- అభివృద్ధి ప్రణాళికకు రూపకల్పన
కూడేరు : నీటి సంరక్షణ పథకం కింద పంచాయతీల అభివృద్ధిలో భాగంగా మండల పరిధిలోని కమ్మూరు పంచాయతీని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు డ్వామా పీడీ నాగభూషణం తెలిపారు. ఉపాధి హామీ, ఆర్‌డబ్ల్యూఎస్, అగ్రికల్చర్, గ్రౌండ్ వాటర్, ఫారెస్టు, పశువైద్య శాఖ జిల్లా అధికారులు గురువారం కమ్మూరులో నీటి సంరక్షణకు సంబంధించి యాక్షన్ ప్లాన్‌కు రూపకల్పన చేశారు. రీసెర్చ్ మ్యాప్ నమూనాతో ఐదేళ్లలో పంచాయతీ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై చర్చించారు. డ్వామా పీడీ మాట్లాడుతూ ఈ రూపకల్పన విజయవంతమైన తర్వాత జిల్లాలో మిగిలిన పంచాయతీలలో దీన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. నెలరోజుల పాటు భూగర్భ జలాలను ఎలా సంరక్షించుకోవాలి, పంచాయతీ అభివృద్ధికి ఏం చేయాలి అనే వాటిపై శిక్షణ ఇచ్చి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా క్లష్టర్ ఏపీడీ అయేషాతోపాటు 12 మంది ఏపీడీలు, డబ్ల్యూఎంపీ పీఓ రామయ్య శ్రేష్ఠి, తహశీల్దార్ వసంతలత, ఎంపీడీఓ రాజమన్నార్, ఈఓఆర్డీ గంగావతి, ఏపీఓ నాగమణి, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.