బస్తీల్లో మెరుగైన ‘మరుగు’
- తమిళనాడు తరహాలో నమ్మ, ఈ-టాయిలెట్ల నిర్మాణం
- పైలట్ ప్రాజెక్టుగా నగర పాలక సంస్థల్లో ఏర్పాటు
- వచ్చే నెల 31లోగా వినియోగంలోకి తేవాలని ఆదేశాలు
సాక్షి, రాజమండ్రి : తమిళనాడు ప్రభుత్వం చెన్నై, తిరుచిరాపల్లిల్లో ఈ సంవత్సరారంభం నుంచి వినియోగంలోకి తెచ్చిన నమ్మ (మన) టాయిలెట్లు, ఈ-టాయిలెట్లను మన రాష్ట్రంలోనూ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయనున్నారు. అత్యాధునికమైన తరహాలో ఉండే ఈ రెండు రకాల టాయిలెట్లనూ రకానికి ఒకటి చొప్పున ప్రతి నగర పాలక సంస్థ పరిధిలో వచ్చే నెల 31 లోగా ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ నుంచి కమిషనర్లకు ఆదేశాలు అందాయి. జిల్లాలోని రెండు నగరపాలక సంస్థల్లో ఒక ఈ-టాయిలెట్‌ను, ఒక నమ్మ టాయిలెట్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయనున్నారు. తర్వాత వాటిని మున్సిపాలిటీలకు విస్తరిస్తారు.
నగరాల్లో పారిశుధ్యాన్ని మెరుగు పరిచేందుకు, ప్రజలకు కాలుష్యరహిత వాతావరణంలో మెరుగైన మరుగు సదుపాయం కల్పించాలని తమిళనాడు ప్రభుత్వం ఈ రెండు రకాల మరుగుదొడ్లను నిర్మిస్తోంది. తీరులో కొంచెం వ్యత్యాసమున్నా రెండూ ఒకే విధమైన నిర్వహణా విధానాన్ని కలిగి ఉంటాయి. వీటికి వెంటిలేషన్, నీటి సదుపాయం మెరుగ్గా ఉంటాయి. ప్రతి చోటా అనుబంధంగా వాటర్ ట్యాంకును ఏర్పాటుేస్తారు. ఈ టాయిలెట్లలో మూడు గదులుంటాయి. వీటి లైటింగ్ కోసం సోలార్ వ్యవస్థను అమరుస్తారు. పారిశుధ్య సమస్య తలెత్తకుండా వ్యర్థాలతో బయో గ్యాస్ ఉత్పత్తి చేసే విధానం ప్రస్తుతం పరిశీలనతో ఉంది.
ఔట్ సోర్సింగ్ పద్ధతిలోనే ఏర్పాటు..
ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా రుసుము చెల్లించి, వినియోగించుకునే విధానంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అత్యున్నత పారిశుధ్య ప్రమాణాలతో కూడిన ఈ రెండు రకాల టాయిలెట్లను తమిళనాట మొత్తం 385 ఏర్పాటు చేయాలని గత ఏడాది నవంబరులో నిర్ణయించారు. ఈ ఏడాది ఆరంభం నాటికి చెన్నై, తిరుచిరాపల్లిల్లో సుమారు 34 వరకూ ఏర్పాటు చేశారు. ప్రధానంగా దేవాలయాలు, బస్‌స్టేషన్ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. మన రాష్ట్రం నుంచి ఓ ప్రతినిధుల బృందం ఆ రెండు నగరాలకూ వెళ్లి ఆ టాయిలెట్లను అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది.
అది అందిన వెంటనే ప్రభుత్వం మన నగరాల్లోనూ వాటిని ఆగమేఘాలపై ఏర్పాటు చేయడానికి సంకల్పించింది. నమ్మ, ఈ- టాయిలెట్లను నిర్మించి, నిర్వహించే పద్ధతిలో టెండర్లు పిలవాలని ఆదేశించింది. ఒక్కో టాయిలెట్‌కు రూ.8 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఈనెల 27లోగా అనువైన స్థల సేకరణ చేసి టెండర్లు పిలిచి పనులు ఖరారు చేయాలని పురపాలకశాఖ డెరైక్టర్ డి.వరప్రసాద్ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఆగస్టు 31లోగా నిర్మాణం పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని పేర్కొన్నారు. ఎక్కడైనా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ముందుకు రాకపోతే సాధారణ నిధుల నుంచి మున్సిపాలిటీలే స్వయంగా నిర్మించాలని సూచించారు.