్వరలో కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ మహంకాళిలో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు ముఖ్యమంత్రితో ప్రారంభానికి యోచన మూడు నెలల్లో నగరమంతటా అమలు అన్ని ఠాణాల్లో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్స్ మహంకాళి మార్కెట్లో ఓ మహిళ న డచి వెళుతోంది. మోటార్ సైకిల్‌పై వచ్చిన అగంతకుడు కన్నుమూసి తెరిచేలోగా ఆమె మెడలోని బంగారు నెక్లెస్‌ను తెంచుకొని పరారయ్యాడు. కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అరగంట తరువాత ఆమె సెల్‌ఫోన్‌కు పోలీసు స్టేషన్ నుంచి ఫోన్... నగలు దొరికాయనేది సారాంశం. సాధారణంగా ఇలాంటి కేసులు ఎప్పుడో గానీ తేలవు. కానీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం దొంగను ఇట్టే పట్టిచ్చింది. ఇటీవల ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా అరగంటలోనే పోలీసులు దొంగను పట్టుకోగలిగారు. త్వరలో నగరమంతటా ఈ తరహా కెమెరాలు అందుబాటులోకి రాబోతున్నాయి. మన ప్రతి కదలికనూ కనిపెట్టబోతున్నాయి. నేరాలకు చెక్ పెట్టబోతున్నాయి. అంతేకాదు.. కిలోమీటర్ దూరంలోని సూక్ష్మ దృశ్యాలను సైతం స్పష్టంగా చూపించగలిగే ప్రత్యేకత ఈ కెమెరాల సొంతం. ఒక కొత్త వ్యక్తి నగరంలోని ఏదైనా పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చి... వె ళ్తే .. కనీసం ఐదు సీసీటీవీలలో ఆ దృశ్యాలు కనబడేలా ఉంటుంది జంట కమిషనరేట్లలోని భవిష్యత్తు చిత్రం. నగరంలోని ప్రతి అంగుళం కవరయ్యేలా మూడు నెలల్లో కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు పోలీసులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. దీనిని పైలట్ ప్రాజెక్ట్‌గా ముందుగా మహంకాళి పోలీసు స్టేషన్ పరిధిలో అమలు చేశారు. 15 రోజుల క్రితం ఐదు కిలోమీటర్ల పరిధిలో కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ కింద 40 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ దృశ్యాలను ఎప్పటికప్పుడు చూసేందుకు ఠాణాలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అందులోని పెద్ద ఎల్సీడీ టీవీలలో ఠాణా పరిధిలోని ప్రతి అంగుళాన్నీ పోలీసు సిబ్బంది వీక్షించే వీలు కల్పించారు. ఇది సత్ఫలితాలిచ్చినట్టు పోలీసు అధికారులు తెలిపారు. దీంతో మహంకాళిలో త్వరలో అధికారికంగా సీఎం కేసీఆర్‌తో కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది ప్రారంభించిన మూడు నెలల్లో జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలోని 160 ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ ఠాణాలలో దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 50 మీటర్ల దూరంలో... మహంకాళి పీఎస్ పరిధిలోని ప్రతి 50మీటర్ల దూరం లో ప్రత్యేకంగా తయారు చేసిన స్తంభాలకు మొత్తం 40సీసీ కెమెరాలను అమర్చారు. ఈ స్తంభాలకు జంక్షన్ బాక్స్(కస్టర్)లు ఏర్పాటు చేశారు. ఒక్కో బాక్స్ లో 16 సీసీ కెమెరాలు కవర్ అవుతాయి. వీటి నిర్వహణ ఖర్చు ఐదేళ్లకు రూ.16 లక్షల వరకు ఉంటుంది. తక్కువ ఖర్చు... ఎక్కువ ప్రయోజనం కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసే కెమెరాలు, నిర్వహణ ఖర్చు ప్రజలే భరించాల్సి ఉంటుంది. ప్రజా భద్రతా చట్టం