‘బేటి బచావో’.. పైలట్ ప్రాజెక్టుకు హైదరాబాద్ ఎంపిక
సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో బాలుర కంటె బాలికల శాతం తక్కువగా ఉన్న హైదరాబాద్ జిల్లా.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ‘బేటీ బచావో.. బేటీ పడావో’ పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసింది. దేశంలో 100 జిల్లాలు ఈ పథకం కింద ఎంపిక కాగా, తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, కడప జిల్లాలను ఎంపిక చేశారు. హైదరాబాద్ జిల్లాలో 1000 మంది బాలురకు, 914 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. అక్షరాస్యతలో మాత్రం ఎక్కువగానే ఉంది. ఈ నేపధ్యంలో బాలికలను సంరక్షించుకోవడంతో పాటు, బాలికల అవశ్యకత, ప్రాముఖ్యతపై అవగాహన, చైతన్యాన్ని పెంచేందుకు ఈ పథకం కింద జిల్లాను ఎంపిక చేశారు. ఇందుకోసం వివిధ ప్రభుత్వ శాఖలు కృషి చేసే విధంగా అధికార యంత్రాంగం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ, విద్యా, మహిళా శిశు సంక్షేమ సమగ్ర అభివృద్ధి శాఖ, రెవెన్యూ, వయోజన విద్యాశాఖ భాగస్వామ్యం అవుతాయి. సమన్వయంతో పనిచేసేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
కార్యక్రమం ఇలా..
ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీ జిల్లా ఐసీడీఎస్‌లోని ఐదు ప్రాజెక్టుల పరిధిలో నాలుగు ఏరియాల చొప్పున 20 ప్రాంతాలను ఎంపిక చేశారు. ఇందులో ఏరియాల వారిగా బాలురు, బాలికల సంఖ్యను సర్వే ద్వారా గుర్తించి ఆయా ప్రాంతాల్లో బోర్డులపై డీస్‌స్లే చేస్తారు. అదేవిధంగా స్వచ్ఛందంగా పనిచేసే 40 మంది వలంటీర్లను ఎంపిక చేశారు. వీరి ద్వారా ప్రతి నెల రెండో శుక్రవారం జిల్లాలోని 940 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న బాలికలు, గర్భిణిలు, బాలింతల పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేదికలపై బాలికల ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలు చేపడతారు. ఈ కార్యక్రమాన్ని ఏడాదికి పైగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం ప్రభుత్వం రూ.88 లక్షల నిధులు విడుదల చేయనున్నట్టు ఐసీడీఎస్ జిల్లా పీడీ ఆశ్రీత ‘సాక్షి’కి తెలిపారు.