
రోడ్డెక్కిన ఖాతాదారులు
- అనంతపురం- బళ్లారి ప్రధాన రహదారిపై రాస్తారోకో
కూడేరు: ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండానే కేంద్రం పెద్దనోట్లు రద్దు చేయడం వల్ల డబ్బు కోసం భిక్షం ఎత్తుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని పలువురు వాపోయారు. గురువారం కూడేరులో స్టేట్ బ్యాంక్ వద్దకు సుమారు 300 మంది రాగా, బ్యాంక్ అధికారులు క్యాష్ లేదని చెప్పారు. దీంతో ఆగ్రహించిన వారు రోజూ ఇదే మాట చెబితే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అనంతపురం – బళ్ళారి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. దాదాపు రెండు గంటలపాటు వారంతా రోడ్డుపైనే బైఠాయించడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. మేనేజర్ జయశీల్, పోలీసులు వచ్చి వారికి సర్ది చెప్పారు. ప్రస్తుతం టోకన్లు ఇస్తామని, డబ్బు రాగానే నగదు పంపిణీ చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.