కింద ప్రతి వ్యాపారి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఎవరికి వారు ఏర్పాటు చేసుకోవడంతో కెమెరాల ఖర్చు, నిర్వహణ భారమవుతుంది. కొత్త ప్రాజెక్ట్‌తో వ్యాపారులకు అతి తక్కువ ఖర్చుతో పాటు నిర్వహణ భారం తగ్గుతుందని పోలీసులు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక రూట్లో 50 మీటర్ల దూరంలోపు ఎడమ, కుడి వైపు కలిసి 40 షాపులుంటే... చట్టప్రకారం వారంతా 40 కెమెరాలు పెట్టాల్సిందే. కమ్యూనిటీ ప్రాజెక్ట్ కింద కేవలం అటువైపు వచ్చి, పోయే మార్గంలోనే కెమెరాలు అమర్చుకోవడంతో ఐదారు సీసీ కెమెరాలు సరిపోతాయి. వీటి ఖరీదులో వ్యాపారి కొద్ది మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. నాణ్యమైనవి... వ్యాపారులు తక్కువ నాణ్యత గల సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం గ్రహించిన కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి నాణ్యత గల కెమెరాల కోసం టెండర్లు ఆహ్వానించారు. 18 కంపెనీలు టెండర్లు దాఖలు చేయగా... అందులో 15 సంస్థలు నాణ్యమైన కెమెరాలు సరఫరా చేయగలవని తేలింది. ప్రభుత్వం తరఫున నిపుణులు, పోలీసు అధికారులు వాటి పనితీరును పరిశీలించి... నిర్ధారించిన వాటిని మాత్రమే కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఠాణాల్లో కంట్రోల్ రూమ్‌లు జంట పోలీసు కమిషనరేట్లలోని అన్ని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్లలో ప్రత్యేకంగా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తారు. వీటిలో అమర్చిన పెద్ద ఎల్సీడీలలో సీసీ కెమెరాల దృశ్యాలను చూసేందుకు ముగ్గురేసి పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారు. ఇలా 24 గంటలూ సీసీ కెమెరాలు పని చేస్తుంటాయి.ఇక్కడ అమర్చిన సర్వర్ ద్వారా బషీర్‌బాగ్‌లోని కమిషనర్ కార్యాలయంలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేస్తారు. ప్రయోజనాలు.. బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 12లోని దృశ్యాలు కావాలనుకుంటే బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయంలో కూర్చునే కమిషనర్ వీక్షించే అవకాశం కల్పించారు. ఇలా ఏ ఠాణా పరిధిలోని ఏ రోడ్డునైనా వీక్షించవచ్చు. ఊరేగింపులు, ర్యాలీలు, బహిరంగ సభలు, పండుగలు జరుగుతున్న ఏరియాను కమిషనర్ తన కార్యాలయం నుంచే వీక్షించే సదుపాయం. ఇక ఠాణా పరిధిలోని అన్ని గల్లీలు, రూట్లను కవర్ చేస్తూ ప్రణాళిక ప్రకారం సీసీటీవీలను ఏర్పాటు చేస్తారు. ఆ సెక్టార్ల ఎస్ఐలు ఠాణాల్లోనే కూర్చుని తమ పరిధిలో శాంతి భద్రతలు పర్యవేక్షించవచ్చు. మహిళలు ఇక నిర్భయంగా బంగారు గొలుసులు వేసుకుని తిరుగాడవచ్చు. ఎవరైనా స్నాచింగ్‌కు పాల్పడితే సీసీటీవీలో ఇట్టే గుర్తించవచ్చు. నిందితుడు ఏ రూట్లో... ఏ వాహనంపై వెళ్లాడనే వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. తద్వారా నేరం మిస్టరీ వెంటనే వీడడంతో పాటు నిందితుడు పట్టుబడేందుకు అవకాశం ఉంటుంది. నేరాలు తగ్గుముఖం పడతాయి. మహిళలను రోడ్లపై వేధించేవారు, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారిని సులువుగా సాక్ష్యాలతో పసిగట్టవచ్చు. నిందితులకు శిక్ష పడేందుకు ఉపయోగపడుతుంది. రోడ్డు ప్రమాదాల్లో తప్పొప్పులు