సాక్షి ప్రతినిధి, కాకినాడ : నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగించే మత్స్యకారుల కోసం ఎంఎస్ స్వామినాధన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్) సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరి చేతిలోనూ ఉండే మొబైల్ ఫోన్ ద్వారా అందుబాటులో ఉండే ఈ పరిజ్ఞానం మత్స్యకారులకు ఎంతో మేలు చేయనుంది. మన జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.
ఇప్పటికే ఈ పరిజ్ఞానం తమిళనాడు, పుదుచ్చేరి మత్స్యకారులకు అందుబాటులోకి వచ్చింది. స్వామినాధన్ ఫౌండేషన్ 2009లోనే జీపీఎస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ అప్లికేషన్లను ఉపయోగించుకొని మత్స్యకారులకు ఉపయోగపడేలా ఈ సాఫ్ట్‌వేర్ రూపొందిం చారు. క్యూల్‌కామ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లతో కలిసి ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్ ఈ ఫిషర్ ఫ్రెండ్ మొబైల్ అప్లికేషన్ (ఎఫ్‌ఎఫ్‌ఎంఎ) అభివృద్ధి చేశారు. ఈ అధునాతన సాఫ్ట్‌వేర్‌ను మత్స్యకారులకు ఉచితంగా అప్‌లోడ్ చేస్తారు.
‘మత్స్యకార స్నేహిత మొబైల్’ (మత్స్యకార మిత్రుడి మొబైల్ అప్లికేషన్స్) పేరిట రూపొందించిన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలెక్టర్ నీతూ ప్రసాద్ మంగళవారం ప్రారంభించారు. జిల్లాలోని మత్స్యకారులందరికీ సబ్సిడీపై ఈ అప్లికేషన్లతో కూడిన ఆధునిక మొబైల్ సెట్లను అందించేందుకు సహకరిస్తామని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. ఈ మేరకు రాష్ర్ట మత్స్యశాఖ కమిషనర్‌కు ప్రతిపాదన పంపుతామన్నారు.
మత్స్యకారులకు మరింత ప్రయోజనం కలిగేవిధంగా ఏదైనా ప్రాజెక్టు రూపొందిస్తే రూ.10 లక్షలు విడుదల చేస్తానని ప్రకటించారు. స్వామినాధన్ ఫౌండేషన్ డెరైక్టర్ నాన్సీ జే.అనేబుల్ మాట్లాడుతూ, ఆంగ్లంతోపాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టుపై ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎస్.వెల్‌విజి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఆర్.రామసుబ్రహ్మణ్యన్, ఆత్మ పీడీ కె.సీతారామరాజు, జేడీ విజయ్‌కుమార్, ఇన్‌కాయిస్ సైంటిస్ట్ నాగరాజకుమార్, ఆత్మ డీపీడీ అంజలి తదితరులు పాల్గొన్నారు.
గండంలో చిక్కిన వేళ.. సరికొత్త అండ
Published Wed, Dec 11 2013 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
Advertisement