దొరికిపోతాయి. షట్టర్ తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడే వారిని కనిపెట్టవచ్చు. {పతి ఠాణాలో 30 రోజులు ఈ దృశ్యాలను భద్రపరుస్తారు. ఆ తరువాత ఠాణాల ఫీడ్‌ను ప్రధాన సర్వర్‌లో భద్రపరుస్తారు. ఇదీ కెమెరాల ప్రత్యేకత పైలట్ ప్రాజెక్ట్‌లో ఏర్పాటు చేసిన కెమెరాలు తైవాన్ దేశానికి చెందినవి. మోటరైజ్ వురిఫికల్ ఫిక్స్డ్ ఐపీ కెమెరా 180 డిగ్రీల కోణంలో దృశ్యాలను చిత్రీకరిస్తుంది. పీటీజెడ్ కెమెరాలు 360 డిగ్రీల కోణంలో దృశ్యాలను కవర్ చేస్తాయి. కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్‌లో ఈ రెండు కెమెరాలను అమర్చుతారు. ఐపీ కెమెరా 50 మీటర్ల వరకూ... జీటీజెడ్ కెమెరా కిలోమీటర్ దూరం వరకు దృశ్యాలను కవర్ చేస్తాయి. -
నవంబర్ నుంచి అన్న క్యాంటీన్లు
మంత్రివర్గ ఉపసంఘం ప్రకటన చెన్నైలో అమ్మ క్యాంటీన్ల పరిశీలన చెన్నై : ఈ ఏడాది నవంబర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ‘అన్న క్యాంటీన్లు’ ప్రారంభించనున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం ప్రకటించింది. పైలట్ ప్రాజెక్టుగా తొలిదశలో నాలుగు జిల్లాల్లో ఈ క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు మంత్రులు నారాయణ, పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో నిర్వహిస్తున్న అమ్మ క్యాంటీన్ల తరహాలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటిపై అవగాహనకు చెన్నైలోని రెండు అమ్మ క్యాంటీన్లను మంత్రులు సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంలో 15, గుంటూరులో 10, అనంతపురం, తిరుపతిలలో ఐదేసి చొప్పున అన్న క్యాంటీన్లను తొలివిడతగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
ఇక తాండూరుకు ‘ఎల్ఈడీ’ కాంతులు!
తాండూరు: తాండూరు మున్సిపాలిటీ ఇక ధగధగ మెరిసి పోనున్నది. ఎల్ఈడీ విద్యుత్ దీపాల వెలుతురుతో మున్సిపాలిటీ ప్రధాన వీధులు మరింత ప్రకాశించనున్నాయి. ఈ కొత్త ఎల్ఈడీ వీధిదీపాల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైలట్‌ప్రాజెక్టుగా జిల్లాలో తాండూరు మున్సిపాలిటీని ఎంపిక చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్‌ను పొదుపు చేయడంతోపాటు వీధిదీపాల వినియోగంలో లక్షల రూపాయల వ్యయాన్ని తగ్గించాలనే ఆలోచనతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఈనిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఐదు మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు ఏడు మున్సిపాలిటీలు ఈ ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు ఎంపికయ్యాయి. ఇటీవల నిజామాబాద్ జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో తాండూరు మున్సిపాలిటీ నుంచి సుమారు 300 ఎల్ఈడీ దీపాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఇందులో భాగంగా మొదట సుమారు 200 దీపాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన మార్గాల్లో 250 వాట్స్ కలిగిన సోడియం వేపర్(ఎస్వీ) దీపాలు ఉన్నాయి. వీటి వల్ల విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. నెలకు రూ.9 లక్షలు వ్యయం అవుతుంది. ఈనేపథ్యంలో ఎస్వీ దీపాల స్థానంలో కొత్తగా 90 వాట్స్ కలిగిన ఎల్ఈడీ దీపాలను సర్కారు ఏర్పాటు చేయనున్నది. ఎస్వీ దీపాలకంటే రెట్టింపు వెలుతురు ఉండటంతోపాటు విద్యుత్పొదుపు అవుతుంది. ఖర్చు కూడా తగ్గుతుంది. త్వరలోనే ఈ ఎల్ఈడీ దీపాల ఏర్పాటుతో మున్సిపాలిటీకి కొత్త శోభరానుంది. -
బస్తీల్లో మెరుగైన ‘మరుగు’
- తమిళనాడు తరహాలో నమ్మ, ఈ-టాయిలెట్ల నిర్మాణం - పైలట్ ప్రాజెక్టుగా నగర పాలక సంస్థల్లో ఏర్పాటు - వచ్చే నెల 31లోగా వినియోగంలోకి తేవాలని ఆదేశాలు సాక్షి, రాజమండ్రి : తమిళనాడు ప్రభుత్వం చెన్నై, తిరుచిరాపల్లిల్లో ఈ సంవత్సరారంభం నుంచి వినియోగంలోకి తెచ్చిన నమ్మ (మన) టాయిలెట్లు, ఈ-టాయిలెట్లను మన రాష్ట్రంలోనూ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయనున్నారు. అత్యాధునికమైన తరహాలో ఉండే ఈ రెండు రకాల టాయిలెట్లనూ రకానికి ఒకటి చొప్పున ప్రతి నగర పాలక సంస్థ పరిధిలో వచ్చే నెల 31 లోగా ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ నుంచి కమిషనర్లకు ఆదేశాలు అందాయి. జిల్లాలోని రెండు నగరపాలక సంస్థల్లో ఒక ఈ-టాయిలెట్‌ను, ఒక నమ్మ టాయిలెట్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయనున్నారు. తర్వాత వాటిని మున్సిపాలిటీలకు విస్తరిస్తారు. నగరాల్లో పారిశుధ్యాన్ని మెరుగు పరిచేందుకు, ప్రజలకు కాలుష్యరహిత వాతావరణంలో మెరుగైన మరుగు సదుపాయం కల్పించాలని తమిళనాడు ప్రభుత్వం ఈ రెండు రకాల మరుగుదొడ్లను నిర్మిస్తోంది. తీరులో కొంచెం వ్యత్యాసమున్నా రెండూ ఒకే విధమైన నిర్వహణా విధానాన్ని కలిగి ఉంటాయి. వీటికి వెంటిలేషన్, నీటి సదుపాయం మెరుగ్గా ఉంటాయి. ప్రతి చోటా అనుబంధంగా వాటర్ ట్యాంకును ఏర్పాటుేస్తారు. ఈ టాయిలెట్లలో మూడు గదులుంటాయి. వీటి లైటింగ్ కోసం సోలార్ వ్యవస్థను అమరుస్తారు. పారిశుధ్య సమస్య తలెత్తకుండా వ్యర్థాలతో బయో గ్యాస్ ఉత్పత్తి చేసే విధానం ప్రస్తుతం పరిశీలనతో ఉంది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలోనే ఏర్పాటు.. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా రుసుము చెల్లించి, వినియోగించుకునే విధానంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అత్యున్నత పారిశుధ్య ప్రమాణాలతో కూడిన ఈ రెండు రకాల టాయిలెట్లను తమిళనాట మొత్తం 385 ఏర్పాటు చేయాలని గత ఏడాది నవంబరులో నిర్ణయించారు. ఈ ఏడాది ఆరంభం నాటికి చెన్నై, తిరుచిరాపల్లిల్లో సుమారు 34 వరకూ ఏర్పాటు చేశారు. ప్రధానంగా దేవాలయాలు, బస్‌స్టేషన్ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. మన రాష్ట్రం నుంచి ఓ ప్రతినిధుల బృందం ఆ రెండు నగరాలకూ వెళ్లి ఆ టాయిలెట్లను అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది. అది అందిన వెంటనే ప్రభుత్వం మన నగరాల్లోనూ వాటిని ఆగమేఘాలపై ఏర్పాటు చేయడానికి సంకల్పించింది. నమ్మ, ఈ- టాయిలెట్లను నిర్మించి, నిర్వహించే పద్ధతిలో టెండర్లు పిలవాలని ఆదేశించింది. ఒక్కో టాయిలెట్‌కు రూ.8 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఈనెల 27లోగా అనువైన స్థల సేకరణ చేసి టెండర్లు పిలిచి పనులు ఖరారు చేయాలని పురపాలకశాఖ డెరైక్టర్ డి.వరప్రసాద్ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఆగస్టు 31లోగా నిర్మాణం పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని పేర్కొన్నారు. ఎక్కడైనా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ముందుకు రాకపోతే సాధారణ నిధుల నుంచి మున్సిపాలిటీలే స్వయంగా నిర్మించాలని సూచించారు. -
రేపే ‘పురా’ ప్రారంభం
హాజరుకానున్న కేంద్రమంత్రి జైరాం రమేష్ పదమూడేళ్లపాటు ప్రాజెక్టు అమలు రూ.168 కోట్లతో అభివృద్ధి పనులు మారనున్న పర్వతగిరి రూపురేఖలు సాక్షి, హన్మకొండ: ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న పుర (ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఎమినిటీస్ ఇన్ రూరల్ ఏరియా) పథకం ప్రారంభం కానుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ సోమవారం ఈ పథకాన్ని ప్రారంభించన్నునారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు పర్వతగిరి మండలాన్ని ఎంపిక చేశారు. మొదట ఈ పథకాన్ని ఆదివారం ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. అయితే అది సోమవారానికి వాయిదా పడింది. మూడేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టు జిల్లాకు మంజూరైనా ఇప్ప టి వరకు ప్రారంభించ లేదు. దాంతో అసలు పథకం జిల్లాలో అమలవుతుం దా లేదా అనే సందేహాలు ఇంతకాలం నెలకొన్నాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ముగియడానికి కొన్ని రోజు ల ముందుగా ఈ పథకం ప్రారంభం కానుండడం జిల్లాకు శుభపరిణామం. గ్రామాలు స్వయంపోషకాలు.. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలను నిరోధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘పుర’ పథకాన్ని చేపట్టింది. ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయడం ద్వారా గ్రామాలు పట్టణాల తరహాలో స్వయం పోషకాలుగా అభివృద్ధి చెందడంతో పాటు అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతారుు. రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్చంద సంస్థల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపడుతోంది. ఈ పథకం కింద పర్వతగిరి మండలానికి రూ.168.52 కోట్లు కేటాయించనున్నారు. వీటిలో కేంద్ర ప్రభుత్వం వాటా 73 శాతం అంటే రూ.123.34కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వాటా 15 శాతం అంటే రూ.25.80 కోట్లతో పాటు భాగస్వామ్య సంస్థల వాటా 11 శాతం అంటే రూ.19.38కోట్లు ఉంటాయి. వీటితో పర్వతగిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారు. జనవరిలో కదలిక పురా పథకంలో భాగంగా 2011లో మన రాష్ట్రంలో వరంగల్, కృష్ణ జిల్లాలను మొదటిదశలో ఎంపిక చేశారు. మూడేళ్ల కిందట మంజూరైనా ఈ సంవత్సరం జనవరిలో కదలిక వచ్చింది. పురా పథకం కింద ఎంపికైన పర్వతగిరి మండలంలోని పది గ్రామపంచాయతీల్లో రూ.8.34 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చేదాటిపోతుందనుకున్న పథకానికి జీవం వచ్చినట్టైంది. జనవరిలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తారని అంతా అనుకున్నారు. అయితే జనవరిలో అసెంబ్లీ సమావేశాలు, ఫిబ్రవరిలో పార్లమెంటు సమావేశాలు ఉండటంతో ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఎన్నికల నోటిఫికేషన్‌కు కొన్ని రోజుల సమయమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ పథకం ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. మినీ టౌన్లుగా పల్లెలు.. ఎంపిక చేసిన మండలంలో పదమూడేళ్లపాటు ప్రాజెక్టు నిర్వాహణ చేయాల్సి ఉంటుంది. పురా ప్రాజెక్టు కింద వెచ్చించే నిధులతో పర్వతగిరి మండలంలోని చౌటపల్లి, చింతనెక్కొండ, రోళ్లకల్, నారాయణపురం, సోమారం, జమాళ్లపురం, పర్వతగిరి, కల్లెడ, రావూరు, పెద్దతండ గ్రామాలను మినీటౌన్లుగా తీర్చిదిద్దుతారు. గ్రామాల్లో నిరంతరాయంగా సాగునీరు, తాగునీరు సౌకర్యాలు కల్పిస్తారు. వ్యవసాయం, కూరగాయల పెంపకంలో అధునాత పద్ధతులు అనుసరించడంలో శిక్షణ ఇస్తారు. వ్యవసాయ ఉత్పత్తులు నిల్వచేసేందుకు కోల్డ్‌స్టోరేజ్‌లు నిర్మిస్తారు. పంటలు తరలించేందుకు ప్రత్యేక వాహనాల ఏర్పాటు, అండర్‌గ్రౌండ్ డ్రెరుునేజీ, విద్యత్ దీపాలంక రణ, ఇంటర్నెట్ సదుపాయాలు, రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఈ పథకం పూర్తిస్థాయిలో అమలైతే వరంగల్ నగరానికి శాటిలైట్ సిటీగా పర్వతగిరి మండలం రూపాంతరం చెందుతుంది. -
గండంలో చిక్కిన వేళ.. సరికొత్త అండ
సాక్షి ప్రతినిధి, కాకినాడ : నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగించే మత్స్యకారుల కోసం ఎంఎస్ స్వామినాధన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్) సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరి చేతిలోనూ ఉండే మొబైల్ ఫోన్ ద్వారా అందుబాటులో ఉండే ఈ పరిజ్ఞానం మత్స్యకారులకు ఎంతో మేలు చేయనుంది. మన జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ పరిజ్ఞానం తమిళనాడు, పుదుచ్చేరి మత్స్యకారులకు అందుబాటులోకి వచ్చింది. స్వామినాధన్ ఫౌండేషన్ 2009లోనే జీపీఎస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ అప్లికేషన్లను ఉపయోగించుకొని మత్స్యకారులకు ఉపయోగపడేలా ఈ సాఫ్ట్వేర్ రూపొందిం చారు. క్యూల్కామ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లతో కలిసి ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ ఈ ఫిషర్ ఫ్రెండ్ మొబైల్ అప్లికేషన్ (ఎఫ్ఎఫ్ఎంఎ) అభివృద్ధి చేశారు. ఈ అధునాతన సాఫ్ట్‌వేర్‌ను మత్స్యకారులకు ఉచితంగా అప్లోడ్ చేస్తారు. ‘మత్స్యకార స్నేహిత మొబైల్’ (మత్స్యకార మిత్రుడి మొబైల్ అప్లికేషన్స్) పేరిట రూపొందించిన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలెక్టర్ నీతూ ప్రసాద్ మంగళవారం ప్రారంభించారు. జిల్లాలోని మత్స్యకారులందరికీ సబ్సిడీపై ఈ అప్లికేషన్లతో కూడిన ఆధునిక మొబైల్ సెట్లను అందించేందుకు సహకరిస్తామని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. ఈ మేరకు రాష్ర్ట మత్స్యశాఖ కమిషనర్‌కు ప్రతిపాదన పంపుతామన్నారు. మత్స్యకారులకు మరింత ప్రయోజనం కలిగేవిధంగా ఏదైనా ప్రాజెక్టు రూపొందిస్తే రూ.10 లక్షలు విడుదల చేస్తానని ప్రకటించారు. స్వామినాధన్ ఫౌండేషన్ డెరైక్టర్ నాన్సీ జే.అనేబుల్ మాట్లాడుతూ, ఆంగ్లంతోపాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టుపై ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎస్.వెల్విజి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఆర్.రామసుబ్రహ్మణ్యన్, ఆత్మ పీడీ కె.సీతారామరాజు, జేడీ విజయ్‌కుమార్, ఇన్కాయిస్ సైంటిస్ట్ నాగరాజకుమార్, ఆత్మ డీపీడీ అంజలి తదితరులు పాల్గొన్నారు.